Vegetables price: ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి, బంగాళదుంప, టమోటా ధరలు
కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నవి. సగటున ప్రతీ ఇంట రెగ్యులర్ గా వాడే ఉల్లిగడ్డ, టమాట, బంగాళాదుంపల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తగ్గిన దిగుబడులతో డిమాండ్ పెరిగి, ధరలు పెరుగుతున్నాయి. ఇవే కాకుండా, ఇతర నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు కూడా పెరిగాయి.
దిగుబడి తగ్గడంతో రెండు నిత్యావసర వస్తువులైన ఉల్లి గడ్డ, బంగాళదుంపల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏడాది క్రితంతో పోలిస్తే జూన్ నెలలో టమోటా రేట్లు కొంత తగ్గుముఖం పట్టాయని, అయితే గత నెలతో పోలిస్తే టమోటా ధర చాలా పెరిగిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
త్వరలో తగ్గుతాయి..
ఖరీఫ్ దిగుబడులు మార్కెట్లోకి వచ్చేవరకు ధరలు ఇదే స్థాయిలో ఉంటాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మరో రెండు వారాల్లో టమోటా, బంగాళాదుంప, ఉల్లి ధరలు కొంత తగ్గవచ్చని వివరిస్తున్నారు. ఏప్రిల్ నుండి పొడి వేసవి సాధారణంగా వినియోగించే అనేక కూరగాయల సరఫరాను దెబ్బతీసింది. దాంతో, బంగాళాదుంప, ఉల్లి, టమోటాలకు డిమాండ్ పెరగిందని అధికారులు వివరిస్తున్నారు.
ఏడాది క్రితం ధరలు..
ఏడాది క్రితంతో పోలిస్తే, జూన్ 30 నాటికి, సగటు హోల్సేల్ ఉల్లి రేట్లు 106% పెరిగింది. క్వింటాలు ఉల్లి ధర (100 కిలోలు) గత జూన్ లో రూ. 1260.66 ఉండగా, ఇప్పుడు రూ .2603.55 కు చేరుకుంది. హోల్ సేల్ బంగాళాదుంప ధర గత జూన్ లో క్వింటాలుకు రూ. 1076.14. ఉండగా, ఇప్పుడు 96 శాతం పెరిగి రూ. 2116 కు చేరింది. అలాగే, గత ఏడాది జూన్ లో హోల్ సేల్ టమోటా ధర క్వింటాలుకు రూ.5680.75 ఉండగా, ఇప్పుడు 40% తగ్గి, రూ. 3368.28కి చేరుకుంది. కానీ, గత నెలతో పోలిస్తే టమోటా హోల్ సేల్ రేట్ 112.39 శాతం పెరిగింది. గత నెలలో క్వింటాల్ టమోటా రూ.1585.84 ఉండగా, ఇప్పుడు అది రూ. 3368.28కి చేరుకుంది.
ఈ మూడే ముఖ్యం
వినియోగదారుల నెలసరి ఖర్చులో కూరగాయల వాటా 6 శాతం ఉంటుంది. కూరగాయల కోసం ఒక కుటుంబం నెలవారీ ఖర్చులో ఈ మూడు వస్తువులు 44% ఉన్నాయి.హోల్ సేల్ ధరలతో పాటు రిటైల్ ధరలు కూడా పెరిగాయి. జూలై 2 న దేశవ్యాప్తంగా ఉల్లి ధర సగటున కిలోకు రూ .42.21 గా ఉంది. ఇది ఏడాది క్రితం కిలో రూ .23.29 గా ఉన్న ధరతో పోలిస్తే 81% పెరిగింది. ఏడాది క్రితంతో పోలిస్తే బంగాళదుంప రిటైల్ రేటు 57 శాతం పెరిగి కిలో రూ.21.91 నుంచి రూ.34.4కు చేరింది. జూన్ 2న టమాటా ధరలు కిలో రూ.64.5 నుంచి రూ.54.42కు 15 శాతం తగ్గాయి. అయితే నెల రోజుల క్రితంతో పోలిస్తే కిలో రూ.31.74 నుంచి రూ.54.42కు 71 శాతం పెరిగింది.
సబ్సీడీ రేట్లకు అమ్మిన ప్రభుత్వం
గత ఏడాది ఆగస్టులో రిటైల్ ఉల్లి ధరలు నాలుగు రెట్లు పెరగడంతో ప్రభుత్వం సబ్సిడీ ఉల్లిని ప్రజలకు విక్రయించడం ప్రారంభించింది. సక్రమంగా వర్షాలు కురవకపోవడంతో 2023లో ఉల్లి ఉత్పత్తి 20 శాతం పడిపోయింది. గత ఏడాది రుతుపవనాలు సరిగా లేకపోవడంతో 2024లో రబీ లేదా శీతాకాలం నాటిన ఉల్లి ఉత్పత్తి 20 శాతం తగ్గి 19 మిలియన్ టన్నులకు పడిపోయింది. రబీ ఉల్లి కీలకమైనది ఎందుకంటే ఇది దేశం యొక్క వార్షిక అవసరాల్లో 75% వరకు సరఫరా చేస్తుంది.