Crime news : అత్యాచార బాధితురాలి దారుణ హత్య- ప్లాన్​ చేసి చంపిన తల్లి, సోదరులు!-up crime news woman her sons kill daughter who was raped arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : అత్యాచార బాధితురాలి దారుణ హత్య- ప్లాన్​ చేసి చంపిన తల్లి, సోదరులు!

Crime news : అత్యాచార బాధితురాలి దారుణ హత్య- ప్లాన్​ చేసి చంపిన తల్లి, సోదరులు!

Sharath Chitturi HT Telugu
Sep 23, 2024 07:21 AM IST

UP crime news : ఉత్తర్​ ప్రదేశ్​లో ఓ అత్యాచార బాధితురాలు హత్యకు గురైంది. పరువు పోతుందనే కారణంతో, సొంత కుటుంబసభ్యులు ఆమెను చంపేశారు!

అత్యాచార బాధితురాలి దారుణ హత్య
అత్యాచార బాధితురాలి దారుణ హత్య

యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 17ఏళ్ల అత్యాచార బాధితురాలిని ఆమె తల్లి, సోదరులు హత్య చేశారు! నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది..

17ఏళ్ల బాలిక బాధితురాలిగా ఉన్న అత్యాచారం కేసు కారణంగా కుటుంబానికి నష్టం జరుగుతుందనే భయంతో ఈ ముగ్గురూ హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.

సెప్టెంబర్ 18న తన సోదరుడు, తల్లితో కలిసి మోటార్​సైకిల్​పై వెళ్తుండగా బాలికను కాల్చి చంపారని పోలీసులు తెలిపారు.

20 ఏళ్ల రింకూ అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అతనిపై ఫిబ్రవరిలో ఘజియాబాద్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో రింకూ బెయిల్​పై బయటకు వచ్చాడు.

అయితే రింకూ, మరో సహచరుడితో కలిసి ప్రతీకారం కోసం బాలికను హత్య చేశాడని.. బాధితురాలిని కాల్చి చంపిన తర్వాత కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రింకూతో పాటు అతని అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు. కానీ వారిని విచారిచంగా, పోలీసులకు అనుమానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో వారి ఫోకస్​ బాధితురాలి కుటుంబంపై పడింది.

అయితే కుటుంబానికి అవమానం జరుగుతుందనే భయంతో బాలిక తల్లి, ఇద్దరు సోదరులు కలిసి ఆమెను హత్య చేసేందుకు పథకం రచించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మృతురాలి సోదరుడు వినీత్ తన మేనమామ మహావీర్​తో కలిసి మరో సోదరుడు నీరజ్, తల్లి బ్రిజ్వతితో మోటార్ సైకిల్​పై వెళ్తున్న తన సోదరిని కాల్చిచంపాడని పోలీసులు తెలిపారు.

నీరజ్, వినీత్, బ్రిజ్వతిలను పోలీసులు అరెస్టు చేయగా, మహావీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నేరానికి ఉపయోగించిన అక్రమ నాటు తుపాకీతో పాటు తూటాలు, మోటార్ సైకిల్​ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

16ఏళ్ల బాలికపై అత్యాచారం..

ఉత్తర్​ ప్రదేశ్​లో నేరాలు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్​లోని మహోబా జిల్లాలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన 20 ఏళ్ల యువకుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

కబ్రై పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తున్న ఓ మహిళ ఈ విషయంపై ఫిర్యాదు చేసిందని ఎస్హెచ్ఓ నాగేంద్ర కుమార్ నగర్ తెలిపారు. శనివారం రాత్రి తన కుమారుడితో కలిసి ఓ గదిలో నిద్రిస్తున్నానని, తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిద్రలేచి చూసేసరికి తన 16 ఏళ్ల కుమార్తె ఇంట్లో లేదని చెప్పింది. రాత్రంతా కూతురి కోసం వెతికినా ఆచూకీ లభించలేదని ఆమె తెలిపింది.

ఆదివారం ఉదయం బాలిక భయపడి ఇంటికి వచ్చి తనపై అర్జున్ కుష్వాహ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లికి చెప్పడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించిందని ఎస్హెచ్ఓ తెలిపారు.

నిందితుడు కుష్వాహా విద్యుత్ శాఖలో లైన్​మెన్​గా పనిచేస్తున్నాడని, విద్యుత్ లైన్లు బిగించడానికి తరచూ తన గ్రామానికి వస్తాడని, ఈ కారణంగానే తనకు పరిచయం ఏర్పడిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు శనివారం రాత్రి బాలికను ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, ఖుష్వాహాను ఆదివారం సాయంత్రం అతని గ్రామంలో అరెస్టు చేశామని ఎస్హెచ్ఓ తెలిపారు. ఆయనను సోమవారం కోర్టులో హాజరుపరచనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం