Bilvashtakam: శివుడిని ఆరాధించేందుకు బిల్వాష్టకం.. పవిత్రమైన ఈ స్తోత్రాన్ని ఎప్పుడు పఠించాలి?
Bilvashtakam: శివయ్య పూజలో బిల్వ పత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఒక్క పత్రం సమర్పించినా చాలు శివుడు పరవశించిపోతాడు. బిల్వపత్రాలు సమర్పించేటప్పుడు ఈ బిల్వాష్టకం పఠించారంటే చాలా మంచిది.
Bilvashtakam: పరమ శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఒక్క బిల్వ పత్రం ఉంటే చాలు. శివలింగం మీద బిల్వ పత్రం ఉంచి బిల్వాష్టకం పఠిస్తే శివుని ఆశీస్సులు మీకు లభిస్తాయి. బిల్వ పత్రాలు సమర్పించేటప్పుడు ఈ బిల్వాష్టకం పఠించండి.
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్|
త్రిజన్మపాప సంహారం ఏకబిల్వం శివార్పణమ్ ||
త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ హ్యచ్చిద్రైః కోమలైః శుభైః |
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ ||
అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే |
శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్||
సాలగ్రామశిలామేకాం జాతు విప్రాయ యోర్పయేత్|
సోమయజ్ఞమహా పుణ్యం ఏకబిల్వం శివార్పణమ్ ||
దంతికోటిసహస్రాని వాజపేయశతాని చ |
కోటికన్యామహాదానాం ఏకబిల్వం శివార్పణమ్||
పార్వత్యాః స్వేదసంజాతం మహాదేవస్య చ ప్రియమ్ |
బిల్వవృక్షం నమస్వామి ఏకబిల్వం శివార్పణమ్||
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్ |
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ||
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే |
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణమ్ ||
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివసన్నిధౌ |
సర్వపాపవినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్ ||
ఇతి బిల్వాష్టకమ్ ||
బిల్వాష్టకం ప్రాముఖ్యత
మహా దేవుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే. పరమశివుడిని పూజించేందుకు ఒక బిల్వపత్రం ఉన్న చాలు. ఇది సమర్పిస్తే ఇట్టే ప్రసన్నుడు అవుతాడని అంటారు. శివుడికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రం మూడు గుణాలు ఉన్నాయని చెబుతారు. సత్వ, తామస, రజో గుణాలు ఈ పత్రానికి మూడు నేత్రాలు వంటివని అంటారు. మూడు అంటే మూడు జన్మల్లో చేసిన పాపాలను తొలగించేసే శక్తి ఈ పత్రానికి ఉందని నమ్ముతారు. అందుకే శివుడికి బిల్వ పత్రం సమర్పిస్తారు.
లక్ష్మీదేవి బిల్వపత్రాన్ని సృష్టించిందని చెబుతారు. శివుడికి బిల్వ వృక్షం అంటే ఎంతో ప్రీతి. సర్వపాపాలను హరించి వేస్తుంది. బిల్వపత్రం కింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణు, అగ్రభాగంలో శివుడు కొలువై ఉంటారని అంటారు. అందుకే ఈ పత్రంతో మహాదేవుడిని పూజిస్తే ముగ్గురు దేవుళ్ళని ఏక కాలంలో పూజించినట్టే. సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. బిల్వాష్టకంలో మొత్తం ఎనిమిది శ్లోకాలు ఉంటాయి.
బిల్వాష్టకం ఎప్పుడు పఠించాలి?
బిల్వాష్టకం శివునికి అంకితం చేసిన శక్తివంతమైన శ్లోకంగా ప్రసిద్ధి చెందింది. హిందూ భక్తి శ్లోకాలలో బిల్వాష్టకం ఒకటి. పూజలో బిల్వపత్రాలు ఉపయోగిస్తే శివుని ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ స్తోత్రం గురించి శివపురాణంలో కూడా ప్రస్తావించారు. ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల మంచి ఆరోగ్యం, సంపద, శాంతి చేకూరతాయి. బిల్వాష్టకాన్ని రోజులో ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా జపించవచ్చు.
శివరాత్రి, మాస శివరాత్రి సమయంలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. నిత్యం బిల్వాష్టకం పఠించడం వల్ల ఆధ్యాత్మిక పురోగతితోపాటు శివుని ఆశీస్సులు మీకు లభిస్తాయి. పరిశుభ్రమైన, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ఈ స్తోత్రాన్ని జపించవచ్చు. శివుని విగ్రహం లేదా పూజా మందిరంలో కూర్చుని మనసు శివుడి మీద లగ్నం చేస్తూ ఈ బిల్వాష్టకాన్ని పఠించాలి.