Sun arghyam: ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
Sun arghyam: హిందూ శాస్త్రం ప్రకారం ప్రతి రోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం, శాస్త్రీయ పరంగా ఇది చాలా మంచి అలవాటుగా చెప్తున్నారు.
Sun arghyam: హిందూ శాస్త్రం ప్రకారం ప్రజలు అనేక మంది దేవుళ్లను పూజిస్తారు. వారిలో సూర్య భగవానుడు, చంద్రుడు ప్రత్యేకమైనవాళ్ళు. ఎందుకంటే పురాతన కాలం నుంచి వీరిని పూజిస్తూ వచ్చారు.
మహాభారతం, రామాయణంలోనూ సూర్య భగవానుడు, చంద్రుడి గురించి ప్రస్తావన ఉంటుంది. రామాయణంలో శ్రీరాముడు స్వయంగా సూర్యుడిని పూజించాడని నీటితో అర్ఘ్యం సమర్పించారని చెబుతారు. అలాగే మహాభారతంలో ఐదుగురు పాండవుల తల్లి అయిన కుంతిదేవి సూర్య భగవానుడి ఆశీస్సులతో కర్ణుడికి జన్మనిచ్చింది.
ఆదివారం సూర్యుడికి అంకితం చేసిన రోజు. అయితే చాలామంది ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించి తమ రోజుని ప్రారంభిస్తారు. అసలు సూర్యుడికి నీటిని సమర్పించడం ఎందుకు చేస్తారు? ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు సమర్పిస్తారు?
సూర్యుడికి నీరు సమర్పించడం అనేది ప్రతి ఉదయం చేసే ఒక మతపరమైన చర్య మాత్రమే కాదు ఇది జీవితానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. హిందూ విశ్వాసాల ప్రకారం సూర్యుడిని చాలా శక్తివంతుడిగా పరిగణిస్తారు. సూర్యుడు సంతోషంగా ఉంటే అది మన జీవితాలను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. సూర్యునికి నీటిని అందించడం వల్ల కలిగే కొన్ని ముఖ్య ప్రయోజనాలు ఇవి.
సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి సమస్యలు ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మంచి ఉద్యోగం పొందాలని అనుకుంటే మీరు సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చురుగ్గా పని చేస్తారు.
సూర్యుడు గుండె ఆరోగ్యానికి అనుసంధానించబడి ఉన్నాడు. సూర్యుడికి నిత్య ప్రార్ధనలు, నైవేద్యాలు సమర్పించడం వల్ల హృదయం దృఢంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మన కుటుంబ జీవితం, ఆస్తి విషయాలను కూడా ప్రభావితం చేస్తాడు. క్రమమైన ఆరాధన వల్ల కుటుంబ వివాదాలు పరిష్కార అవుతాయి.
సూర్యుడికి నీరు అందించడం వెనక శాస్త్రీయమైన కారణం కూడా ఉంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉదయం వేళ సూర్యకాంతి నుంచి పడే లేలేత కిరణాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే నీటి ద్వారా సూర్యుని చూడటం వల్ల కళ్ళకు చాలా మంచిది.
జ్యోతిషశాస్త్ర పరంగా సూర్యుడు అన్ని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. నీటిని సమర్పించడం వల్ల సూర్యుడు సంతోషించి జీవితాన్ని అదృష్టవంతం చేస్తాడని నమ్ముతారు.
అర్ఘ్యం సమర్పించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేందుకు స్వచ్ఛమైన రాగి పాత్రను ఉపయోగించాలి. గౌరవ సూచికంగా నీటిలో ఒక పువ్వు లేదా కొంచెం బియ్యం ఉంచాలి. ఎప్పుడూ తూర్పు వైపు ముఖం పెట్టి నీళ్లు మీ పాదాలపై పడకుండా అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడికి సమర్పించే నీరు కాళ్ళ మీద పడితే అది ఆ గౌరవంగా భావిస్తారు. మేఘావృతమై ఉండి సూర్యుడిని చూడలేకపోయినా తూర్పు ముఖంగా నిలబడి అర్ఘ్యం సమర్పించాలి.
సూర్యుడికి నీటిని సమర్పించేటప్పుడు జపించే అత్యంత సాధారణమైన వేదమంత్రాలలో గాయత్రీ మంత్రం ఒకటి అలాగే నీటిని సమర్పించేటప్పుడు “ఓం సూర్యాయ నమః” అని కూడా పఠించవచ్చు. సూర్య బీజ మంత్రాన్ని కూడా జపించవచ్చు. “ఓం హ్రం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః” అనే మంత్రాన్ని పఠించాలి. జీవితంలో సూర్యుడు ప్రతికూల ప్రభావాన్ని తొలగించుకునేందుకు ఈ మంత్రం ఉపయోగపడుతుంది. సూర్యోదయ సమయంలో నీటిని సమర్పించేటప్పుడు ఆదిత్యుడి 12 పేర్లు పాటించడం కూడా చాలా గౌరవప్రదమైన ఆచారంగా పరిగణిస్తారు.