Kejriwal Weight Loss : కేజ్రీవాల్ కావాలనే బరువు తగ్గారు.. ఆప్ నేతలకు తీహార్ జైలు అధికారుల కౌంటర్!
Kejriwal Health : జైలు శిక్ష సమయంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తీహార్ జైలు అధికారుల మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా దీనిపై తీహార్ జైలు అధికారులు ఆప్ నేతలకు కౌంటర్ ఇచ్చారు.
AAP Vs Tihar Jail : కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఇటు ఆప్ నేతలకు, తీహార్ జైలు అధికారులకు మధ్య వివాదం నడుస్తోంది. వేగంగా బరువు తగ్గడం వల్ల జైలులో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని ఆప్ ఆరోపించగా, జైలు పరిపాలనను భయపెట్టేలా కథనాన్ని రూపొందిస్తున్నారని జైలు అధికారులు కౌంటర్ క్లెయిమ్ చేశారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పటి నుంచి 8.5 కిలోల బరువు తగ్గారని, ఆయన్ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ నేతలు గతంలో పేర్కొన్నారు.
ఆప్ ఆరోపణలకు ప్రతిస్పందనగా కేజ్రీవాల్ ఆరోగ్య రికార్డుల వివరణాత్మక నివేదికలో ఏప్రిల్ 1న మొదటిసారి తీహార్‌కు తీసుకువచ్చినప్పుడు దిల్లీ ముఖ్యమంత్రి బరువు 65 కిలోలు అని, తర్వాతి రోజుల్లో అది 66 కిలోలకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. బెయిల్ పొందే వరకు ఇలానే ఉందని తీహార్ జైలు పేర్కొంది. ఏప్రిల్ 9న జైలు నుంచి బయటకు వెళ్లి జూన్ 2న తిరిగి వచ్చేసరికి తగ్గినట్లు తేలింది.
స్పష్టమైన కారణాలతో కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా బరువు తగ్గారని జైలు యంత్రాంగం పేర్కొంది. జైలు అధికారుల ప్రకారం, ఏప్రిల్ 1న తీహార్ సెంట్రల్ జైలులోకి ప్రవేశించినప్పుడు కేజ్రీవాల్ బరువు 65 కిలోలు ఉంది. మే 10న బెయిల్ మంజూరు అయ్యే సమయానికి, ఆయన బరువు 64 కిలోలకు తగ్గింది. జూన్ 2న మళ్లీ వచ్చే సమయానికి కేజ్రీవాల్ బరువు 63.5 కిలోలుగా నమోదైంది. ప్రస్తుతం అతని బరువు 61.5 కిలోలు అని అధికారులు చెబుతున్నారు.
ఇంతకుముందు, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. కేజ్రీవాల్ 70 కిలోల బరువు ఉన్నారని, జైలులో 61.5 కిలోలకు తగ్గారని కామెంట్స్ చేశారు. ఇలా వేగంగా బరువు తగ్గడం తీవ్రమైన ఆరోగ్య సమస్యను సూచిస్తుందని అన్నారు.
దీనికి కౌంటర్‌గా జైలు అధికారులు జైలు వైద్య అధికారి చెప్పిన మాటలను వివరించారు. కేజ్రీవాల్ బరువు తగ్గడానికి ఆహార వినియోగం తగ్గడం లేదా తక్కువ కేలరీల ఆహారం వంటి కారకాలు కారణమని పేర్కొన్నారు. బెయిల్‌కు ముందు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా చక్కెర స్థాయిలను పెంచే ఆహార పదార్థాలను తిన్నారని చెబుతున్నారు.
గతంలో జైలులో ఉన్న సమయంలో ఆయన ఉద్దేశపూర్వకంగా తన చక్కెర స్థాయిలను పెంచే ఆహారాన్ని తినడం గమనించవచ్చని అంటున్నారు. ఎయిమ్స్ మెడికల్ బోర్డు నిరంతరం కేజ్రీవాల్‌ను పర్యవేక్షిస్తోందని, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ మెడికల్ బోర్డుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
దిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కొంతకాలం బెయిల్ పొందిన తర్వాత, ఆయన తీహార్ జైలుకు తిరిగి వచ్చారు.