Menstrual Leave : పీరియడ్స్ సెలవులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. మంచి విషయమే.. కానీ..
Supreme Court On Menstrual Leave : పీరియడ్స్ సమయంలో మహిళలకు సెలవు విషయంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెలవులు ప్రభుత్వ విధానానికి సంబంధించినది అని, అందులో కోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది.
పీరియడ్స్ సమయంలో మహిళలకు సెలవులు మంజూరు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు రుతుక్రమ సెలవులు కేంద్ర ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశమని, అందులో కోర్టు జోక్యం చేసుకోదని పేర్కొంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని మహిళా విద్యార్థులకు, ఉద్యోగస్తులకు రుతుక్రమం రోజుల్లో సెలవులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి మహిళలకు రుతుక్రమ సెలవుపై నమూనా విధానాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశమని, కోర్టులు సమీక్షించాల్సిన అంశం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
'ఇలాంటి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. కానీ తప్పనిసరి చేయాలని యజమానులను బలవంతపెడితే.. అది ప్రతికూల పరిస్థితులకు దారి తీయవచ్చు. అది మేం కోరుకోవడం లేదు. మహిళలకు రక్షణ కల్పించేందుకు మనం ప్రయత్నించడం వల్ల వారిని నష్టాల్లోకి నెట్టడం మాకు ఇష్టం లేదు. ఇది నిజానికి ప్రభుత్వ విధానపరమైన అంశం. ఇది కోర్టుల సమీక్షకు సంబంధించిన అంశం కాదు.' అని కోర్టు పేర్కొంది.
ఇందులో కోర్టు జోక్యం అక్కర్లేదు. మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు అభ్యర్థన చేయవచ్చు. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను కోరుతున్నాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఎటువంటి ఆంక్షలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇదే వైఖరిని తీసుకుంది. మహిళా విద్యార్థినులు, ఉద్యోగులకు రుతుక్రమ సెలవులు కల్పించేలా అన్ని రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లో.. ఈ సమస్య విధానపరమైన అంశమని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం బీహార్, కేరళ రెండు రాష్ట్రాలు మాత్రమే రుతుక్రమ సెలవులను అందిస్తున్నాయి. బీహార్‌లో మహిళా ఉద్యోగులకు రెండు రోజులు రుతుక్రమ సెలవులు ఇస్తున్నారు. అదేవిధంగా కేరళలో మూడు రోజుల రుతుక్రమ సెలవులు విద్యార్థినులకు అందజేస్తున్నారు.