Vastu Tips- Debts | రుణ భారం నుంచి బయటపడాలంటే.. ఈ వాస్తు నియమాలను పాటించండి!
Vastu Tips for Get Rid of Debts : ఏం చేసినా కూడా రుణాలు చెల్లించలేకపోతున్నారా.. ఈ వాస్తు నియమాలు పాటించి చూడండి, ఆర్థికంగా లాభపడతారు, అప్పుల బాధలు అనేవి ఉండవు.
Vastu Tips for Get Rid of Debts : జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టాలను అనుభవిస్తారు. అయితే వీరిలో ఎక్కువ మంది ఆర్థికపరమైన ఇబ్బందులనే ఎదుర్కొంటారు. తమ ఆర్థిక బాధల నుంచి బయట పడేందుకు ప్రజలు రుణాలు తీసుకుంటారు, కానీ తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేక చాలా ఒత్తిడికి గురవుతారు. చేసిన అప్పులు తీర్చలేని కొందరు తమ జీవితాన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ముగించుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. అయితే ప్రతీ సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంటుంది. రుణ బాధల నుంచి విముక్తి పొందటానికి జీవితంలో కష్టపడి పనిచేయాలి. మీరు కష్టపడే వారైతే మీ కష్టానికి దైవ సహాయం కూడా లభిస్తుంది.
వాస్తు శాస్త్రంలో కూడా రుణ విముక్తికి పరిహారాలు అందివ్వడమైనది. కొన్ని వాస్తు నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి కొలువుదీరుతుంది, ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, ఒక్కసారిగా తొలగిపోతాయి. స్త్రీలైనా, పురుషులైనా, వివాహితులైనా, అవివాహితులైనా, పురాతన శాస్త్రాలలో చెప్పినట్లుగా కొన్ని వాస్తు నియామాలను పాటిస్తే ఋణాలు సులువుగా తీరి సంతోషంగా ఉండొచ్చు. దాని కోసం ఇక్కడ వాస్తు చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
పరిశుభ్రత ప్రధానం
అపరిశుభ్ర వాతావరణం ప్రతికూల శక్తికి ఆవాసం, పేదరికానికి సంకేతం. ప్రదేశాలను సానుకూల శక్తితో నింపాలంటే పరిశుభ్రత చాలా ముఖ్యం. వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలి, తమ ఇంటిని, పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉండటం వలన మీ మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంచి ఆలోచనలు చేయగలుగుతారు. అలాగే పరిశుభ్రమైన ఇంటిలోనే లక్ష్మీదేవి కొలువు తీరుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం ఇల్లు ఊడ్చి శుభ్రపరుచుకోవాలి. వీలైనంత త్వరగా సాయంత్రం 5:30 లోపు ఇల్లు ఊడ్చాలి, ఆ తర్వాత ఇంటిలోని చెత్త ఊడ్చేస్తే లక్ష్మిని ఇంటి నుంచి పంపిస్తున్నట్లు అర్థం.
సంధ్యా సమయంలో నిద్రపోకూడదు
ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే సంధ్యా సమయంలో నిద్రపోయినపుడు వారిని తట్టి లేపి మందలిస్తుంటారు. సంధ్యా సమయంలో తినడం గానీ, నిద్రపోవడం మంచిది కాదని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం నిద్రపోవడం చాలా తప్పు. మీరు ఇలా చేస్తుంటే, వెంటనే ఆ అభ్యాసాన్ని ఆపండి. ఎందుకంటే సాయంత్రం పూట పడుకోవడం వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే అప్పుల భారం కూడా పెరుగుతుంది. కాబట్టి సాయంత్రం నిద్రకు ఉపక్రమించకుండా ఇంటి పనుల్లో నిమగ్నం అవండి. ఇంటిని శుభ్రం చేసుకోవడం, మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవడం, ఇష్టమైన దేవతలను పూజించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సును కూడా తెస్తుంది.
సాయంత్రం వేళ మొక్కలను తాకకూడదు
వాస్తు శాస్త్రం ప్రకారం, సాయంత్రం వేళలో తులసి ఆకులను, దళాలను పూజ కోసం లేదా మరేదైనా అవసరాల కోసం కోయకూడదు. అలాగే సాయంత్రం పూట ఎటువంటి మొక్కల పూలను కోయకూడదు. ఇలా చేయడం వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది. అలాగే సాయంత్రం వేళల్లో ఎవరి దగ్గర డబ్బు తీసుకోవడం గానీ లేదా ఇతరులకు డబ్బులు ఇవ్వడం గానీ చేయకూడదు. ఇది మరిన్ని ఆర్థిక సమస్యలను సృష్టించగలదు.
ఆహారాన్ని వృధా చేయవద్దు
ఆహారం దైవ స్వరూపం, కొంతమంది ఆహారాన్ని తాము తినకుండా, ఇతరులకు పెట్టకుండా వృధాగా పారేస్తారు. ఆహారాన్ని నిల్వచేసి వృధాగా పారేయడం చేస్తే ధాన్య లక్ష్మికి ఆగ్రహం కలుగుతుంది. ఇది మీకు తినడానికి తిండిలేని పేదరికాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఆహారాన్ని ఎప్పుడూ వృధాగా పారేయవద్దు, మీరు తినలేని ఆహారాన్ని ఇతరులకు పెట్టండి. పశుపక్షాదులకు పెట్టడమైనా మంచిదే. మీరు ఆవులు, చీమలు, చేపలు, పశువులు, పక్షులకు ఆహారం అందిచడం ద్వారా లభించే పుణ్యఫలంతో మీ రుణ భారం తగ్గుతుంది.
రణముక్తేశ్వర ఆలయాన్ని సందర్శించండి
మీకు రుణ బాధలు ఎక్కువైనపుడు, వీలైతే ఇంట్లో అందరూ ఒకసారి ఉజ్జయిని మహాకాళేశ్వరంలో ఉన్న రణముక్తేశ్వర ఆలయాన్ని సందర్శించండి. కుటుంబ సభ్యులందరూ వెళ్లలేకపోతే ఒక్కరైనా వెళ్లండి. ఋణం తీర్చుకోవాలంటే శివుని అనుగ్రహం కూడా చాలా ముఖ్యం. భగవంతుని దయ లేకుండా ఏదీ సాధ్యం కాదు. ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించండి. ఓం రణముక్తేశ్వర మహాదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
కుబేర యంత్రాన్ని పూజించండి
చేసిన అప్పులు తీరి ధనవంతులు కావడానికి పైన పేర్కొన్న వాస్తు చిట్కాలతో పాటు కుబేర యంత్రాన్ని ఇంటికి తెచ్చి పూజించండి. శమీ ఆకులతో ఈ యంత్రాన్ని పూజిస్తే వీలైనంత త్వరగా రుణ విముక్తి కలుగుతుంది. కుబేర యంత్రం లేకపోతే, భక్తితో కుబేర మంత్రాన్ని జపించి ప్రార్థించండి.
సంబంధిత కథనం
టాపిక్