Naraka Chaturdashi 2022 : మరణమేలేని వరమును పొందిన నరకాసురుడు.. సత్యభామ చేతిలోనే ఎందుకు చనిపోయాడో తెలుసా?-naraka chaturdashi 2022 rituals and story and the name history ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Naraka Chaturdashi 2022 Rituals And Story And The Name History

Naraka Chaturdashi 2022 : మరణమేలేని వరమును పొందిన నరకాసురుడు.. సత్యభామ చేతిలోనే ఎందుకు చనిపోయాడో తెలుసా?

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 19, 2022 02:51 PM IST

Naraka Chaturdashi 2022 : దీపావళి అమావాస్యకు ముందు వచ్చేటటువంటి చతుర్దశినే.. ఆశ్వయుజ మాసం బహుళ చతుర్దశి అంటారు. దీనినే నరక చతుర్దశిగా చేసుకుంటామని.. ప్రముఖ ఆధాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అయితే దానికి ఆపేరు ఎలా వచ్చింది.. ఆరోజు ఎలాంటి నియమాలు పాటించాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నరకచతుర్థశికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..
నరకచతుర్థశికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..

Naraka Chaturdashi 2022 : పురాణాల ప్రకారం కృతయుగంలో హిరణ్యకశిపుని సంహరించినటువంటి వారాహ స్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకాసురుడు. అసుర సంధ్యా సమయంలో జన్మించుటచేత లోక కంఠకుడు, రాక్షసుడు అయ్యెను. నరకాసురుడు ఘోర తపస్సుచేత మరణము లేని వరమును పొందాడు. మరణము లేకుండా వరము అసాధ్యమని.. ఒక తల్లి బిడ్డను ఏనాడు చంపుకోదని భావించి తల్లి చేతిలోనే మరణించేలా వరమును పొందుతాడు.

తనకున్న వరముతో.. ద్వాపరముగంలో లోకకంఠకుడై నరకాసురుడు గర్వముతో ఉండేవాడు. ద్వాపర యుగంలో నరకాసురుడికి తండ్రి అయినటువంటి వారాహస్వామి (విష్ణుమూర్తి) శ్రీకృష్ణ భగవానుడిగా, తన తల్లియైనటువంటి భూదేవి సత్యభామగా జన్మించారు. అప్పటికి నరకాసురుడు లోకకంఠకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టేందుకు.. సత్యభామా సమేతంగా బయలుదేరిన కృష్ణునికి, నరకాసురునికి మధ్య ఘోర యుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో సత్యభామ చేతిలో నరకాసుని సంహారం జరిగింది.

ఇలా తల్లి చేతిలో ప్రాణం విడిచిన నరకాసురుడు తన కొడుకని తెలుసుకున్న సత్యభామ తన పుత్రుని పేరు కలకాలం వుండేలా చేయమని శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. సత్యభామ కోరిక మేరకు ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరకచతుర్దశిగా పిలుస్తారు. నరకచతుర్దశి రోజు నుంచి మూడు రోజులు ఖచ్చితంగా దీపాలను వెలిగించాలని శాస్త్రము. నరకచతుర్దశి సాయంత్రం ప్రభోద సమయంలో దీపాలు వెలిగించడం వలన పితృ దేవతల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రములు తెలిపాయి. నరకచతుర్దశిరోజు దీపాన్ని వెలిగించి ఈ కింది శ్లోకాన్ని చదవాలి.

తతః ప్రదోష సమయే దీపాన్ దద్యాన్మనోరమాన్ |

దేవాలయే మరే వాపి ప్రాకారోద్యాన వీధిషు ||

గోవాజి హస్తిశాలాయాం ఏవం ఘస్రత్ర యే పిచ |

తులా సంస్లే సహస్రాంశౌ ప్రదోషే భూతదర్శయోః ||

ఉల్కా హస్తానరాః కుర్యుః పిత్రేణాం మార్గదర్శనం ||

ఇలా నరకచతుర్దశి మొదలు మూడు రోజులు.. ఈ శ్లోకమును చదువుకొని దేవాలయాలలో, ప్రాకారాలలో, గోశాలలో, వీధులలో, నదులలో, పుణ్యక్షేత్రాలలో దీపాలు వెలిగించినట్లుయితే పితృ దేవతల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి.

నరకచతుర్దశి రోజు కచ్చితంగా ఇవి చేయాలి..

అయితే ఈ సంవత్సరం నరకచతుర్దశి అక్టోబర్ 24వ తేదీ వస్తుంది. అయితే నరకచతుర్దశి రోజు ప్రతి ఒక్కరు కచ్చితంగా ఆచరించలసినటువంటి విషయాలు నరకచతుర్దశిరోజు ఉదయాన్నే అభ్యంగన స్నానమాచరించాలి. విశేషంగా నువ్వుల నూనెతో శరీరానికి నలుగు పెట్టి స్నానమాచరించడం అలాగే తలస్నానం ఆచరించడం విశేషం. నరకచతుర్దశి రోజు దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు వదలాలి. నరకచతుర్దశిరోజు నరకాసురుని కథ వినాలి. శ్రీకృష్ణుడు, సత్యభామ, లక్ష్మీదేవిలను పూజించాలి. నరకచతుర్దశి రోజు సాయంకాల సమయమందు ఇంటిని శుభ్రపరచుకొని ఇంటి గుమ్మమునందు, తులసి కోటనందు, మందిరములో దీపాలు వెలిగించాలి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్