Scam alert : అమ్మాయి చెప్పింది కదా అని 'ఇన్వెస్ట్' చేస్తే.. రూ. కోటి నష్టం! వీరితో జాగ్రత్త!
Scam alert : డేటింగ్ యాప్‌లో కలిసిన ఓ అమ్మాయి చెప్పింది కదా అని క్రిప్టో యాప్‌లో ఏకంగా రూ. 1కోటి ఇన్వెస్ట్ చేశాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. చాలా రోజులు గడిచిన తర్వాత కానీ తాను మోసపోయినట్టు అతనికి అర్థం కాలేదు! ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది.
Scam alert : దేశంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ఏదో ఒక మూల, ఈ తరహా నేరాలు నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని విధాలుగా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. మోసగాళ్ల ఉచ్చులో పడి ప్రజలు భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటున్నారు. ముఖ్యంగా డేటింగ్ యాప్స్ ఇందుకు అడ్డాగా మారాయి. తాజాగా.. ఇదే విధంగా ఓ వ్యక్తి, రూ. 1కోటి నష్టపోయాడు.
ఇదీ జరిగింది..
అహ్మదాబాద్‌లో నివాసముంటున్న కుల్దీప్ అనే సాప్ట్వేర్ ఇంజినీర్.. ఇటీవలే డేటింగ్ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. మ్యాచ్‌ల కోసం వెతుకుతుండగా.. అదితి అనే మహిళతో అతనికి పరిచయం అయ్యింది. ఇద్దరు కొన్ని రోజులు మాట్లాడుకున్నారు. తాను యూకేకు ఎక్స్‌పోర్ట్స్ చేస్తానని, ఆ మహిళ, అతనికి చెప్పింది. ఆ తర్వాత.. కుల్దీప్కు 'బనోకాయిన్' అనే యాప్ గురించి చెప్పింది. ఈ క్రిప్టోకరెన్సీ యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని, వెంటనే పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించింది.
అమ్మాయి చెప్పింది కదా అని, ముందు వెనుక ఆలోచించకుండా.. రూ 1.లక్ష ఇన్వెస్ట్ చేశాడు ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్. కొన్ని రోజుల్లోనే ఆ రూ.లక్షపై సుమారు రూ. 6,500 లాభం కనిపించింది. లాభాలు చూసేసరికి.. అదితిని పూర్తిగా నమ్మేశాడు కుల్దీప్. ఇక ఆ మహిళ చెప్పడం, అతను వెంటనే ఇన్వెస్ట్ చేయడం చకచకా జరిగిపోయింది. ఇలా.. జులై 20 నుంచి ఆగస్ట్ 31 వరకు.. ఏకంగా రూ. 1.34కోట్ల వరకు యాప్‌లో డిపాజిట్ చేశాడు కుల్దీప్.
Dating app scam : సెప్టెంబర్ 3న.. యాప్ నుంచి రూ. 2.59లక్షలు విత్‌డ్రా చేద్దామని ప్రయత్నించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు షాక్ తగిలింది. అకౌంట్ ఫ్రీజ్ చేసినట్టు మెసేజ్ వచ్చింది. అకౌంట్‌ను యాక్టివేట్ చేయాలంటే.. రూ. 35లక్షలు డిపాజిట్ చేయాలని మరో మెసేజ్ వచ్చింది.
కుల్దీప్లో భయం మొదలైంది. వెంటనే అదితికి ఫోన్ చేశాడు. అటువైపు నుంచి సమాధానం లేదు. మళ్లీ మళ్లీ ట్రై చేసినా, అదితి ఫోన్ ఎత్తలేదు. ఆ తర్వాత కుల్దీప్కు అసలు విషయం అర్థమైంది. తాను భారీగా మోసపోయినట్టు గ్రహించిన అతను.. చివరికి గాంధీనగర్ పోలీసులను ఆశ్రయించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కానీ ఇలాంటి కేసుల్లో మోసపోయిన డబ్బు తిరిగి వస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమే!
తస్మాత్ జాగ్రత్త..
Cyber crime news : ఈ తరహా స్కామ్స్ రోజు జరుగుతూనే ఉంటున్నాయి. మన కష్టంతో సంపాదించిన డబ్బును.. ఎవరో చెప్పారని, ముందు వెనుక ఆలోచించకుండా.. ఎక్కడపడితే అక్కడ డిపాజిట్ చేయడం ఎంత వరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి.. ఇలాంటి స్కామ్స్‌కు దూరంగా ఉండండి.
సంబంధిత కథనం