Trump vs Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను బెట్టింగ్ మార్కెట్ నమూనాతో అంచనా వేసిన డేటా సైంటిస్ట్
Trump vs Harris: ఈ నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిరువురూ హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు.
Trump vs Harris: నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య నెలకొన్న పోరుపై నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ డేటా సైంటిస్ట్ థామస్ మిల్లర్ షాకింగ్ జోస్యం చెప్పారు. థామస్ మిల్లర్ గతంలో 2020 ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేశారు.
హ్యారిస్ దే విజయం
2024 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి హారిస్ ఘన విజయం సాధిస్తారని నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ డేటా సైంటిస్ట్ థామస్ మిల్లర్ జోస్యం చెప్పారు. కమల హ్యారిస్ రంగంలోకి దిగిన తరువాత ఆమెకు అనుకూలంగా పరిస్థితులు మారాయని ఆయన విశ్లేషించారు. అప్పటివరకు ట్రంప్ కు అనుకూలంగా కనిపించిన ఫలితాలు, అకస్మాత్తుగా కమల హ్యారిస్ వైపు మళ్లాయన్నారు.
బెట్టింగ్ మార్కెట్లను ఉపయోగించి..
2020 అధ్యక్ష ఎన్నికల్లో కచ్చితమైన ఫలితాన్ని మిల్లర్ అంచనా వేశారు, దీనిని అతను సాంప్రదాయ సర్వేలకు బదులుగా బెట్టింగ్ మార్కెట్లను ఉపయోగించడం విశేషం. బెట్టింగ్ ధరలను ప్రజా ఓటు, ఎలక్టోరల్ కాలేజ్ అంచనాలుగా మార్చే నమూనాను సృష్టించడం ద్వారా అతడు ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వయగలుగుతున్నాడు. 16 అధ్యక్ష పోటీలపై కేంద్రీకృతమైన ఈ నమూనా, ప్రజాదరణ ఓట్లు, బెట్టింగ్ అసమానతల మధ్య బలహీనమైన సంబంధాన్ని చూపిస్తుంది.
తగ్గుతున్న ట్రంప్ ప్రజాదరణ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు (us presidential elections 2024) సంబంధించి మిల్లర్ అంచనా ప్రకారం, సెప్టెంబర్ ముగిసే నాటికి, కమలా హారిస్ 55% ప్రజాదరణ ఓట్లను పొందుతారు. ఇది ఎలక్టోరల్ కాలేజీలో ఆమెకు గణనీయమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. జూన్ లో జో బైడెన్ పై ట్రంప్ (donald trump) ఆధిక్యం సాధించినప్పటికీ, గత కొన్ని నెలలుగా కమలా హారిస్ పాపులారిటీ పెరిగిందని ఆయన విశ్లేషణలో వెల్లడైంది. అయితే బైడెన్ (joe biden) వైట్ హౌజ్ రేసు నుంచి వైదొలిగిన తర్వాత పరిస్థితులు గణనీయంగా మారిపోయాయి.
స్వింగ్ స్టేట్స్ లో పరిస్థితి ఏంటి?
స్వింగ్ స్టేట్స్ లో కూడా క్రమంగా డెమక్రాట్లకు అనుకూలంగా పరిస్థితి మారుతుందని మిల్లర్ అంచనా వేశారు. అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ గత వారం హారిస్ కు తన మద్దతును ప్రకటించిన తరువాత హ్యారిస్ మద్దతు గణనీయంగా పెరిగిందని వివరించారు. ఇటీవల క్వినిపియాక్ విశ్వవిద్యాలయం పోల్ కూడా హ్యారిస్ విజయాన్నే అంచనా వేసింది. గణనీయమైన స్వింగ్ రాష్ట్రాల్లో హారిస్ ముందంజలో ఉన్నారని ఈ పోల్ సూచించింది.
కీలకమైన పెన్సిల్వేనియాలో..
ఈ సర్వే ప్రకారం పెన్సిల్వేనియాలో కమలా హ్యారిస్ ఆరు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ ఆమెకు 51 శాతం మద్ధతు లభించగా, ట్రంప్ కు 45 శాతం మద్ధతు లభించింది. నవంబర్ లో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రం నిర్ణయాత్మకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మిచిగాన్ లో నిర్వహించిన ఒక సర్వేలో ట్రంప్ హారిస్ కంటే ఐదు పాయింట్లు వెనుకబడి ఉన్నారని తేలింది. 50 శాతం మంది డెమొక్రటిక్ అభ్యర్థి హ్యారిస్ కు, 45 శాతం మంది రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ నకు మద్దతు తెలిపారు. విస్కాన్సిన్ లో ట్రంప్ కంటే కమలా హారిస్ స్వల్ప తేడాతో ముందంజలో ఉన్నారని సర్వే తెలిపింది.