Poli Swargam : కార్తీకమాసంలో పొలి స్వర్గం కథ వింటే.. శ్రీహరి అనుగ్రహం లభిస్తుందట-history of poli swargam last day of kartika masam 2022
Telugu News  /  Rasi Phalalu  /  History Of Poli Swargam Last Day Of Kartika Masam 2022
పోలి స్వర్గం కథ
పోలి స్వర్గం కథ

Poli Swargam : కార్తీకమాసంలో పొలి స్వర్గం కథ వింటే.. శ్రీహరి అనుగ్రహం లభిస్తుందట

19 November 2022, 8:40 ISTGeddam Vijaya Madhuri
19 November 2022, 8:40 IST

Poli Swargam Story : కొందరు ఆడంబరాల కోసం దేవుడిని పూజిస్తారో.. దేవుడిని పూజించడం కోసం ఆడంబరాలు చేస్తారో తెలియదు కానీ.. తమ పూజ గ్రాండ్​గా చేయాలని చూస్తారు. అయితే పూజలు గ్రాండ్​గా చేయకపోయినా పర్లేదు కానీ.. భక్తి శ్రద్ధలతో చేయాలన్నదే పొలి స్వర్గం కథ. ఇంతకీ ఈ కథ మనకి ఏమి చెప్తుందంటే..

Poli Swargam Story : మనకు కార్తీకమాసం చాలా విశేషమైన మాసంగా పురాణాలు చెప్తున్నాయి. కార్తీక మాసం భక్తి శ్రద్దలకు, పుణ్యస్నానాదులకు, దీపారాధనకు, దేవతారాధనకు చాలా విశేషమైనది. కార్తీకమాసం చివరకు రాగానే పొలి స్వర్గం కథ వినాల్సిందే అంటారు. అన్ని పూజలు, వ్రతాలు ప్రత్యేకమైనా.. కార్తీకమాసంలో వినే ఈ కథ చాలా ముఖ్యమైనది. ఈ కార్తీక మహాత్మ్యాన్ని తెలిపేటటువంటి కథలలో పొలి స్వర్గం కథ కూడా ఒకటి. ఇది చాలా విచిత్రమైనది. కానీ విశేషమైన కథ ఇది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పూర్వం పొలి అనే ఒక గొప్ప భక్తురాలు ఉండేది. ఆమెకు వివాహమై అత్తగారింటికి వెళ్లింది. ఆమె ఆ ఇంటికి చిన్నకోడలిగా వెళ్లింది. ఆమె అత్తగారు తన నలుగురు కోడళ్లతో స్నేహంగా ఉండేది. కానీ ఆఖరు కోడలైన పొలితో పట్ల మాత్రం అసూయతో వ్యవహరించేది. ఆమెకు మాత్రమే అన్ని పనులు చెప్పి.. చేయించేది.

ఇలా చేస్తూ ఉండగా.. అలా కార్తీక మాసం వచ్చింది. ఈ సందర్భంగా ఇంట్లో పని అంతా పొలికి చెప్పి.. అత్త తన కోడళ్లతో, స్నేహితురాళ్లతో కలిసి.. ఆడంబరాల కోసం కార్తీక నదీ స్నానాలు, దీపారాధనలు చేసుకోనేది. పొలిని మాత్రం ఎలాంటి దేవతారాధనలు చేయనీయకుండా ఇంట్లోనే చాకిరీ చేయించేది. అయినా కూడా పొలి విసుగు చెందకుండా ప్రతి పనిచేస్తూ.. ఆ పనిలో భగవంతుని చూస్తూ.. భగవంతుని నామస్మరణ చేస్తూ.. కార్తీక మాసం గడుపుతూ ఉండేది.

తన ఇంటి వద్ద ఉన్న నూతి దగ్గరనే కార్తీక స్నానాలు చేసి.. మజ్జిగ చిలికిన కవ్వానికి అంటిన వెన్నతో దీపాలను వెలిగించి.. భక్తి శ్రద్ధలతో శ్రీహరిని కార్తీక మాసంలో కొలిచేది. వెన్నతో వెలిగించిన దీపాన్ని శ్రీహరి దగ్గర పెట్టి నమస్కరించేంది. ఈ తంతును చూసి అత్తగారు తిడతారేమో అనే భయంతో.. ఆ దీపం మీద చాకలిబాన బొర్లించేది. ఆమె భక్తిని చూసి మెచ్చిన శ్రీహరి.. ప్రసన్నుడై ఆమెకు పుష్పక విమానంను పంపాడు. ఆమెను స్వర్గమునకు రప్పించాడు. ఈ విధముగా చిన్న కోడలు పుష్పకవిమానంలో స్వర్గానికి వెళ్లడాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యం పొందారు. ఇది పొలి స్వర్గములో చెప్పిన కథ. ఈ కథను ఎవరైతే వింటారో వారికి శ్రీహరి అనుగ్రహం కలుగుతుందని చెప్తారు.

ఈ కథలోని సందేశం ఏమిటంటే..

నోములు, వ్రతాలు, పూజా పునస్కారాలకు ముఖ్యముగా కావలసినది భక్తిశ్రద్ధలు మాత్రమే కానీ ఆడంబరాలు, అట్టహాసాలు కాదు. ఆడంబరాలతో పూజలు చేస్తే.. దేవుడు కరుణిస్తాడని అర్థం కాదు. మనం మన పనిని ఎంత శ్రద్ధతో చేస్తున్నామనేదే పోలిస్వర్గం కథ ఇచ్చే సందేశం.

సంబంధిత కథనం