Diwali 5 Days Festival : దీపావళికి ఆ ఐదురోజులు లక్ష్మీ దేవిని పూజిస్తే.. సకల సంతోషాలు మీవే..
5 Days of Diwali Festival : పురాణాల ప్రకారం దీపావళిని ఐదురోజులు సెలబ్రేట్ చేసుకోవాలి అంటారు. ఈ ఐదురోజులు.. సాయంత్రం కొన్ని నియమాలు పాటిస్తే.. వారికి ఆర్థికంగా ఎటుంవటి లోటు ఉండదని ప్రముఖ ఆధాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
5 Days of Diwali Festival : హిందూ సనాతన ధర్మంలో దక్షిణాయనానికి అందులోను విశేషంగా ఆశ్వయుజ కార్తీక మాసానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉందని ప్రముఖ ఆధాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. దక్షిణాయనంలో ఆశ్వయుజ మాసం బహుళ పక్ష త్రయోదశి నుంచి కార్తీకమాసం శుక్ల పక్ష ద్వితీయ వరకు ఈ 5 రోజులు దీపాల పండుగ, దీపావళి పండుగగా ప్రత్యేకంగా చేసుకుంటారు.
ఈ 5 రోజులు ఏ వ్యక్తి అయితే సాయంకాల సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకుని స్నానమాచరించి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తారో వారి జీవితంలో ధన, కనక, వస్తు, వాహనాదులకు లోటు ఉండదని పెద్దలు తెలిపారు. బహుళ పక్ష త్రయోదశి దీపావళి పండుగల్లో మొదటి రోజు. ఆ రోజు ధన త్రయోదశిగా.. లక్ష్మీదేవిని పూజించడం, లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేస్తారు.
దీపావళి పండుగలో మొదటి రోజు ధన త్రయోదశి రోజు. దీపావళి సమయంలో రెండవరోజు నరక చతుర్దశి. దీపావళి పండుగలో ప్రత్యేకమైనది ముఖ్యమైనది దీపావళి అమావాస్య. ఈరోజు ప్రతి ఒక్కరూ తలస్నానం ఆచరించి కొత్త బట్టలు కట్టుకుని లక్ష్మీదేవిని పూజించి దీపాలను వెలిగిస్తారు. దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసిన వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం. కృత యుగం ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు దీపావళిగా త్రేతాయుగం ప్రకారం శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు ప్రయాణం చేసిన రోజు దీపావళిగా, ద్వాపరయుగ ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకు వచ్చినటువంటి రోజు దీపావళిగా పురాణాలు తెలుపుతున్నాయి.
దీపావళి సమయంలో నాలగవ రోజు బలి పాడ్యమి. ఈరోజు బలి చక్రవర్తి తన రాజ్యాన్ని దానమిచ్చినటువంటి రోజు. ఈ రోజు వామనావతారంలోని విష్ణుమూర్తిని పూజిస్తారు. ఆ కథను వినడం అలాగే ఆ రోజు సాయంత్రం లక్ష్మీ ఆరాధన దీపారాధన చేయడం వలన విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుందని శాస్త్రములు తెలియచేస్తున్నాయి. దీపావళి సమయంలో ఐదవరోజు యమ ద్వితీయ. దీన్ని భాతృ విదియగా కూడా పిలుస్తారు. ఉత్తరాదిన రాముడు, భరతుడు మధ్య సమాగమన ఉదంతము జరిగిన రోజుగా పురాణాలు చెప్తున్నాయ్.
ఈ ఐదు రోజులు అభ్యంగ స్నానమచారించడం దీపారాధన చేయడం దీపాన్ని వెలిగించడం, లక్ష్మీదేవిని పూజించడం సాంప్రదాయం ఇలా చేసినటువంటి వారికి సకల సంపదలు కలిగి ఆయురారోగ్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి.
సంబంధిత కథనం