Dasapapahara dasami 2024: పది పాపాలు పోగొట్టే దశపాపహర దశమి ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?
Dasapapahara dasami 2024: గంగా దసరా ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత ఏంటి? దశ పాపాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి అనే వివరాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా తెలియజేశారు.
Dasapapahara dasami 2024: జూన్ 16, 2024.. చిలకమర్తి పంచాంగరీత్యా, ధృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా జ్యేష్ఠ మాస శుక్ల పక్ష దశమిని దశ పాపహర దశమని అలాగే, గంగా దశమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పురాణ కథనాల ప్రకారం గంగా నది భూమి మీదకు అడుగుపెట్టిన రోజు జ్యేష్ఠ శుద్ధ దశమని చిలకమర్తి తెలిపారు. వైశాఖ దశమి రోజు గంగా జననం జరిగినప్పటికీ , భూమి మీద ఆమె కాలు మోపిన రోజు జ్యేష్ఠ శుద్ధ దశమిగా చెప్పబడింది. ఆరోజున గంగా స్నానం ఆచరించడం అత్యంత శుభకరమని చిలకమర్తి తెలిపారు. ఏ వ్యక్తి అయితే ఈరోజున సంకల్ప సైతంగా పుణ్య నదులలో గానీ, తటాకంలో గానీ, సముద్రమందు గానీ గంగా దేవిని స్మరించుకుని స్నానమాచరిస్తారో అటువంటి వారి దశ పాపాలు (పది రకాల పాపాలు) హరింపబడతాయి అని చిలకమర్తి తెలిపారు.
పది పాపాలు ఏవి?
1. దశ పాపములు అనగా పరుషంగా మాట్లాడటం
2. అబద్ధాలు చెప్పడం
3. అసంబద్ధమైన మాటలు మాట్లాడటం
4. సమాజం వినలేని చెడు మాటలు
5. తనది కాని ధనం కోసం ఆశపడటం
6. వస్తువులపై వ్యామోహం
7. ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు, ఇతరులకు చెడు చేయాలనుకోవడం
8. అర్హతలేని వారికి దానం ఇవ్వడం
9. జీవ హింస
10. వ్యభిచారం వంటివిగా చిలకమర్తి తెలిపారు.
ఇలా మాటలతో లేదా శరీరంతో లేదా మనసుతో తెలిసి కానీ తెలియక కానీ చేసే దశ పాపములను జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు సంకల్ప సహితంగా గంగానదిని స్కరించుకుని స్నానం ఆచరించినటువంటివారికి దశ పాపాలు తొలుగుతాయని స్కంద పురాణం తెలియజేస్తున్నట్టు చిలకమర్తి తెలిపారు. ఓం నమః శ్శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. అలాగే ఈరోజు గంగా దేవిని పూజించడం, గంగావ్రతం వంటివి ఆచరించడం, శ్రీ మహావిష్ణువుని లేదా శివుడిని పూజించడం చేత పుణ్యం కలుగుతుందని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.