జ్యోతిష్యశాస్త్ర ప్రకారం పెళ్ళి విషయంలో ఏమేమి చూడాలి?
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం పెళ్ళి విషయంలో ఏమేమి చూడాలి? ఏ మాసాలలో పెళ్ళి చేసుకోవడం మంచిది? సంబంధిత విషయాలను పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
మానవుని జీవితములో వివాహము చాలా ప్రాధాన్యమైనది. వివాహం చేసుకున్న తరువాత మానవుడు నాలుగు ఆశ్రమాలలో ముఖ్యమైనటువంటి గృహస్తు ఆశ్రమాన్ని స్వీకరిస్తాడు. వివాహ విషయంలో సనాతన ధర్మం అనేక విషయాలను సూచించిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం వివాహం ఆచరించేటటువంటి వారు ముఖ్యముగా చూడవలసిన విషయాలు. 1. వధూవరులు ఒకే గోత్రీకులై యుండరాదు. 2. వధూవరుల జాతకాలను బట్టి వారి నక్షత్రాల ఆధారంగా వారి యొక్క గుణమేనిక చూసి 36 మార్కులకు గాను కనీసం 20 మార్కులు గుణమేనిక చక్రములో వచ్చునట్లుగా చూసుకోవాలి. ఈ గుణమేనికలోను నాడీగుణము, మైత్రిగుణము, యోని గుణము వంటి ముఖ్యమైన గుణాలను పరిశీలించుకోవాలి. జాతకములో బలాబలాలను పరిశీలించుకోవాలి. 3. జాతకములో దోషాలు ఏమైనా ఉన్నాయా పరిశీలించుకోవాలి (కుజదోషం, కాలసర్చదోషం, రాహు కేతు దోషం) సంతాన స్థానాన్ని పరిశీలించుకోవాలి.
గోచార గ్రహస్థితిని పరిశీలించుకోవాలి. వివాహ విషయాల్లో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇవన్నీ పరిశీలించుకొనే ఆ వివాహ విషయానికై ముందుకు వెళ్ళాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పెళ్లి ముహూర్తం ఏ కాలంలో శ్రేష్ఠం?
వివాహ విషయానికి వచ్చినపుడు పెళ్ళి ముహూర్తాలు నిర్ణయించుకొని వివాహాన్ని చేసుకోవడానికి ఉత్తరాయణం ఉత్తమమైనది. ఉత్తరాయణంలో చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాఘ, ఫాల్గుణ మాసాలు ఉత్తమమైనవి. దక్షిణాయనంలో శ్రావణం, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం వివాహాలకు మధ్యస్థ ఫలితాలనిస్తాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఆషాఢం, భాద్రపదం, పుష్య మాసాలు వివాహాలకు పనికిరావు (నిషిద్ధం). రవి, గురుడితో కాని, శుక్రునితో కాని కలసివున్న గురు మౌఢ్యం, శుక్ర మౌఢ్యం వంటివి ఉన్నటువంటి మౌధ్య దినాలలో వివాహములు ఆచరించకూడదని చిలకమర్తి తెలిపారు.
వివాహానికి బుధ, గురు, శుక్ర వారాలు ఉత్తమము. ఆది, సోమ, శనివారాలు మధ్యమం. మంగళవారం నిషిద్ధం అని చిలకమర్తి తెలిపారు. వివాహానికి పనికి వచ్చే నక్షత్రాలలో అశ్చిని, రోహిణి, మృగశిర, మఖ, ఉత్తర, హస్త, చిత్త, అనూరాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉత్తమం. శుభలగ్నాన్ని, తారాబలాన్ని అనుసరించి ముహూర్త ఆధారితంగా వివాహాన్ని ఆచరించుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.