Recap 2023 India politics : కొనసాగిన ‘మోదీ’ మేనియా- విపక్ష కూటమి పరిస్థితేంటి?
Recap 2023 India politics : 2023 ముగింపు నేపథ్యంలో.. ఈ ఏడాది జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వాటి ఫలితాలను ఓసారి విశ్లేషిద్దాము. 2024 లోక్‌సభ ఎన్నికల సమరంపై వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాము..
Recap 2023 India politics : 2023 ముగింపు దశకు చేరుకుంది. ఎప్పటిలాగే.. ఈ ఏడాది కూడా భారత రాజకీయాలు వాడీవేడీగా సాగాయి. మరీ ముఖ్యంగా.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు.. 2024 సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్‌గా నిలిచాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు వాటి ఫలితాలు.. సార్వత్రిక సమరంపై ఏ విధంగా ఉంటాయో ఇక్కడ చూద్దాము..
2023 అసెంబ్లీ ఎన్నికలు..
2023లో మొదట త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 60 సీట్లకు ఫిబ్రవరి 16న పోలింగ్ జరగ్గా.. మెజారిటీ ఫిగర్ 31. త్రిపురలో అధికార బీజేపీ- ఐపీఎఫ్ కూటమి మరోమారు అధికారాన్ని నిలబెట్టుకుంది. మానిక్ సాహా సీఎంగా ప్రమాణం చేశారు.
ఇక 2023 ఫిబ్రవరి 27న మేఘాలయ, నాగాలాండ్‌కు ఎన్నికలు జరిగాయి. 60 సీట్ల మేఘాలయ అసెంబ్లీకి మెజారిటీ ఫిగర్ 31గా ఉంది. మేఘాలయ డెమొక్రటిక్ ఎలయెన్స్ ఇక్కడ తిరిగి అధికారాన్ని సంపాదించుకోగలిగింది. కాన్రాడ్ సాంగ్మ కూడా మళ్లీ సీఎం అయ్యారు. ఇక నాగాలాండ్‌లో 60 సీట్లు ఉండగా.. మెజారిటీ మార్క్ 31. ఇక్కడ ఎన్‌డీపీఏ- బీజేపీ కూటమి విజయం సాధించింది.
India politics 2023 recap : 2023 మే 10న కర్ణాటకలో హైఓల్టేజ్ ఎన్నికలు జరిగాయి. 224 సీట్లకు మెజారిటీ మార్క్ 113గా ఉంది. ఈ ఏడాది మొత్తంలో బీజేపీకి షాక్ తగిలిన ఎన్నిక ఇదొక్కటే అని చెప్పుకోవాలి! అధికార బీజేపీని పక్కా వ్యూహం, ఐకమత్యంతో ఓడించింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఫలితాలు.. కాంగ్రెస్‌కు నూతన ఉత్తేజాన్ని ఇచ్చాయి.
ఇక 2023 నవంబర్- డిసెంబర్ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు యావత్ దేశాన్ని ఆకర్షించాయి. మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ మూడు చోట్ల విజయం సాధించింది. అవి.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. వాస్తవానికి మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కమలదళం.. ఈసారి ఓడిపోతుందని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ రెట్టింపు వేగంతో కమలదళం ఇక్కడ కాంగ్రెస్‌ని మరోమారు ఓడించింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో గెలుపు తమదే అని భావించిన కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఎదురైంది. ఊహించని విధంగా.. ఇక్కడ కాషాయ జెండా రెపరెపలాడింది. రాజస్థాన్‌లో అసలు పోరాటమే లేకుండా చేతులెత్తేసింది కాంగ్రెస్. అన్ని ఓడిపోయినా.. తెలంగాణలో గెలుపు మాత్రం ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చింది. ఇక చివరిగా.. మిజోరం ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అనూహ్య రీతిలో విజయం సాధించి అధికార మిజో నేషనల్ పార్టీకి షాక్ ఇచ్చింది.
2024 లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం ఎంత..?
2024 Lok Sabha elections : 2023 అసెంబ్లీ ఎన్నికలు.. 2024 లోక్‌సభ ఎన్నికలకు అత్యంత కీలకంగా మారాయి. మరీ ముఖ్యంగా చివరి ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. 2024 సార్వత్రిక పరీక్షకు సెమీ ఫైనల్‌గా భావించాయి అన్ని రాజకీయ పార్టీలు. మరింత పట్టుసాధించాలని బీజేపీ కృషిచేయగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు విపక్ష ఇండియా బృందం తీవ్రంగా శ్రమించింది.
కానీ.. 2023లో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే.. ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ మేనియా' దేశంలో ఇంకా తగ్గలేదని స్పష్టమవుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో బీజేపీ మరింత పటిష్ఠంగా తయారైందని అంటున్నారు.
2024 Lok Sabha elections BJP : లోక్‌సభలో మొత్తం 543 సీట్లు ఉంటాయి. ఇక 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల వివరాలను ఓసారి చూద్దాము..
ఛత్తీస్‌గఢ్- 11 సీట్లు
కర్ణాటక- 28 సీట్లు
మధ్యప్రదేశ్- 29 సీట్లు
మేఘాలయ- 2 సీట్లు
మిజోరం- 1 సీటు
నాగాలాండ్- 1 సీటు
రాజస్థాన్- 25 సీట్లు
తెలంగాణ- 17 సీట్లు
త్రిపుర- 1 సీటు.
అంటే.. ఈ 9 రాష్ట్రాల్లోనే.. 115 సీట్లు ఉన్నట్టు!
పైగా.. లోక్‌సభలో అతిపెద్ద సీట్లు ఉన్న రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ (80) ఇప్పటికే బీజేపీ ఖాతాలో ఉందన్న విషయం మర్చిపోకూడదు. ఒక్కోసారి అటు, ఇటు అవ్వొచ్చు కానీ.. సాధారణంగా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలే.. లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు విజయం సాధిస్తాయి.
2024 Lok Sabha elections INDIA : ఈ నేపథ్యంలో బీజేపీని ఓడించాలంటే.. విపక్ష ఇండియా శక్తికి మంచిన కృషి చేయాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ అన్ని పార్టీలు కలిస్తే.. నేతల మధ్య ఏకాభిప్రాయాలు, ఐకమత్యం ఉంటాయా? అన్నది ముఖ్యమైన ప్రశ్న అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకొందరు విశ్లేషకులైతే.. 2024లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేస్తుందని ఇప్పుడే చెప్పేస్తున్నారు.
మరి విశ్లేషకుల మాట నిజమవుతుందా? ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ.. హ్యాట్రిక్ కొడుతుందా? లేక విపక్ష ఇండియా కూటమి అద్భుత పోరాటంతో బీజేపీకి షాక్ ఇస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే.. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల వరకు ఎదురుచూడాల్సిందే!
సంబంధిత కథనం