లోక్ సభలో ప్రతిపక్ష నేతను ‘షాడో పీఎం’ అని ఎందుకంటారు? గత పదేళ్లుగా ఎల్ఓపీ ఎందుకు లేరు?
పార్లమెంటులో ప్రతిపక్ష నేతకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కేబినెట్ మంత్రితో సమాన హోదా ఉంటుంది. ఎల్ఓపీని ‘షాడో పీఎం’ అని కూడా వ్యవహరిస్తారు. అధికార పక్షాన్ని ఎదిరించడానికి మొత్తం ప్రతిపక్షాన్ని కూడగట్టగల సీనియర్ నేతకు ఈ ప్రతిపక్ష నేత పదవి ఇస్తారు. అయితే, ఆ పదవి పొందడానికి అన్ని విపక్షాలకు అర్హత ఉండదు.
18వ లోక్ సభలో ప్రతిపక్ష నేత ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుత లోక సభలో అధికార పార్టీ బీజేపీ తరువాత, ఎక్కువ స్థానాలు సాధించిన కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష నేత ఉంటారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు ముందు లోక్ సభలో ప్రతిపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. 2014 నుంచి లోక్ సభలో అధికారికంగా ప్రతిపక్ష నేత ఎవరూ లేరు. పదేళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ అధకారికంగా ఎల్ఓపీ ఉండనున్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేతను కొన్ని విశేషాధికారాలు ఉంటాయి. ఎల్ఓపీ (LOP) ని షాడో పీఎం (shadow Prime Minister) అని కూడా అంటారు. ఆయన ప్రతిపక్ష సభ్యులతో ఒక షాడో కేబినెట్ ను కూడా నిర్వహిస్తారు.
ప్రతిపక్ష నేత పదవి పొందడానికి అర్హతలేంటి?
లోక్ సభ లో ప్రతిపక్ష నేత పదవి పొందడానికి ఆ ప్రతిపక్షం కొన్ని అర్హతలను సాధించాలి. అధికార పక్షం తరువాత, విప పార్టీలో అత్యధిక లోక్ సభ స్థానాల్లో గెలిచిన పార్టీకి చెందిన నాయకుడికి పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తారు. ఇది కేబినెట్ మంత్రి తో సమానమైన హోదా. అయితే, ఎల్ఓపీ పొందడానికి అధికార పక్షం తరువాత అత్యధిక స్థానాలు మాత్రమే సాధిస్తే సరిపోదు. మొత్తం లోక్ సభ స్థానాల్లో కనీసం 10% సీట్లలో గెలిస్తేనే ఆ హోదా కల్పిస్తారు. అందుకు సంబంధించిన అధికారాలు ప్రాప్తిస్తాయి. అంటే, మన లోక్ సభలో మొత్తం స్థానాల సంఖ్య 543. అందులో 10% అంటే 55 సీట్లు. అంటే, లోక్ సభలో ప్రతిపక్ష నేత పదవి పొందాలంటే ఏదైనా విపక్షం కనీసం 55 సీట్లలో గెలిచి తీరాలి.
గత పదేళ్లుగా నో ఎల్ఓపీ
గత పదేళ్లుగా మన పార్లమెంటులో అధికారికంగా ఎల్ఓపీ లేరు. అందుకు కారణం, ఏ విపక్షం కూడా కనీసం 55 సీట్లలో గెలవలేకపోవడమే. 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 44 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. దాంతో, ఆ పార్లమెంట్ లో అధికారికంగా ఎల్ఓపీ లేరు. ఆ తరువాత, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 52 సీట్లను గెల్చుకుంది. దాంతో, ఆ పార్లమెంటులో కూడా అధికారికంగా ఎల్ఓపీ ని నియమించే పరిస్థితి రాలేదు.
2024 లో ఎవరు?
అయితే, 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన రెండు భారత్ జోడో యాత్రలు అందుకు బాగా దోహదపడ్డాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లను గెల్చుకుని, 18వ లోక్ సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రతిపక్ష నేత పదవి సాధించడానికి అవసరమైన 55 సీట్లకు మించి కాంగ్రెస్ గెల్చుకోవడంతో ఆ సారి అధికారికంగా ఎల్ఓపీ గా కాంగ్రెస్ నేత ఉండనున్నారు. రాహుల్ గాంధీని ఆ పదవి చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. సీడబ్ల్యూసీ కూడా ఆ మేరకు ఒక తీర్మానం అమోదించింది. ఒక వేళ రాహుల్ గాంధీ ఆ పదవి చేపట్టని పక్షంలో, మనీష్ తివారీ, కుమారి సెల్జా, గౌరవ్ గొగోయ్ ల్లో ఎవరికైనా ఆ అవకాశం దక్కవచ్చు.
1969 నుంచే ఎల్ఓపీ పదవి
లోక్ సభలో ప్రతిపక్ష నేత పదవి 1969 నుంచే గుర్తింపులోకి వచ్చింది. 1969లో రామ్ సుభాగ్ సింగ్ లోక్ సభకు తొలి గుర్తింపు పొందిన ఎల్ఓపీ అయ్యే వరకు ఈ పదవిని గుర్తించలేదు. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం, 1977 (Salary and Allowances of Leaders of Opposition in Parliament Act, 1977) ద్వారా ఈ పదవికి చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. ప్రతిపక్ష నాయకుడి గుర్తింపును లోక్ సభ స్పీకర్ ఇస్తారని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్ మెంట్ బుక్ లెట్ లో పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష నేత నియామకానికి సంబంధించి 10 శాతం నిబంధన పార్లమెంటు చట్టం (Parliament Act) లో లేకపోవడం గమనార్హం.