Haryana new CM: హరియాణా కొత్త ముఖ్యమంత్రి.. నయాబ్ సింగ్ సైనీ
Haryana new CM: హరియాణా కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. అధికార బీజేపీ-జేజేపీ కూటమిలో విభేదాల నేపథ్యంలో మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీ ని ఎన్నుకున్నారు.
Haryana new CM Nayab Singh Saini: హరియాణా కొత్త ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైనీ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సైనీతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు బన్వరీ లాల్, జై ప్రకాశ్ దలాల్, స్వతంత్ర శాసనసభ్యుడు రంజిత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభాపక్ష సమావేశం నుంచి మధ్యలోనే నిష్క్రమించిన మాజీ హోంమంత్రి అనిల్ విజ్ చండీగఢ్ లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు.
ప్రధాని మోదీ శుభాకాంక్షలు
హరియాణా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నయాబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) కి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హరియాణా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ @NayabSainiBJP గారికి అభినందనలు. హరియాణా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను' అని సోషల్ ప్లాట్ ఫామ్ ఎక్స్ లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. కురుక్షేత్రకు చెందిన ఎంపీ, ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సైనీని గత ఏడాది అక్టోబర్ లో హర్యానా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించారు.
2019 నుంచి..
2019 నుండి హరియాణాలో భారతీయ జనతా పార్టీ-జననాయక్ జనతా పార్టీ (BJP - JJP) కూటమి అధికారంలో ఉంది. తాజాగా, ఈ కూటమిలో విబేధాలు రావడంతో, మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. వెంటనే, నయాబ్ సింగ్ సైనీ ని బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను తనకు అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హరియాణా బీజేపీ ఇంచార్జ్ బిప్లబ్ దేబ్, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ లకు నయూబ్ సింగ్ సైనీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో సైనీ (Nayab Singh Saini) పోస్ట్ చేశారు.
కూటమిలో విబేధాలు ఎందుకు?
లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకాల చర్చలు విఫలం కావడంతో భారతీయ జనతా పార్టీ-జననాయక్ జనతా పార్టీ (బీజేపీ-జేజేపీ) ల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఖట్టర్ మంత్రివర్గంలో సీఎం సహా 14 మంది మంత్రులు, ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీకి చెందిన ముగ్గురు సభ్యులు ఉన్నారు. 90 మంది సభ్యులున్న హరియాణా అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 41 మంది, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏడుగురు ఇండిపెండెంట్లలో ఆరుగురి మద్దతు కూడా బీజేపీకి ఉంది. అలాగే, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు 30 మంది ఎమ్మెల్యేలు, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, హర్యానా లోక్ హిత్ పార్టీకి చెరో స్థానం ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 లోక్ సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
కాంగ్రెస్ స్పందన
హరియాణా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘హరియాణాలో జరుగుతున్నదంతా మార్పు తీసుకురావాలని ప్రజలు నిర్ణయించడం వల్లే జరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం' అని పార్టీ నేత, ఎంపీ దీపేందర్ హుడా పేర్కొన్నారు.