Dasara 2024: దసరా రోజు ఈ పనులు చేశారంటే ఇంటికి ఆనందం, అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయి
Dasara 2024: ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు దసరా రోజు కొన్ని పనులు చేయడం మంచిది. ఈ చిన్న చిన్న పనులు మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని అందిస్తాయి. ఆనందకరమైన జీవితాన్ని ఇస్తాయి.
అధర్మంపై ధర్మం గెలిచిన దానికి ప్రతీకగా విజయ దశమి వేడుకలు చేసుకుంటారు. అక్టోబర్ 12వ తేదీ దసరా జరుపుకుంటున్నారు. శ్రీరాముడు రావణాసురిడిపై సాధించిన విజయం, దుర్గాదేవి మహిషాసుర మర్దినిని సంహరించినందుకు గుర్తుగాను ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
దసరా రోజు పూజతో పాటు కొన్ని చర్యలు పాటించడం వల్ల ఇంటికి శ్రేయస్సు, ఆనందం లభిస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. ఎటువంటి ఖర్చు లేకుండా సింపుల్ గా చేసే ఈ పనులు మీ జీవితాన్ని మార్చేస్తాయి. అసలు సిసలు పండగను మీ జీవితాల్లో నింపుతాయి.
దానం మంచిది
దసరా రోజు దానం చేయడం వల్ల చాలా శుభప్రదంగా భావిస్తారు. ఉదయం పూజ చేసిన తర్వాత మీ స్తోమతకు తగినట్టుగా దానధర్మాలు నిర్వహించండి. ఆలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఆర్థిక సంక్షోభం, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే దానం చేయడంవల్ల అదృష్టం పెరుగుతుంది. సమస్యల నుంచి బయట పడతారు.
రావణ దహనం బూడిదను ఇంటికి తెచ్చుకోవాలి
రావణుడి దహనం చేసిన తర్వాత వచ్చే బూడిదను ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదని నమ్ముతారు. దీన్ని ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంటి మూలాల్లో కొద్దిగా చల్లడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో శ్రేయస్సు నిండిపోతుంది. సంపద పెరుగుతుంది. ఈ చితాభస్మంతో బొట్టు పెట్టుకుంటే వ్యాధుల నుంచి బయట పడతారని విశ్వసిస్తారు.
తులసి మొక్క
తులసి చాలా పవిత్రమైనది. దసరా రోజు తులసి మొక్కను పూజించడం లేదా ఇంట్లో మొక్కను నాటడం శ్రేయస్కరం. లక్ష్మీదేవి ఆశీస్సులు ఆ ఇంటి మీద పుష్కలంగా ఉంటాయి. దసరా రోజు మొక్క నాటితే శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. దసరా రోజు తప్పనిసరిగా దీపాలు వెలిగించే సంప్రదాయాన్ని చాలా మంది అనుసరిస్తారు. నాలుగు ముఖాల దీపాన్ని పెడతారు. అలాగే తులసి దగ్గర దీపం పెడతారు.
శమీ మొక్క
ఈ ఏడాది శనివారం దసరా పండుగ వచ్చింది. శనివారం శనిదేవుడికి అంకితం చేసిన రోజుగా భావిస్తారు. శని దేవుడికి ప్రీతికరమైన ఈ మొక్క నాటి పూజించవచ్చు. జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోయేందుకు శమీ మొక్కను పూజించవచ్చు. ఇలా చేస్తే అనేక సమస్యల నుంచి బయట పడతారు.
దీపాలు వెలిగించడం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దసరా రోజు దీపాలు వెలిగించడం సంప్రదాయంగా వస్తుంది. పది దీపాలు వెలిగించుకోవచ్చు. ఇందుకోసం నెయ్యి లేదా ఆవ నూనె ఉపయోగించుకోవచ్చు. రావి, శమీ, మర్రి చెట్టు, అరటి మొక్క, తులసి దగ్గర ఐదు దీపాలు వెలిగించాలి. మిగతావి ఇంటి మూలలో వెలిగించడం మంచిది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.