Star Maa Serial: స్టార్ మాలో బిగ్‌బాస్ అర్జున్ కళ్యాణ్ కొత్త సీరియల్ - టైటిల్ ఇదే!
Star Maa Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు తర్వాత మరో కొత్త సీరియల్‌ను స్టార్ మా అనౌన్స్‌చేసింది. నువ్వుంటే నా జతగా పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీరియల్‌లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఫేమ్ అర్జున్ కళ్యాణ్, బెంగాళీ నటి అనుమితా దత్తా కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
Star Maa Serial: ఇటీవలే ఇల్లు ఇల్లాలు పిల్లలు పేరుతో కొత్త సీరియల్‌ను లాంఛ్ చేసింది స్టార్ మా. సీనియర్ యాక్టర్స్ ప్రభాకర్, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా సీరియల్ ఫస్ట్ వీక్‌లోనే టీఆర్‌పీ రేటింగ్‌లో అదరగొట్టింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు తర్వాత మరో కొత్త సీరియల్‌కు అనౌన్స్‌చేసి బుల్లితెర ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది స్టార్ మా. ఈ సీరియల్ టైటిల్‌తో పాటు యాక్టర్స్ ఎవరన్నది ప్రోమో ద్వారా రివీల్ చేశారు.
నువ్వుంటే నా జతగా...
ఈ కొత్త సీరియల్‌కు నువ్వుంటే నా జతగా అనే టైటిల్‌ను ఫిక్స్‌చేశారు. ఈ సీరియల్‌లో బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ లీడ్ రోల్‌లో నటిస్తోన్నాడు. అనుమితా దత్తా హీరోయిన్‌గా కనిపించబోతున్నది. బెంగాళీ నటి అయిన అనుమితా దత్తా నువ్వుంటే నా జతగా సీరియల్‌తోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. నందకిషోర్, శివ మహి, శీలా సింగ్, భాను ప్రకాష్ ఈ సీరియల్‌లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
నువ్వుంటే నా జతగా సీరియల్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. భిన్న నేపథ్యాలు, మనస్తత్వాలు కలిగిన ఓ జంట పెళ్లి బంధంతో ఎలా ఒక్కటయ్యారనే కథతో నువ్వుంటే నా జతగా సీరియల్ తెరకెక్కుతోన్నట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది.
మాస్ అబ్బాయి...క్లాస్ అమ్మాయి...
ఇందులో దేవా అనే మాస్ క్యారెక్టర్‌లో అర్జున్ కళ్యాణ్ కనిపించాడు. చదువులో టాపర్ అయినా గొప్పింటి అమ్మాయిగా అనుమితా దత్తా పాత్రను ప్రోమోలో పరిచయం చేశారు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా అనుమితా మెడలో మూడు ముళ్లు వేస్తాడు దేవా. తాళికి విలువ ఇచ్చిన అనుమిత దేవాతోనే జీవితాన్ని పంచుకోవాలని నిశ్చయించుకుంటుంది.
కానీ దేవా మాత్రం ఆమెను ద్వేషిస్తుంటాడు. ఈ తాళికి, బంధానికి విలువ లేదని ఆమెను ద్వేషిస్తుంటాడు తనను వదిలిపెట్టి వెళ్లిపొమ్మని అంటాడు. తాళి బంధానికి గౌరవం కలిగిస్తానని అనుమిత చెప్పే డైలాగ్‌తో ప్రోమో ఎండ్ అయ్యింది. ఈ ప్రోమో వైరల్‌గా మారింది. త్వరలోనే ఈ సీరియల్ టెలికాస్ట్ డేట్, టైమింగ్స్‌ను వెల్లడిస్తామని స్టార్ మా ప్రకటించింది. బెంగాళీ సీరియల్ ఖేలాగోర్‌కు రీమేక్‌గా నువ్వుంటే నా జతగా తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు అర్జున్ కళ్యాణ్. ఈ షో ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు సుపరిచితుడయ్యాడు. 49వ రోజు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ప్లేబ్యాక్, అడ్డతీగల, పెళ్లికూతురు పార్టీతో పాటు మరికొన్ని చిన్న సినిమాల్లో హీరోగా నటించాడు. ప్రేమమ్, వరుడు కావలెనుతో పాటు మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు.