Guru dosham: గురు దోషం తొలగించుకునేందుకు గురు పౌర్ణమి రోజు ఇలా చేయండి-do follow these remedies on guru purnima to get rid of guru dosham ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Guru Dosham: గురు దోషం తొలగించుకునేందుకు గురు పౌర్ణమి రోజు ఇలా చేయండి

Guru dosham: గురు దోషం తొలగించుకునేందుకు గురు పౌర్ణమి రోజు ఇలా చేయండి

Gunti Soundarya HT Telugu
Jul 17, 2024 03:38 PM IST

గురు పౌర్ణమి రోజు వేద వ్యాసుడిని ఎందుకు పూజిస్తారు. జాతకంలో ఉన్న గురు దోషం తొలగిపోవాలంటే గురు పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం.

గురు దోషం తొలగించుకునే మార్గాలు
గురు దోషం తొలగించుకునే మార్గాలు (freepik)

Guru dosham: గురు పూర్ణిమకు హిందూ మతంలో మాత్రమే కాకుండా బౌద్ధ మతం, జైన మతంలో అధిక ప్రాముఖ్యత ఉంది. ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పూర్ణిమ జరుపుకుంటారు. మహర్షి వేద వ్యాసుడు జననం ఈరోజే జరిగిందని పురాణాల ప్రకారం చెబుతారు. హిందూ ఇతిహాసం మహాభారతంలో వ్యాసుడు ముఖ్య పాత్ర పోషించాడు. వేదాలను సంకలనం చేశాడు. ఈ ఏడాది గురు పూర్ణిమ జులై 21వ తేదీ వచ్చింది. 

జ్ఞానానికి, మార్గదర్శకత్వానికి, స్పూర్తినిచ్చేందుకు గురువు చాలా ముఖ్యం. ఒక వ్యక్తి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం బోధించి ఉన్నత స్థానంలో నిలబెట్టడంతో గురువు పాత్ర కీలకమైనది. సనాతన ధర్మంలో గురువు దైవంతో సమానంగా భావిస్తారు. ఈ గురు పూర్ణిమ గురు శిష్యుల మధ్య ఉన్న బంధాన్ని సూచిస్తుంది. శిష్యులు తమకు విద్యాబుద్ధులు, జ్ఞానం, ఆధ్యాత్మికతను నేర్పించిన గురువులకు రుణపడిన ఉన్నామని వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజ చేస్తారు.

గురువు పాదాలకు తాకుతూ నమస్కరిస్తారు. గురువుకు తాంబూలం, వస్త్రాలు పెట్టి పూల మాల వేసి సత్కరిస్తారు. గురు పూర్ణిమ రోజు చాలా మంది వేద వ్యాసుడిని పూజిస్తారు. వేదాలను(రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం) నాలుగు భాగాలుగా చేసిన ఘనత వ్యాస మహర్షిది. 

హిందూ మతంలో సాహిత్యం, ఆధ్యాత్మికతకు ఆయన చేసిన సహకారం ఎన్నటికీ మరువలేనిది. అందుకే వేద వ్యాసుడిని గౌరవిస్తూ భక్తులు తమకు జ్ఞానాన్ని ప్రసాదించిన వారిని గుర్తు చేసుకుని పూజిస్తారు. గురు పౌర్ణమి గురువుతో మనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. ఒక శిష్యుడిగా తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించామా లేదా అనేది తెలియజేస్తుంది.

గురు దోషం తొలగించుకునే పరిహారాలు

జాతకంలో గురు దోషం ఉంటే తొలగించుకునేందుకు గురు పూర్ణిమ చక్కని రోజుగా భావిస్తారు. గురు ఆరాధన వ్యక్తి జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో గురు దోషాన్ని తొలగించుకునేందుకు ఈరోజు ఎంచుకుంటారు. దేవగురువుగా భావించే బృహస్పతి పట్ల భక్తి, గౌరవం చూపిస్తూ పెద్దవారిని పూజిస్తే జాతకంలో గురు గ్రహం బలపడుతుంది.

బృహస్పతి ఆశీర్వాదాలు పొందేందుకు గురు పూర్ణిమ రోజు మీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు పాదాలు తాకి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. వారికి వస్త్రాలు, మిఠాయిలు వంటివి అందించాలి. మీకు తోచిన విధంగా గురు దక్షిణ సమర్పించుకోవాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో విజయం సాధిస్తారు.

గురు పూర్ణిమ రోజు మీరు గురువు ఆశీర్వాదం తీసుకోవడానికి వీలు లేకపోతే రావి లేదా మర్రి చెట్టును పూజించాలి. ఆవుకు మేత తినిపించాలి. వీలైతే బ్రహ్మణుడికి తీపి పదార్థాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అవరోధాల నుంచి బయట పడతారు.

గురు పూర్ణిమ రోజు అరటి మొక్కను పూజించడం వల్ల కూడా గురు దోషం తొలగిపోతుంది. పసుపు వస్త్రాలు ధరించి బృహస్పతి మంత్రాలను 108 సార్లు పఠించాలి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner