PM Modi: వైట్ హౌజ్ లో మీడియా ప్రశ్నలకు జవాబివ్వనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సాధారణంగా ప్రెస్ మీట్ లకు దూరంగా ఉంటారు. కానీ, తొలిసారి గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కలిసి వైట్ హౌజ్ లో ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొననున్నారు.
వైట్ హౌజ్ లో మీడియా ప్రశ్నలకు జవాబివ్వనున్న ప్రధాని మోదీ
వైట్ హౌజ్ లో చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. లాంఛనంగా జరిగే ప్రసంగాల అనంతరం, ఇరువురు నేతలు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిస్తారు. మోదీ, బైడెన్ ప్రెస్ మీట్ ను వైట్ హౌజ్ సీనియర్ అధికారి ఒకరు ‘బిగ్ డీల్’ గా అభివర్ణించడం విశేషం.
మోదీ స్పెషల్..
సాధారణంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రెస్ మీట్ లకు దూరంగా ఉంటారు. విలేకరుల ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానాలివ్వడం చాలా అరుదు. అత్యంత అరుదుగా మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన కనీసం ఒక్క ప్రెస్ కాన్ఫెరెన్స్ లో కూడా పాల్గొనలేదు. మే 2019 లో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కానీ, మీడియా నుంచి ప్రశ్నలను స్వీకరించలేదు. అయితే, అనూహ్యంగా, ఈ సారి అమెరికా పర్యటనలో ఆయన ప్రెస్ నుంచి ప్రశ్నలను స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా వైట్ హౌజ్ ప్రెస్ మీట్స్ చాలా నియంత్రణతో జరుగుతాయి. ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొనే ఈ ప్రెస్ మీట్ కు ఎంపిక చేసిన జర్నలిస్టులు మాత్రమే హాజరవుతారు. వైట్ హౌజ్ లో జరిగే ఈ ప్రెస్ మీట్ కు కూడా ఎంపిక చేసిన మీడియా హౌజ్ ల నుంచి మాత్రమే జర్నలిస్ట్ లు హజరవుతారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక యూఎస్ మీడియా ప్రశ్నకు, ఒక ఇండియన్ మీడియా ప్రశ్నకు జవాబిస్తారు. అలాగే, భారత ప్రధాని మోదీ కూడా ఒక యూఎస్ మీడియా ప్రశ్నకు, ఒక ఇండియన్ మీడియా ప్రశ్నకు సమాధానమిస్తారు.
బైడెన్ పై ఒత్తిడి
ప్రధాని మోదీ ప్రభుత్వం భారత్ లో ముస్లింలపై అణచివేత చర్యలు చేపడుతోందని, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, మతపరమైన మైనారిటీలను వేధిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. మోదీతో చర్చల సమయంలో ఈ అంశాన్ని కూడా లేవనెత్తాలని మానవ హక్కుల కార్యకర్తలతో పాటు సొంత పార్టీ అయిన డెమొక్రటిక్ పార్టీ ఎంపీల నుంచి కూడా జో బైడెన్ పై ఒత్తిడి వస్తోంది.