9 Days of Bathukamma Rituals: అమ్మవారికి తొమ్మిదిరోజులు ఆ నైవేద్యాలు సమర్పించండి-bathukamma festival is called with a different name and each day different food is offered to goddess ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Bathukamma Festival Is Called With A Different Name And Each Day Different Food Is Offered To Goddess

9 Days of Bathukamma Rituals: అమ్మవారికి తొమ్మిదిరోజులు ఆ నైవేద్యాలు సమర్పించండి

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 22, 2022 07:49 AM IST

9 Days of Bathukamma Rituals : తొమ్మిదిరోజులు బతుకమ్మను జరుపుకుంటారని అందరికి తెలిసు. అయితే తొమ్మిది రోజులలో ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేకం. ఒక్కో రోజుకి ఒక్కోపేరు ఉంటుంది. మరి ఆ పేర్లు ఎలా వచ్చాయి. ఆ రోజు ఏమి చేస్తారు. అమ్మవారికి ఏమి నైవేధ్యం సమర్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

బతుకుమ్మ 2022
బతుకుమ్మ 2022

9 Days of Bathukamma Rituals : మరికొన్ని రోజుల్లో బతుకమ్మ వచ్చేస్తుంది. అయితే బతుకమ్మ గురించి మీకు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఎందుకంటారా? బతుకమ్మను తొమ్మిదిరోజులు చేసుకుంటాము కదా. ఆ తొమ్మిదిరోజులకు వేర్వేరు పేర్లు ఉంటాయి. మరి ఆ పేర్లు ఎందుకు వచ్చాయో.. అంతేకాకుండా.. ప్రతిరోజు అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు అందిస్తాము. ఆ రోజుల్లో అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు అందించాలి.. వంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

1. ఎంగిలి పువ్వుల బతుకమ్మ

భాద్రపద అమావాస్య - బతుకమ్మలో మొదటి రోజును ఎంగిలి పువ్వు బతుకమ్మ అని పిలుస్తారు. ఎందుకంటే భక్తులు మొదట తమ పూర్వీకులకు అన్నదానం చేసి.. ఆపై బతుకమ్మను తయారు చేయడం ప్రారంభిస్తారు కాబట్టి ఈరోజును ఎంగిలి పువ్వుల బతుకమ్మ అంటారు.

ఎంగిలిపువ్వుల బతుకమ్మ రోజు.. అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా.. బియ్యం, నువ్వులు సమర్పిస్తారు.

2. అటుకుల బతుకమ్మ

ఆశ్వయుజ పాడ్యమి (ఆశ్వయుజ మాసం మొదటి రోజు) - బతుకమ్మ రెండవ రోజును అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున భక్తులు అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి.. అటుకుల బతుకమ్మగా పిలుస్తారు.

అటుకుల బతుకమ్మ రోజు అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా.. అటుకులు, బెల్లం సమర్పిస్తారు.

3. ముద్దపువ్వు లేదా ముద్దపప్పు బతుకమ్మ

ఆశ్వయుజ ద్వితీయ నాడు (ఆశ్వయుజ మాసం రెండవ రోజు) బతుకమ్మను ముద్దపువ్వు లేదా ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ఎందుకంటే బతుకమ్మను ముద్ద చామంతి లేదా ముద్దబంతి పువ్వులతో పాటు తంగేడు పువ్వు, గుణక పువ్వులతో తయారు చేస్తారు కాబట్టి. అలాగే ముద్దపప్పు , అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి ఈరోజును ముద్దపువ్వు లేదా ముద్దపప్పు బతుకమ్మ అంటారు.

ముద్దపువ్వు లేదా ముద్దపప్పు బతుకమ్మ రోజు దేవతకు ఆహార నైవేద్యాలుగా.. అన్నం, ముద్దపప్పు సమర్పిస్తారు.

4. నానబియ్యం బతుకమ్మ

ఆశ్వయుజ తృతీయ నాడు - బతుకమ్మ నాల్గవ రోజు భక్తులు నానినా బియ్యం (నానబెట్టిన బియ్యం) & బెల్లం సమర్పిస్తారు. కాబట్టి ఈరోజును నానబియ్యంబతుకమ్మ అని పిలుస్తారు.

నానబియ్యం బతుకమ్మ రోజు.. అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా.. నానబెట్టిన బియ్యం, బెల్లం సమర్పిస్తారు.

5. అట్ల బతుకమ్మ

ఆశ్వయుజ చతుర్థి నాడు బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు. మహిళలు బతుకమ్మకు నైవేద్యంగా అట్లు సమర్పిస్తారు కాబట్టి.. ఈరోజును అట్ల బతుకమ్మ అంటారు.

అట్ల బతుకమ్మరోజు అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా.. దోశలు సమర్పిస్తారు.

6. అలిగిన లేదా అర్రెము లేదా అలక బతుకమ్మ

ఆశ్వయుజ పంచమి నాడు నైవేద్యం తయారీ చేయము. ఎందుకంటే ఆరోజు గౌరీ దేవి బాధపడిందని భక్తులు నమ్ముతారు. అందుకే ఆరోజు అలకబతుకమ్మ లేదా అలిగిన బతుకమ్మ అంటారు. ఆ రోజునే లలిత పంచమిగా కూడా జరుపుకుంటారు.

7. వేపకాయల బతుకమ్మ

ఆశ్వయుజ షష్ఠి నాడు బతుకుమ్మ వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు. దుర్గా షష్టిగా దీనిని జరుపుకుంటారు. నైవేద్యంగా వేపకాయ ఆకారంలో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.

వేపకాయల బతుకమ్మరోజు.. అమ్మవారికి ఆహార నైవేద్యంగా సకినాల పిండిని వేపకాయల ఆకారంలో తయారు చేసి సమర్పిస్తారు.

8. వెన్న ముద్దల బతుకమ్మ

ఆశ్వయుజ సప్తమి నాడు బతుకమ్మను ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున భక్తులు వెన్నతో నైవేద్యం సమర్పిస్తారు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.

వెన్న ముద్దల బతుకమ్మ రోజున అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా నువ్వులు, బెల్లం, నెయ్యి, వెన్న కలిపి చేసిన లడ్డూలు సమర్పిస్తారు.

9. సద్దుల బతుకమ్మ (చద్దుల బతుకమ్మ)

ఆశ్వయుజ అష్టమి (దుర్గా అష్టమి) నాడు బతుకమ్మ పండుగను సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున బతుకమ్మను ఎనిమిది రోజుల కంటే పెద్ద పరిమాణంలో వివిధ పూలతో తయారు చేస్తారు.

సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా.. ఈ రోజున 5 రకాల అన్నం, స్వీట్ సమర్పిస్తారు. ఆ ఐదు రకాలు అన్నం ఏమిటంటే.. పెరుగన్నం, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం.. వీటిని సద్దిగా అమ్మవారికి సమర్పిస్తారు. మళ్లిద అనే స్వీట్​ని కూడా సమర్పిస్తారు.

నైవేద్యాలు ప్రాంతాల వారీగా మారవచ్చు. కానీ చాలా ప్రాంతాలలో భక్తులు ఆయా రోజుల్లో అమ్మవారికి వీటినే నైవేద్యంగా సమర్పిస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం