Assembly elections: జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం-assembly elections in jammu and kashmir haryana to be held from sep 18 to oct 1 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Assembly Elections: జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం

Assembly elections: జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం

HT Telugu Desk HT Telugu
Aug 16, 2024 04:02 PM IST

రెండు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. హరియాణా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ECI) శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడానికి కొన్ని గంటల ముందు జమ్మూ కాశ్మీర్ పాలన వ్యవస్థలో భారీ పునర్వ్యవస్థీకరణ చేశారు.

 జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం
జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం

జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శుక్రవారం ప్రకటించింది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2019లో మహారాష్ట్ర, జార్ఖండ్ తో పాటు హర్యానాలో ఎన్నికలు జరిగాయి. మరోవైపు, 2014 తర్వాత జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.

జమ్మూకశ్మీర్ లో మూడు దశలు

జమ్మూకశ్మీర్ లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. హర్యానాలో అక్టోబర్ 1న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. జమ్ముకశ్మీర్ ప్రజల్లో ఎంతో ఉత్సాహం ఉందని, వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరుకుంటున్నారని కుమార్ చెప్పారు. వీలైనంత త్వరగా అక్కడ ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ‘‘లోక్ సభ ఎన్నికల సందర్భంగా జమ్ముకశ్మీర్ లోని పోలింగ్ బూత్ ల వద్ద పొడవైన క్యూలు ప్రజలు మార్పును కోరుకోవడమే కాకుండా ఆ మార్పులో భాగస్వాములు కావడం ద్వారా తమ గళాన్ని వినిపించాలనుకుంటున్నారనడానికి నిదర్శనం. ప్రజలు ప్రస్తుత పరిస్థితిని మార్చాలని కోరుకుంటున్నారు. తమ భవితవ్యాన్ని తామే రాసుకోవాలనుకుంటారు’’ అన్నారు.

జమ్ముకశ్మీర్ పాలన పునర్వ్యవస్థీకరణ

జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అధికారాల పరిధిని పోలీసు, పబ్లిక్ ఆర్డర్ నుంచి పోస్టింగ్ లు, ప్రాసిక్యూషన్ వరకు కేంద్ర ప్రభుత్వం విస్తృతం చేసిన నెల రోజుల తర్వాత.. ఆ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. ఈ చర్యలను జమ్ముకశ్మీర్ లో ముఖ్యమంత్రిని శక్తిహీనులుగా చేసి, ఆ ప్రాంత ప్రజలను నిర్వీర్యం చేసే చర్యలుగా ప్రతిపక్షాలు విమర్శించాయి. షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు, అధికారులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, పరిపాలనలో భారీ పునర్వ్యవస్థీకరణకు ఆదేశించారు.

బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే..

భారతీయ జనతా పార్టీ (bjp) నియమించిన ఎల్జి తన పార్టీకి, దాని మిత్రపక్షాలకు ప్రయోజనం చేకూర్చడానికి పునర్వ్యవస్థీకరణకు కుట్ర పన్నినట్లు కనిపిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు అలీ మొహమ్మద్ సాగర్ విమర్శించారు. ఈ చర్య ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేలా కనిపిస్తోందన్నారు.

370 రద్దు..

2019లో జమ్మూకశ్మీర్ కు పాక్షిక స్వయంప్రతిపత్తి హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ, జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టాన్ని రూపొందించారు.ఆ చట్టంలోని పలు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జూలైలో సవరించింది. ఈ సవరణలు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే ఎల్జీకి పరిపాలనాపరమైన ప్రాముఖ్యత ఉన్న విషయాల్లో మరింత అధికారాన్ని ఇస్తాయి. ఒక ప్యూన్ ను నియమించుకునే విషయంలో కూడా ఎల్జీని వేడుకునే పరిస్థితి జమ్మూకశ్మీర్ లోని రబ్బరు స్టాంప్ ముఖ్యమంత్రికి ఉంటుందని మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు.

స్థానిక నేతలతో ఈసీ చర్చలు

జమ్ముకశ్మీర్ లో ఎన్నికల షెడ్యూల్ ను నిర్ణయించే ప్రక్రియను ఈసీఐ ప్రారంభించిన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, ఎస్ ఎస్ సంధు పార్టీలకు అతీతంగా అక్కడి నేతలతో చర్చలు జరిపారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి సమన్యాయం జరిగేలా చూడాలని వివిధ పార్టీల ప్రతినిధులు ఈసీని కోరారు. 2018 జూన్ లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నప్పటి నుండి జమ్మూ కాశ్మీర్లో ఎన్నుకోబడిన ప్రభుత్వం లేదు. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ముందు ఈ ప్రాంతం గవర్నర్ పాలనలో ఉంది.

సుప్రీంకోర్టు ఆదేశాలు..

ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు 2024 సెప్టెంబర్ 30 నాటికి 90 మంది సభ్యులున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని ఈసీఐని ఆదేశించింది. వీలైనంత త్వరగా ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మే 2022 లో, ముగ్గురు సభ్యుల డీలిమిటేషన్ కమిషన్ జమ్మూ కాశ్మీర్ (jammu and kashmir) ఎన్నికల మ్యాప్ ను పునర్నిర్మించింది, హిందూ మెజారిటీ ఉన్న జమ్మూ ప్రాంతానికి 43 సీట్లు, ముస్లిం మెజారిటీ కాశ్మీర్ కు 47 స్థానాలను కేటాయించింది. కొత్తగా వచ్చిన ఏడు సీట్లలో ఆరు జమ్మూకు, ఒకటి కశ్మీర్ కు కేటాయించారు. ఇది బీజేపీ ఓటు బ్యాంకును సంఘటితం చేసే ప్రయత్నమని ప్రాంతీయ పార్టీలు ప్యానెల్ నిర్ణయాన్ని తోసిపుచ్చాయి.

హర్యానాలో ఒకే విడతలో..

హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 1వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హర్యానా అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 3తో ముగియనుంది. 2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ చెరో ఐదు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్న కొన్ని నెలల తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 44 అసెంబ్లీ సెగ్మెంట్లలో, కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూటమి 46 స్థానాల్లో ఆధిక్యత కనపరిచింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది.