Trump assassination attempt : ట్రంప్​పై మరోమారు హత్యాయత్నం! గోల్ఫ్​ ఆడుతుండగా..-5 things to know about the apparent assassination attempt on trump at his golf courses ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Trump Assassination Attempt : ట్రంప్​పై మరోమారు హత్యాయత్నం! గోల్ఫ్​ ఆడుతుండగా..

Trump assassination attempt : ట్రంప్​పై మరోమారు హత్యాయత్నం! గోల్ఫ్​ ఆడుతుండగా..

Sharath Chitturi HT Telugu
Sep 16, 2024 06:28 AM IST

Trump assassination attempt : డొనాల్డ్​ ట్రంప్​పై మరో మారు హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది! ట్రంప్​ గోల్ఫ్​ ఆడుతుండగా, సమీపంలో కాల్పుల శబ్దం వినిపించింది. అనంతరం ఓ వ్యక్తి ఎస్​యూవీలో పారిపోయాడు. అతడిని పోలీసులు పట్టుకుని అరెస్ట్​ చేశారు.

ట్రంప్​పై మరోమారు హత్యాయత్నం!
ట్రంప్​పై మరోమారు హత్యాయత్నం! (AP)

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై మరోమారు హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది! ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్​లోని తన గోల్ఫ్ కోర్సులో ట్రంప్ ఆడుకుంటుండగా కాల్పుల శబ్దం వినిపించింది. ఈ నేపథ్యంలో ట్రంప్​కు రక్షణగా ఉన్న యూఎస్​ సీక్రెట్​ సర్వీస్​ ఏజెంట్లు.. ఏకే తరహా రైఫిల్​ పట్టుకున్న వ్యక్తి వైపు కాల్పులు జరిపారు.

రెండు నెలల క్రితం పెన్సిల్వేనియాలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్​ ట్రంప్​పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. నాడు ఓ వ్యక్తి, ర్యాలీకి సమీపంలోని బిల్డింగ్​ మీద నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటన నుంచి ట్రంప్​ తృటిలో తప్పించుకున్నారు. చెవికి గాయంతో బయటపడ్డారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ట్రంప్​పై మరోమారు హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తుండటం, రిపబ్లికెన్​ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.

ట్రంప్​పై హత్యాయత్నం! అసలేం జరిగింది?

ట్రంప్​ గోల్ఫ్​ కోర్సులో కాల్పుల శబ్దం కచ్చితంగా వినిపించింది. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి, అనంతరం అక్కడి నుంచి ఎస్​యూవీలో పారిపోయాడు. అనంతరం అతడిని లా ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు అరెస్ట్​ చేశారు. అతడి పేరు ర్యాన్ వెస్లీ రౌత్ అని ఓ అధికారి తెలిపారు.

దుండగుడి వద్ద రెండు బ్యాక్ ప్యాక్​లు కంచెకు వేలాడుతూ కనిపించాయని, ఒక గో-ప్రో కెమెరా కూడా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటన వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నార్త్ కరోలినా డిపార్ట్మెంట్ ఆఫ్ అడల్ట్ కరెక్షన్ ఆన్​లైన్ రికార్డుల ప్రకారం.. డొనాల్డ్​ ట్రంప్​పై కాల్పులకు పాల్పడిన రౌత్​ 2002లో సామూహిక విధ్వంసక ఆయుధాన్ని కలిగి ఉన్నాడన్న అంశంలో దోషిగా తేలాడు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో పేర్కొనలేదు. కానీ 2002 నాటి న్యూస్ అండ్ రికార్డ్ కథనం ప్రకారం అదే పేరుతో ఉన్న వ్యక్తి మూడు గంటల పాటు పోలీసులతో వాగ్వాదం చేసిన తర్వాత అరెస్టు అయ్యడు. మీడియా కథనం ప్రకారం.. ట్రాఫిక్​ సిగ్నల్​ దగ్గర పోలీసులు అతడిని పట్టుకున్నారు. కానీ అతను గన్​పై చేతులు వేసి, తర్వాత పక్కనే రూఫింగ్​ బిజినెస్​లోకి వెళ్లి దాకున్నాడు. అనంతరం అతడిని పోలీసులు పట్టుకున్నారు. సామూహిక విధ్వంసం సృష్టించే ఆయుధం అతడి దగ్గర ఉందని పోలీసులు అభియోగాలు మోపారు.

ప్రస్తుత ఘటనలో వెస్ట్ పామ్ బీచ్​లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్​లో మాజీ అధ్యక్షుడు గోల్ఫ్ ఆడుతుండగా దుండగుడు ట్రంప్​కు 400 గజాల నుంచి 500 గజాల దూరంలో పొదల్లో దాక్కున్నాడని స్థానిక అధికారులు తెలిపారు.

పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ రిక్ బ్రాడ్షా మాట్లాడుతూ.. ప్రజలు పొదల్లోకి ప్రవేశించినప్పుడు, వారిని గుర్తుపట్టడం చాలా కష్టం అని చెప్పారు. ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉండి ఉంటే గోల్ఫ్ కోర్స్ మొత్తం చట్టాల అమలుతో నిండి ఉండేదని, కానీ ఆయన అధ్యక్షుడు కానందున, "సీక్రెట్ సర్వీస్ సాధ్యమయ్యే ప్రాంతాలకు మాత్రమే భద్రత కల్పిస్తుంది," అని బ్రాడ్షా అన్నారు.

తాజా కాల్పుల ఘటనపై డొనాల్డ్​ ట్రంప్​ స్పందించారు.

“నా చుట్టుపక్కల తుపాకీ కాల్పులు జరిగాయి. కానీ పుకార్లు అదుపు తప్పడానికి ముందు, నేను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాను అని స్పష్టం చేస్తున్నాను," అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు.

ఈ ఘటన తర్వాత ట్రంప్​తో మాట్లాడామని, ఆయన మంచి ఉత్సాహంతో ఉన్నారని ఆయన సహచరుడు జేడీ వాన్స్, దక్షిణ కరోలినాకు చెందిన అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు. పలువురు ఫాక్స్ న్యూస్ హోస్ట్​లతో కూడా ట్రంప్ సమావేశమయ్యారు.

ఆ తర్వాత ట్రంప్, ఆయన గోల్ఫ్ భాగస్వామి స్టీవ్ విట్కాఫ్​తో మాట్లాడినట్లు మాజీ అధ్యక్షుడి సన్నిహితుడు, ఫాక్స్ న్యూస్ హోస్ట్ సీన్ హన్నీటీ తెలిపారు. కాల్పుల శబ్దం వినిపించిన సెకన్ల వ్యవధిలోనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ వైపు దూసుకెళ్లి, ఆయనను రక్షించేందుకు ఆయన్ని కప్పి ఉంచారని విట్కాఫ్ వివరించారు.

అనంతరం ట్రంప్​ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థి, డెమొక్రటిక్ పార్టీ ప్రత్యర్థి అయిన కమలా హారిస్ తాజా తుపాకీ కాల్పుల వార్తలపై స్పందించారు. ఆయన క్షేమంగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. హింసకు అమెరికాలో స్థానం లేదన్నారు.

అధ్యక్షుడు జో బైడెన్, కమలా హారిస్ దర్యాప్తుపై అప్డేట్ ఇస్తారని వైట్​హౌస్​ తెలిపింది. ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలియడం తమకు ఉపశమనం కలిగించిందని వైట్​హౌస్ వివరించింది.

సంబంధిత కథనం