Haryana Elections: హరియాణాలో ఒకే విడతలో పోలింగ్; కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ
జమ్మూకశ్మీర్ తో పాటు హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. హరియాణాలో అక్టోబర్ 1వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరగనుంది.
అక్టోబర్ 1న హరియాణా అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు
హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వీటిలో 73 జనరల్, 17 ఎస్సీ, 10 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. హరియాణాలో మొత్తం 2.01 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 1.06 కోట్ల మంది పురుషులు, 0.95 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 4.52 లక్షల మంది ఓటర్లు మొదటిసారి ఓటు వేయనున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 40.95 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. హరియాణా ఓటర్ల జాబితాను 2024 ఆగస్టు 27న ప్రచురిస్తామని ఎన్నికల సంఘం చీఫ్ తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోటీ
హరియాణాలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోటీ నెలకొని ఉన్నది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు చెరో 5 సీట్లను గెల్చుకున్నాయి. అక్టోబర్ 1న హరియాణాలో ఎన్నికలు జరగడం శుభపరిణామమని హర్యానా బీజేపీ నేత అనిల్ విజ్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల సంఘం ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని, ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ తెలిపారు. 2/3వ వంతు మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
అధికార బీజేపీకి పరీక్ష
హర్యానా లో 2014 నుంచి అధికారంలో ఉన్న అధికార భారతీయ జనతా పార్టీకి ఈ అసెంబ్లీ ఎన్నికలు లిట్మస్ టెస్ట్ వంటివి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలిచి దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (JJP)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన మనోహర్ లాల్ ఖట్టర్ ఐదేళ్ల క్రితం రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఈ ఏడాది మార్చి 12న ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా నయాబ్ సింగ్ సైనీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖట్టర్ రాజీనామాతో జేజేపీతో బీజేపీ పొత్తు ముగిసింది.
కాంగ్రెస్ కు మంచి అవకాశం
2019 ఎన్నికల్లో 31 సీట్లు గెలిచినప్పటికీ హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. బీజేపీకి మద్ధతివ్వాలని జేజేపీ నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. 2004 నుంచి 2014 వరకు హరియాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2024 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి అధికారంలోకి రావాలని భావిస్తోంది.
హరియాణా మాంగే హిసాబ్
'హరియాణా మాంగే హిసాబ్' క్యాంపెయిన్ ద్వారా బీజేపీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది. రైతులు, నిరుద్యోగం, శాంతిభద్రతలు తదితర అంశాలపై అధికార బీజేపీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ 'హరియాణా మాంగే హిసాబ్' ప్రచారం నిర్వహిస్తోంది.