Trump vs Harris: కమలా హారిస్ తో డిబేట్ కు మరో ఇండో అమెరికన్ సపోర్ట్ తీసుకుంటున్న ట్రంప్
Trump vs Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమల హారిస్ తో డిబేట్ సమయంలో మరో ఇండో అమెరికన్ తులసి గబ్బార్డ్ సహాయం తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు.2019 డెమొక్రటిక్ డిబేట్ లో కమలా హారిస్ తో తులసి పోటీ పడ్డారు.
US Presidential elections 2024: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తో డిబేట్ కు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ చర్చలో తనకు సహకరించడానికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పార్టీ సహచరురాలు, కాంగ్రెస్ మాజీ సభ్యురాలు తులసి గబ్బార్డ్ సహాయం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ షెడ్యూల్ గురించి తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.
ప్రాక్టీస్ సెషన్
తులసీ గబ్బార్డ్ తన మార్-ఎ-లాగో ఎస్టేట్ లో డొనాల్డ్ ట్రంప్ తో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ట్రంప్, కమలా హారిస్ సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్ లో డిబేట్ చేయనున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత తులసి గబ్బార్డ్ డెమొక్రటిక్ పార్టీని వీడి, రిపబ్లికన్ పార్టీలో చేరారు. అనంతరం, ట్రంప్ మద్దతుదారుల్లో గుర్తించదగిన వ్యక్తిగా మారారు. ట్రంప్ తో ఆమెకు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఒక దశలో రిపబ్లికన్ పార్టీలో అతడికి ప్రత్యర్థిగా నిలవనున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.
2019 డిబేట్ లో కమలపై విజయం
2019 డెమొక్రటిక్ అధ్యక్ష ప్రైమరీ డిబేట్ లో తులసి గబ్బార్డ్ కమలా హారిస్ ను ఓడించి, చిరస్మరణీయ విజయం సాధించారు. ఇప్పుడు సెప్టెంబర్ 10న జరగనున్న డిబేట్లో తనకు సహకరించడానికి ట్రంప్ తులసి గబ్బార్డ్ ను ఎంచుకోవడానికి అది కూడా ఒక కారణం. ట్రంప్ అధికార ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఈమెయిల్ లో ఈ విషయాన్ని ధృవీకరించారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ట్రంప్ కు టఫ్ ఫైటే..
చర్చలకు తాను సిద్ధం కావాల్సిన అవసరం లేదని ట్రంప్ చెబుతున్నప్పటికీ, మాజీ అధ్యక్షుడు 2016 లేదా 2020లో కంటే ఈ ఏడాది డిబేట్లకు సిద్ధం కావడానికి ఎక్కువ సమయం గడిపుతున్నారని ఆయనతో పనిచేసిన సలహాదారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. జూన్ లో అధ్యక్షుడు బైడెన్ తో సీఎన్ఎన్ చర్చకు ముందు, డొనాల్డ్ ట్రంప్ తన సలహాదారులతో సుదీర్ఘంగా చర్చించి, డిబేట్ కు సిద్ధమయ్యారు. ఆ డిబేట్ లో నిలకడలేని పనితీరుతో బైడెన్ పోటీ నుంచి తప్పుకున్నారు. సెప్టెంబర్ 10న కమలా హారిస్ తో జరిగే డిబేట్ కు ట్రంప్ సహాయకులు ఇదే విధంగా ఏర్పాట్లు చేస్తారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే, కమలా హారిస్ తో డిబేట్ కు ట్రంప్ నకు టఫ్ ఫైటే అవుతుందని భావిస్తున్నారు.