Kamala Harris: మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ను తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకున్న కమలా హారిస్
Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కమలా హారిస్ తన ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ను ఎంపిక చేసుకున్నారని సీఎన్ఎన్ నివేదించింది.
Kamala Harris: కమలా హారిస్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని ఎంపిక చేసుకున్నారు. మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ను ఆమె తన రన్నింగ్ మేట్ గా ఎంపిక చేసుకున్నట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. ఫిలడెల్ఫియాలో ఆగస్టు 6, మంగళవారం జరిగే తమ మొదటి సంయుక్త ర్యాలీలో హారిస్, టిమ్ వాల్జ్ కలిసి కనిపిస్తారని నివేదించింది. డెమొక్రాట్ అభ్యర్థిగా కమలా హారిస్ ను నిర్ధారించే ఎంపిక ప్రక్రియ సమయంలో వాల్జ్ ఆమెకు బాగా సహకరించారని తెలుస్తోంది. టిమ్ వాల్జ్ 'హ్యాపీ గో లక్కీ' స్వభావానికి కమలా హారిస్ ముగ్ధుడయ్యారని సమాచారం. ఉపాధ్యక్ష పదవికి టిమ్ వాల్జ్ ను ఎంపిక చేయడంపై డెమొక్రాట్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కమలా హారిస్ టిమ్ వాల్జ్ ను ఎందుకు ఎంచుకున్నారు?
తన ఉపాధ్యక్ష పదవికి టిమ్ వాల్జ్ ను కమలా హారిస్ ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని సీఎన్ఎన్ కు చెందిన జాన్ కింగ్ వివరించారు. ముఖ్యంగా వాల్జ్ తో తన "కంఫర్ట్ లెవల్" బావుంటుందని, పాలనలోనూ వాల్జ్ అనుభవం, ఆయన సూచనలు తనకు ఉపయోగపడ్తాయని కమల భావించి ఉంటారని చెప్పారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో వాల్జ్ తనకు సహకరిస్తారని కమల భావించి ఉంటారని కింగ్ చెప్పారు.