హర్యానాలో కాంగ్రెస్‌కే స్వల్ప ఆధిక్యత.. పీపుల్స్ పల్స్ సర్వే లో వెల్లడి
Peoples Pulse Survey: కాంగ్రెస్ నిన్నటి ఊపు రేపటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగేనా? ఇప్పటికైతే ‘పబ్లిక్ మూడ్’ కాంగ్రెస్ పక్షంలోనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకొని ఉన్న హిందీ రాష్ట్రం కావడంతో అందరి చూపులూ ఇప్పుడు హర్యానాపై కేంద్రీకృతం అవుతున్నాయి.
ఇక హర్యానా హాట్ కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార మార్పిడి సునాయాసంగానే జరుగొచ్చు.
కానీ, కూటమి భాగస్వాములైన కాంగ్రెస్- ఆమ్ఆద్మీపార్టీ (ఆప్)లు ఈ సారి విడిగా పోటీ చేస్తుండటం వల్ల బీజేపీ రొట్టె విరిగి నేతిలో పడుతుందా? అన్నది ఓ సందేహమే. నవంబరు తొలివారానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి కనుక అక్టోబరులోనో, అంతకు ముందో ఎన్నికలు జరుగుతాయి.
గత రెండు ఎన్నికల్లో మొత్తం పది లోక్ సభ స్థానాలు గెలిచిన బీజేపీని దెబ్బకొట్టి, నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సగం, అంటే అయిదు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. పొత్తుల్లో ఒకచోట పోటీచేసిన ఆప్ మద్దతు మిగతా రాష్ట్రమంతటా కాంగ్రెస్ కు కలిసొచ్చింది. అసెంబ్లీ మొత్తం 90 స్థానాల్లో విడిగా పోటీ చేస్తానంటున్న ఆప్‌కు సొంతంగా సీట్లు గెలిచేంత బలం కనపించడంలేదు. కాంగ్రెస్ నిన్నటి ఊపు రేపటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగేనా? ఇప్పటికైతే ‘పబ్లిక్ మూడ్’ కాంగ్రెస్ పక్షంలోనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకొని ఉన్న హిందీ రాష్ట్రం కావడంతో అందరి చూపులూ ఇప్పుడు ఇటే కేంద్రీకృతం అవుతున్నాయి.
పీపుల్స్ పల్స్ సర్వేలో తేలిందిదే
హర్యానాలో ఇప్పుడు ప్రధానంగా యువతరం, రైతులు సానుకూలంగా ఉండటం, దళిత -జాట్ సామాజిక వర్గాల్లో మద్దతు పెరగటం కాంగ్రెస్ కు అనుకూలిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత గమనించదగ్గ స్థాయిలోనే కనిపిస్తోంది. స్థానికాంశాలే ఎన్నికల్లో ప్రజా ఎజెండా అయ్యే అవకాశం ఉన్నందున, లోక్‌సభ ఎన్నికల నాటికన్నా బీజేపీ పరిస్థితి మరింత దిగజారే సూచనలే జనాభిప్రాయంగా వ్యక్తమయ్యాయి.
ఇంకా ఎన్నికల ప్రకటన వెలువడని తాజా పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో జనాభిప్రాయం ఎలా ఉంది? అని జరిపిన ‘పీపుల్స్ పల్స్’ సర్వేలో వెల్లడయిన అంశాలు రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘సౌత్ ఫస్ట్’ మీడియా సంస్థ సౌజన్యంతో ఈ ట్రాకర్ పోల్ సర్వేను నిర్వహించింది. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత హర్యానాలో ‘ప్రీపోల్ సర్వే’కూడా పీపుల్స్ పల్స్ జరుపనుంది.
90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో, ఈసారి కాంగ్రెస్ 43-48 స్థానాలు గెలుచుకునే సూచనలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాలక బీజేపీ 34-39 స్థానాల్లో గెలవొచ్చు. ఇతర పార్టీలైన జేజేపీ, ఐఎన్ఎల్డీ-బీఎస్పీ కూటమి, ఆప్, ఇతర ఇండిపెండెంట్లు కలిపి 3-8 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా 15 స్థానాల్లో పోటీ నువా-నేనా అన్నట్టుండొచ్చని జనాభిప్రాయాన్ని బట్టి తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారు, ప్రచారం-ఎన్నికల ప్రక్రియ నిర్వహణ తదితరాంశాలను బట్టి కీలకపోటీ ఉండే ఈ 15 స్థానాలు ఎవరివైపైనా మొగ్గొచ్చు. దాన్ని బట్టే అంతిమ విజేత ఎవరనేది తేలే అవకాశం ఉంటుంది.
ఓటు బ్యాంకులహెచ్చు-తగ్గులే లెక్క
బహుళ కారణాలే అయిఉండవచ్చు, విభిన్న వర్గాల ఓటు బ్యాంకులను కాంగ్రెస్ ఈసారి ఎక్కువ ఆకట్టుకోగలుగుతోంది. ఫలితంగా, బీజేపీ స్థిరమైన, ముఖ్య ఓటు బ్యాంకులు కూడా చెదిరిపోనున్నాయి. నిన్నటి ఎన్నికల తుది ఫలితాల గణాంకాలే కాదు, సీఎస్డీఎస్-లోక్ నీతి సర్వే నివేదికలు కూడా ఇదే చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీకి 58 శాతం ఓటు వాటా లభించగా కాంగ్రెస్ 28 శాతం ఓటు వాటాతో సరిపెట్టుకుంది. నిన్నటి ఎన్నికల్లో పరిస్థితి మారింది. కూటమి మిత్రపక్షాలైన కాంగ్రెస్ (44 శాతం), ఆప్ (3.6 శాతం) కలిసి 47.6 శాతం ఓటు వాటాను పొందాయి. పాలక బీజేపీ 46 శాతం వద్ద ఆగిపోయింది.
అందుకే, 2014లో, 2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం పది స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ సారి కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిగతా 5 సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. జాట్లలో ఎలాగూ మద్దతుంది, జాటేతరుల్లోనూ మద్దతు కూడగట్టాలని లోక్ సభ ఎన్నికల ముందు ముఖ్యమంత్రిని మార్చి బీజేపీ నాయకత్వం ఒక ప్రయోగం చేసింది. మనోహర్ లాల్ కట్టర్ ను మార్చి, ఆయన స్థానే నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా తెచ్చినా... ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రాలేదు.
కిందటి ఎన్నికలతో పోలిస్తే, బీజేపీకి ఈసారి ఓబీసీల్లో 29 శాతం ఓటువాటా తగ్గుదల నమోదైనట్టు సీఎస్డీఎస్-లోక్ నీతి గణాంకాలు చెబుతున్నాయి. జాటేతరుల్లో కూడా, ముఖ్యంగా బ్రాహ్మణులు, రాజ్ పూత్ లు, పంజాబీలు, బన్యాల్లోనూ కాంగ్రెస్ గణనీయంగా స్కోర్ చేసింది. ఇంతకు మున్ను ఎస్సీ ఓట్లు బీఎస్పీ-బీజేపీ మధ్య చీలేవి. కానీ, ఈ సారి ప్రతి ముగ్గురు ఎస్సీల్లో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకే వేసినట్టు సర్వే లెక్కల్ని బట్టి తెలుస్తోంది.
దాదాపు అదే దారిలో.... తాజా సర్వే ప్రకారం కూడా కాంగ్రెస్ 44 శాతం, బీజేపీ 41 శాతం, జేజేపీ 2 శాతం, ఐఎన్ఎల్డీ-బీఎస్పీ 3 శాతం, ఆప్ 1 శాతం, ఇతరులు 9 శాతం ఓటు వాటా పొందవచ్చని ‘హర్యానా మూడ్’ చెబుతోంది. ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటారన్నపుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి సైనీ కన్నా భూపేందర్ సింగ్ హుడాకు పదిశాతం అదనపు మద్దతు లభించింది.
జాట్ల మద్దతు కీలకం
హర్యానాలో నాలుగోవంతు జనాభా జాట్లే! అంతకు మించి, వారొక ప్రభావిక సామాజిక వర్గం. వారి మద్దతును కూడగట్టడంలో ఈ సారి కాంగ్రెస్ సఫలమైంది. సీఎస్డీఎస్-లోక్ నీతి పోస్ట్ పోల్ సర్వే ప్రకారం ప్రతి ముగ్గురు జాట్లలో ఇద్దరు కాంగ్రెస్ కు ఓటేశారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 31 శాతం వృద్ది. అంతే కాకుండా వారు ఇతరులతో కాంగ్రెస్కు ఓటు వేయించారు. అందుకే, జాట్ ప్రభావిత ప్రాంతాల్లోని హిసార్, సిర్సా, సోనెపత్, రోహతక్... అన్ని సీట్లూ గెలవటమే వారి మనసు కాంగ్రెస్ గెలిచిందనడానికి నిదర్శనం!
జాట్ ఓట్ల మీదనే ప్రధానంగా ఆధారపడే ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ), జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) వంటి ఉప ప్రాంతీయ పార్టీలు (ఇద్దరికీ కలిపి ఉమ్మడిగా కూడా 3 శాతం లోపే ఓటు వాటా) ఈ ఎన్నికల్లో పూర్తిగా ఆదరణ కోల్పోవడం ఇంకో సంకేతాన్ని కూడా ఇచ్చినట్టయింది. వాళ్లకు ఓటు వేయడం వల్ల బీజేపీని ఓడించజాలమనే ఆలోచనతో వారు సంప్రదాయానికి భిన్నంగా కాంగ్రెస్ కు ఓటు వేసి బీజేపీని ఓడించాలనే తమ మనోగతాన్ని బలంగా వెల్లడించినట్టయింది.
ఒకప్పుడు ఐఎన్ఎల్డీ, హర్యానా వికాస్ పార్టీ వంటి వారికి మైనర్ భాగస్వామిగా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగిడిన బీజేపీ.... ఇప్పుడు ప్రధాన పోటీదారుగా మారింది. గత రెండు పర్యాయాలుగా అధికారం చెలాయిస్తోంది. కానీ, ఈసారి ప్రభావం తగ్గింది. బీజేపీ ప్రభుత్వం మళ్లీ రావాలా? అని తాజా సర్వేలో అడిగినపుడు, రావాలని 40 శాతం మంది కోరుకుంటే, వద్దని 48 శాతం మంది కోరుకున్నారు. 12 శాతం మంది ఏ అభిప్రాయం చెప్పకుండా తటస్థంగా ఉన్నారు.
తగ్గిన మార్జిన్లు దేనికి సంకేతం?
హర్యానా క్రమంగా రెండు పార్టీల ముఖాముఖి పోటీల బరిగా మారుతోందా? కొన్ని దశాబ్దాలుగా పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అదే నిజమనిపిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ 2009లో 12 స్థానాల్లో ఉంటే, 2014 ఎన్నికల్లో అది 19 స్థానాలకు, 2019లో 51 స్థానాలకు పెరిగింది. హర్యానాలోని 17 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ 2009లో కాంగ్రెస్ - ఐఎన్ఎల్డీ మధ్య ఉంటే, 2014లో అది బీజేపీ - ఐఎన్ఎల్డీగా జరిగింది. మళ్లీ 2019 ఎన్నికలకు వచ్చే సరికి సదరు అది కాస్త, బీజేపీ - కాంగ్రెస్ మధ్య పోటీగా మారింది. ఈ సారి ఎన్నికల్లో గెలుపోటముల మధ్య ఓట్ల వ్యత్యాసాలు బాగా తగ్గాయి.
రోహతక్, కర్నల్, సిర్సా, ఫరీదాబాద్ తప్పిస్తే.... మిగతా ఎక్కడా విజేతల మెజారిటీలు లక్ష దాటలేదు, అత్యధికం యాబైవేల లోపే! అసెంబ్లీలోనూ ఇదే పరిస్థితి ఉంటే, ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చేమో అనే ఆశలు పుడుతున్నాయి. అందుకేనేమో, ఆప్ 90 స్థానాల్లోనూ సొంతంగా పోటీ చేయడానికి సిద్దపడిపోతోంది. ఇండియా కూటమి భాగస్వామిగా కాకుండా విడిగా ఎన్నికల మానిఫెస్టోకు సమాయత్తమైంది. కానీ, ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పగల స్థానాలు ఒకటి, రెండు కూడా లేవని సర్వేలో జనాభిప్రాయాన్ని బట్టి తెలుస్తోంది. చిన్న పార్టీలన్నీ జనం దృష్టిలో చిన్నబోయి ఉండటంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ ప్రధానంగా బీజేపీ - కాంగ్రెస్ మధ్య ముఖాముఖీయేనని స్పష్టమౌతోంది.
చల్లారని రైతు ఆగ్రహజ్వాల!
రైతు ఉద్యమాలను అణచివేసిన కేంద్ర ప్రభుత్వం, సదరు ఎన్డీయేకు నేతృత్వం వహిస్తున్న బీజేపీపై వారికి కోపం తగ్గలేదు. లోక్ సభ ఎన్నికల్లో వారా కోపాన్ని ఓటింగ్ సరళి ద్వారా వ్యక్తం చేశారు. సీఎస్డీఎస్ పోలింగ్ అనంతర సర్వే ప్రకారం రైతుల్లో 61 శాతం మంది ‘ఇండియా కూటమి’కి ఓటేస్తే 35 శాతం మంది మాత్రమే ఎన్డీయే కూటమికి ఓటు వేశారు.
అదే, రైతేతరుల్లో గమనించినప్పుడు అది, ఎన్డీయేకు 49 శాతంగా, ఇండియా కూటమికి 44 శాతం అనుకూలంగా నమోదయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇది ప్రతికూలంగా పనిచేసే ఆస్కారం స్పష్టంగానే కనిపిస్తోంది. హర్యానాలోని ఆరు ప్రాంతాల్లోనూ ఒక్కరీతిగా.... నిరుద్యోగం, రైతు కష్టాలు, ద్రవ్యోల్భణం నియంత్రణలో లేక దిగిరాని నిత్యావసరాల ధరలు, అగ్నిపథ్, అభివృద్ది లేమి ..... వంటి అంశాలే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని, పీపుల్స్ పల్స్ తాజా సర్వేలో కూడా జనాభిప్రాయంగా ప్రస్పుటమయ్యాయి. సర్వే అంచనాలు ఇలా ఉంటే వాస్తవంగా హర్యానా ఓటరు మనోగతం ఎలా ఉందో.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే!
-దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ
(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన విశ్లేషణలు, వ్యాఖ్యానాలు, వ్యూహాలు వ్యాసకర్త వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు)