Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరేనా...?
ప్రకృతి అందాల జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా పలు హామీలిస్తూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యమని ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్లో అనేక మార్పులు సంభవిస్తాయని ఎన్డీఏ ప్రభుత్వం నమ్మబలికింది.
2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత బీజేపీ చెప్పినట్టే పరిస్థితులున్నాయా అని పరిశీలిస్తే రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు వేరుగా ఉన్నాయి. స్వయం ప్రతిపత్తి కోల్పోయిన తర్వాత జమ్మూ కశ్మీర్ ప్రజలు తమ హక్కులను కోల్పోయారా..? ప్రజలు స్వతంత్రతను కోల్పోయారా..? లేదా వారు కోరుకున్నట్టు పరిస్థితులున్నాయా..? అని పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో అనేక ఆసక్తి కరమైన అంశాలు వెలుగుచూశాయి.
క్షేత్ర స్థాయిలో భిన్న పరిస్థితులు
ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా మొదలుకొని బీజేపీ అగ్రనేతలంతా ఆకాశమే హద్దుగా మాట్లాడారు. ఇక జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పురోగతితో ప్రగతి పథాన నడుస్తుందని కేంద్ర పెద్దలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లిన ‘పీపుల్స్ పల్స్’ బృందం పరిశీలనలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి వస్తాయని, దీంతో పర్యాటకుల రాకపోకలు పెరిగి, శీతల ప్రాంతమైన రాష్ట్రం పర్యాటక రంగంలో పురోగతి సాధిస్తుందని, పరిశ్రమలు వస్తాయని యువతకు ఉపాధి లభిస్తుందని, జమ్మూ కశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు. దీంతో దేశ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఏదో అద్భుతం జరగబోతుందని ఆశించారు. ఆర్టికల్ 370 రద్దయిన ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలోని పరిస్థితులు ఆశించిన మేరకు మెరుగుపడ్డాయా అంటే అవునని చెప్పడం కష్టమే. సెప్టెంబర్ 2024 నాటికి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను మోదీ సర్కార్ చిత్తశుద్ధితో అమలు పరుస్తుందా లేదా ఏదో కారణంతో కాలయాపన చేస్తుందా చూడాలి. వీలైనంత త్వరగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఆచరణలో వెనకడుగేస్తుంది. పార్లమెంట్ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తిచేస్తారని భావించినా మోదీ ప్రభుత్వం ధైర్యం చేయలేకపోయింది. సుప్రీం కోర్టు విధించిన గడువులోపల అయినా ఎన్నికలను పూర్తిచేస్తుందో లేదో వేచి చూడాలి.
జమ్మూకి పాకిన ఉగ్ర దాడులు
ఆర్టికల్ 370 రద్దు తర్వాత మైనార్టీలపై, వలస కార్మికులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఆగస్టు 2023 నుండి జులై 2024 మధ్య కాలంలో ఉగ్రవాదుల దాడులలో 20 మంది పౌరులు మరణించారు. జమ్మూలో ప్రత్యేకించి పూంఛ్, రాజౌరీ, దోడా, కతూవ ప్రాంతాలలో ఉగ్రదాడులు తీవ్రతరం కావడం మరింత ఆందోళనకరమైన విషయం. ఆగస్టు 2023 మరియు 22 జులై 2024 మధ్య భద్రతాదళాల మృతుల సంఖ్య 21 నుండి 33కు పెరిగింది. ఆర్టికల్ 370 ముందు కశ్మీర్లో నిత్యం జరిగే ఉగ్రవాదుల దాడులు ఇప్పుడు జమ్మూ ప్రాంతానికి పాకాయి. గతంలో జమ్మూలో నామమాత్రంగానే జరిగిన దాడులు ఇప్పుడు ప్రధానంగా పౌరులు లక్ష్యంగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 2023లో 44 శాతం జమ్మూలోనే జరగ్గా, 2024లో (జులై నాటికే) జమ్మూలో 40 శాతం దాడులు జరగడం ఆందోళనకరమైన అంశం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్వస్థలాలకు వెళ్లవచ్చని ఆశిస్తున్న పండిట్ల ఆశలపై నీళ్లు చల్లుతూ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు.
పౌర హక్కులపై ఆంక్షలు
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పలు ప్రజా సంఘాలు, పౌర సంఘాలపై నిబంధనలు కొనసాగుతున్నాయి. వారు స్వేచ్ఛగా అభిప్రాయాలను, నివేదికలు బయటపెట్టలేకపోతున్నారు. నిర్బంధ చట్టాలతో ఆందోళనకరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2020 నుండి 2023 డిసెంబర్ మధ్య చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నిరోధక) చట్టం (యూఏపీఏ), పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (పీఎస్ఏ) కింద 2700 మందిపై కేసులు నమోదుచేశారు.. వీరిలో 1100 మందిపై తిరుగుబాటుదారులకు సహాయసహకారాలు అందించారనే ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. ఈ చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని పలు ప్రజా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతోపాటు విలేకరులపై కూడా తీవ్ర నిర్భందాలు కొనసాగుతున్నాయి. ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులు స్వతంత్రంగా విధులు నిర్వహించలేకపోతున్నారు. బ్యాన్ చేయబడిన ‘కశ్మీర్ వాలా’ పత్రిక ఎడిటర్ ఫహాద్ షాకు 600 రోజులు జైలులో గడిపిన తర్వాత నవంబర్ 2023లో బెయిల్ వచ్చింది.
చిన్నారులపై అఘాయిత్యాలు
రాష్ట్రంలో శాంత్రిభద్రతలకు సంబంధించి అధికారిక లెక్కలను పరిశీలిస్తే చిన్నారులపై హింస పెరిగింది. చిన్నారులపై దాష్టికాలు జరిగిన కేసులు 2019లో 470 నమోదుకాగా, 2022లో అవి 920కు పెరిగాయి. ఇదే సమయంలో మహిళలపై దాడులు స్వల్పంగా తగ్గడం సంతోషకరమైన విషయం. 2021లో మహిళలపై దాడులకు సంబంధించి 3937 కేసులు నమోదుకాగా, 2022లో 3716కు తగ్గాయి. షెడ్యూల్ కులాలపై దాడులు పెరిగాయి. 2020 -2021లో 0.20 శాతం ఉండగా 2023 -2024లో 1.20 శాతానికి చేరాయి.
ఆర్థికంగా ఇబ్బందుల్లో..
రాష్ట్ర ఆర్థికం ఒడిదొడుకులలో ఉంది. జమ్మూ కశ్మీర్ ఆర్థికంగా 2019 కంటే మెరుగైన స్థితిలో లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో పెట్టుబడులు పెరుగుతాయని, రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని కేంద్రం చెప్పిన మాటలు నీటిమూటలే అయ్యాయి. దేశంలో ఇప్పుడు సగటున నిరుద్యోగులు 6.6 శాతం ఉండగా, జమ్మూ కశ్మీర్లో 10.7 శాతం ఉన్నారు. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత 18.3 శాతం ఉన్నారు. నెట్ స్టేట్ డొమాస్టిక్ ప్రోడెక్ట్ (ఎస్ఎస్డిపి) పెరుగుదల 2019 ఏప్రిల్ -2024 మార్చి మధ్య సగటున 8.73 శాతం. ఇది 2015 ఏప్రిల్ -2019 మార్చి మధ్య ఉన్న 13.28 శాతం కంటే తక్కువ. సంక్షేమ పథకాలు ముఖ్యంగా పేదవారికి చేదోడుగా నిలుస్తాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు సంక్షేమ పథకాల అమలులో పోటీ పడుతుండగా జమ్మూ కశ్మీర్లో (jammu kashmir) ఎలాంటి ప్రత్యేక పథకాలు లేవు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పాలనాధికారులు ప్రత్యేకించి ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టకపోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.
గవర్నర్ కు విశేష అధికారాలు
రాష్ట్రంలోని అన్ని రంగాలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెరిగిపోయింది. 2024 జులై 12వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గవర్నర్కు విశేష అధికారాలు కట్టబెట్టారు. కీలకమైన పోలీస్, బ్యూరోక్రసీ అధికారులపై గవర్నర్ జోక్యం పెరిగిపోవడంతో రాష్ట్ర అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో పాలనాపరంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి అంశంలో గవర్నర్ కలగజేసుకోవడంతో అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పాలనలో గవర్నర్ జోక్యంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.
2024 లో అత్యధిక పోలింగ్ కు కారణం?
గతంలో దర్బార్ పేరుతో ఆరు నెలలకోసారి పరిపాలన కశ్మీర్, జమ్మూలలో జరిగేది. ఇది ఇరు ప్రాంతాలకు న్యాయ సమ్మతంగా ఉండేది. ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దుతో ‘దర్బార్’ వ్యవస్థ కూడా పోవడంతో రెండు ప్రాంతాల ప్రజలు ప్రత్యేకత కోల్పోయామనే భావనతో ఉన్నారు. గతంలో నిరసన పేరుతో రాష్ట్ర ప్రజలు ఎన్నికలను బహిష్కరించే వారు. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 58 శాతానికిపైగా ఓటింగ్ జరిగింది. ఇది గత 35 సంవత్సరాలతో పోలిస్తే అధికం. ఆర్టికల్ రద్దు తర్వాత ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారని బీజేపీ ప్రభుత్వం వాదిస్తుంటే, అదే సమయంలో ఆర్టికల్ రద్దుకు వ్యతిరేకంగా ప్రజలు తమ నిరసనను తెలిపారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దీన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా వ్యాఖ్యానించుకుంటున్నారు.
బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ (jammu and kashmir) రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే లక్ష్యంగా బీజేపీ పావులు కదిపింది. 87 స్థానాలున్న రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కలుపుకొని మొత్తం 114 స్థానాలను ఏర్పాటు చేశారు. అందులో 24 స్థానాలు పీఓకే కోసం కేటాయించారు. మిగతా 90 స్థానాలు జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఉన్నాయి. పునర్విభజనలో భాగంగా కశ్మీర్లో ఒక స్థానం, జమ్మూలో 6 స్థానాలు పెరిగాయి. మైనార్టీయేతరులు అధికంగా ఉండే జమ్మూలో సీట్లు పెరగడంతో రాజకీయంగా లబ్ది చేకూరుస్తుందని బీజేపీ ఆశిస్తున్నా ప్రధానంగా జమ్మూలో ఉగ్రదాడులు ఆ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, జమ్మూ, ఉదంపూర్ లో, ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫిరెన్స్ శ్రీనగర్, అనంత్ నాగ్ స్థానాల్లో గెలవగా, బారముల్లాలో ఇండిపెండెంట్ విజయం సాధించారు. బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ధోరణితో ఫలితాలను రాబట్టుతుందో లేదా వేచిచూడాలి.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు కీలకం
జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా స్వయం ప్రతిపత్తిగల ఆర్టికల్ 370 రద్దు చేశామని బీజేపీ గట్టిగా వాదిస్తోంది. రాష్ట్ర ప్రజల ప్రత్యేక ఆకాంక్ష అయిన ఆర్టికల్ 370 రద్దు చేసి ప్రజలు కశ్మీర్ ప్రజలను దగా చేసిందని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాల్లో ప్రత్యేకించి ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా లేదా అనేది రాబోయే అసెంబ్లీ ఎన్నికలే తేలుస్తాయి.
-ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.