‘‘నవంబర్ ఎన్నికల్లో గెలిస్తే కార్పొరేట్ టాక్స్ ను 28 శాతానికి పెంచుతా’’: కమల హ్యారిస్-kamala harris proposes raising corporate tax rate to 28 percent ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘‘నవంబర్ ఎన్నికల్లో గెలిస్తే కార్పొరేట్ టాక్స్ ను 28 శాతానికి పెంచుతా’’: కమల హ్యారిస్

‘‘నవంబర్ ఎన్నికల్లో గెలిస్తే కార్పొరేట్ టాక్స్ ను 28 శాతానికి పెంచుతా’’: కమల హ్యారిస్

HT Telugu Desk HT Telugu
Aug 20, 2024 02:39 PM IST

Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపే కీలక అంశాల్లో ఒకటి పన్ను రేట్లలో మార్పు చేర్పులు. ట్రంప్ హయాంలో భారీగా తగ్గించిన కార్పొరేట్ ట్యాక్స్ ను తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే, మళ్లీ పెంచుతానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున పోటీ పడుతున్న కమల హ్యారిస్ చెబుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున పోటీ పడుతున్న కమల హ్యారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున పోటీ పడుతున్న కమల హ్యారిస్ (Reuters)

Kamala Harris: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై నవంబర్లో జరిగే ఎన్నికల్లో గెలిస్తే కార్పొరేట్ పన్ను రేటును 21 శాతం నుంచి 28 శాతానికి పెంచుతామని అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రకటించారు.

కార్పొరేట్ ట్యాక్..

ఈ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే కార్పొరేట్ ట్యాక్స్ విధానంలో కీలక మార్పు తీసుకువస్తానని డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి కమల హ్యారిస్ ప్రకటించారు. బిలియనీర్లు, పెద్ద సంస్థలు తమ న్యాయమైన వాటాను చెల్లించేలా చూడటానికి ప్రస్తుతం 21 శాతంగా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ ను 28 శాతానికి పెంచుతామని వెల్లడించారు. దీనివల్ల ఇతర సామాన్య వర్గాలకు న్యాయమైన, నాణ్యమైన సేవలు అందుతాయన్నారు. వారికి గణనీయ స్థాయిలో డబ్బులు సమకూరుతాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టే దిశగా ఈ నిర్ణయం ఉంటుందని హారిస్ ప్రచార ప్రతినిధి జేమ్స్ సింగర్ అన్నారు.

ట్రంప్ హయాంలో భారీగా తగ్గింపు

అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన డొనాల్డ్ ట్రంప్ (donald trump) కార్పొరేట్ పన్ను రేటును 35 శాతం నుంచి 21 శాతానికి తగ్గించారు. ట్రంప్ హయాంలో అమలైన పన్ను రాయితీలన్నీ వచ్చే ఏడాది ముగియనున్నాయి. అయితే, తాను అధికారంలోకి వస్తే, గతంలో తాను తగ్గించిన ఆదాయ పన్ను రేట్లను శాశ్వతం చేస్తామని ట్రంప్ ఇప్పుడు హామీ ఇస్తున్నారు. కార్పొరేట్ పన్ను రేటును 28 శాతానికి పెంచాలన్న కమలా హారిస్ ప్రతిపాదన దశాబ్ద కాలంలో అమెరికా లోటును 1 ట్రిలియన్ డాలర్లకు తగ్గిస్తుందని కమిటీ ఫర్ ఎ రెస్పాన్సిబుల్ ఫెడరల్ బడ్జెట్ సోమవారం తెలిపింది.

కాంగ్రెస్ ఆమోదం అవసరం

అమెరికా ట్యాక్స్ కోడ్ లో మార్పులకు కాంగ్రెస్ ఆమోదం అవసరం. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పై పట్టు కోసం డెమోక్రాట్లు, రిపబ్లికన్లు గట్టిపోటీ ఇస్తున్నారు. మరోవైపు, ఏడాదికి 4,00,000 డాలర్లు లేదా అంతకంటే తక్కువ సంపాదించే వారిపై పన్నులు పెంచబోమని అధ్యక్షుడు జో బైడెన్ (biden)న్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ హామీ ఇచ్చారు. గత వారం ఇచ్చిన ఆర్థిక విధాన ప్రసంగంలో కమలా హారిస్ పలు విధాన హామీలు ఇచ్చారు. మెజారిటీ అమెరికన్లపై పన్ను భారం తగ్గించడం, వ్యాపారుల "ధరల దోపిడీని" అడ్డుకోవడం వంటి హామీలు అందులో ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తాను అనుసరించాలనుకుంటున్న "ఆపర్చునిటీ ఎకానమీ" లో భాగంగా మరింత సరసమైన ధరలకు గృహాలను నిర్మించే ప్రతిపాదనలను వివరించారు.