KCR Bihar tour | కేసీఆర్ బిహార్ పర్యటనతో ఏం జరగబోతోంది?
తెలంగాణ ముఖ్యమంత్రి బిహార్ రాష్ట్ర పర్యటన జాతీయ స్థాయిలో రాజకీయంగా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఎదురులేని శక్తిగా ఎదుగుతున్న తరుణంలో, బలమైన జాతీయ స్థాయి విపక్ష కూటమి ఏర్పాటులో కేసీఆర్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌ల భేటీ తొలి అడుగు కానుందా?
KCR Bihar tour | తెలంగాణ సీఎం కేసీఆర్ బిహార్ పర్యటనలో ఉన్నారు. ఆయన బిహార్ పర్యటన షెడ్యూల్‌లో పలు కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తో, ఆర్జేడీ ప్రధాన నాయకులు లాలుప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లతో వేర్వేరుగా జరగనున్న సమావేశాలు.
KCR Bihar tour | అధికారిక కార్యక్రమాలు..
కేసీఆర్ బిహార్ పర్యటనలో భాగంగా మొదట గాల్వన్ అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణల్లో 26 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. వారిలో బిహార్‌కు చెందినవారు కూడా ఉన్నారు. ఆ అమరవీరుల కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు. అలాగే, హైదరాబాద్‌లో ఒక అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందించారు.
KCR Bihar tour | రాజకీయ భేటీలు..
తెలంగాణ సీఎం కేసీఆర్ బిహార్ పర్యటనలో అందరి దృష్టి ఆయన రాజకీయ సమావేశాలపైనే ఉంది. కేసీఆర్ ఎవరెవరిని కలవనున్నారు? ఏయే విషయాలు చర్చించనున్నారు? అనే విషయాలే ప్రస్తుతం చర్చనీయాంశాలుగా ఉన్నాయి. అయితే, బిహార్ పర్యటనలో కేసీఆర్ ప్రధానంగా బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్‌తో, బిహార్ ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షం ఆర్జడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌తో, ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో వేర్వేరుగా సమావేశమవుతున్నారు.
KCR Bihar tour | యాంటీ బీజేపీ ఫ్రంట్..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కేసీఆర్ ఈ మధ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మునుపెన్నడు లేని విధంగా బీజేపీపై మండిపడుతున్నారు. తెలంగాణలో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న కేసీఆర్.. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగానే బీజేపీని ఎదుర్కొనేందుకు ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయాలనే గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ దిశగా, కొన్నాళ్ల క్రితం వివిధ రాష్ట్రాల్లోని కొందరు బీజేపీయేతర ముఖ్యమంత్రులతోనూ సమావేశమయ్యారు. తాజాగా, బిహార్ పర్యటన చేపట్టారు. మరోవైపు, బీజేపీతో దోస్తీకి కటీఫ్ చెప్పి, పాత శత్రువు, కొత్త మిత్రుడు ఆర్జేడీతో జట్టుకట్టి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జేడీయూ నేత నితీశ్‌కుమార్. 2014లోనే ఎన్డీయే ప్రధాని అభ్యర్థిఆ నరేంద్ర మోదీని ప్రతిపాదించడాన్ని వ్యతిరేకించిన నితీశ్.. ఆ తరువాత మళ్లీ అదే మోదీ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. బీజేపీతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజా పరిణామాలతో మళ్లీ బీజేపీకి దూరమై, జాతీయ స్థాయిలో విపక్ష కూటమిని ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నారు.
KCR Bihar tour | అపోజిషన్ ఫేస్..
బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేయాలంటే బలమైన, పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉన్న ప్రధాని అభ్యర్థి అవసరమన్న భావన ఉంది. ప్రస్తుతానికి విపక్షాల తరఫున నితీశ్ కుమార్ మాత్రమే బలమైన ప్రధాని అభ్యర్థి అని జేడీయూ నమ్ముతోంది. సమర్ధ ముఖ్యమంత్రిగా పేరు, అవినీతి మచ్చలేని చరిత్ర, రాజకీయ వ్యూహాల్లో వేగం.. మొదలైనవి నితీశ్‌ను ఈ రేసులో ముందుంచుతున్నాయి. రాజకీయంగా, పరిపాలన పరంగా తనకున్న అనుభవంతో ప్రధానిగా కూడా నితీశ్ సమర్ధవంతంగా పని చేయగలరని జేడీయూ వాదిస్తోంది. అయితే, తను ప్రధాని అభ్యర్థిని కానని, బలమైన విపక్ష కూటమి కోసం ప్రయత్నిస్తున్న నాయకుడిని మాత్రమేనని నితీశ్ చెబుతున్నారు.
KCR Bihar tour | అందరూ ప్రధాని అభ్యర్థులే..
విపక్ష కూటమి ఆలోచనే ఆచరణ సాధ్యం కాదని బీజేపీ వాదిస్తోంది. విపక్షాలు చెబుతున్న బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌లో అందరూ నాయకులేనని వ్యాఖ్యానిస్తోంది. ఆ ఫ్రంట్‌లోని పార్టీల నాయకులంతా తాము మాత్రమే ప్రధాని అభ్యర్థులమని నమ్ముతుంటారని, వారు వేరొకరిని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించలేరని వాదిస్తున్నారు. బిహార్ సీఎం నితీశ్ కానీ, పశ్చిమబెంగాల్ సీఎం మమత కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ.. ఈ కోవలోకే వస్తారని చెబుతోంది. అదీకాకుండా, విపక్షాల్లోనే కొందరు కాంగ్రేసేతర విపక్ష కూటమిని కోరుకుంటోంటే, మరికొన్నిపార్టీలు కాంగ్రెస్ లేకుండా బలమైన కూటమి సాధ్యం కాదని వాదిస్తున్నారని, ఇలా ఆదిలోనే వారిమధ్య విభేధాలు ప్రారంభమయ్యాయని గుర్తు చేస్తోంది. తెలంగాణ సీఎం కూసీఆర్ కాంగ్రెస్ లేకుండానే బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణాలతో విపక్ష ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని బీజేపీ కుండబద్ధలు కొడుతోంది. అలాగే, మోదీ నాయకత్వంలో బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతోందని గుర్తు చేస్తోంది.