Madhya Pradesh CM announcement live : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కనుంది? అన్న ఉత్కంఠకు తెరపడింది. ఉజ్జెయిన్ ఎమ్మెల్యే మోహన్ సింగ్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది బీజేపీ. ఇంతకాలం సీఎంగా ఉండి, పార్టీని ముందుండి నడిపించిన శివరాజ్ సింగ్ చౌహాన్‌కు షాక్ తగిలినట్టైంది. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలను బీజేపీ ప్రకటించగా.. వాటిల్లోనూ శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు లేకపోవడం గమనార్హం.
58ఏళ్ల మోహన్ యాదవ్.. ఉజ్జెయిన్ దక్షిణ్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.
తనను సీఎంగా ఎంపిక చేయడంపై మోహన్ యాదవ్ స్పందించారు.
Mohan Yadav Madhya Pradesh CM : "నేను ఒక సాధారణ పార్టీ కార్యకర్తను. నన్ను సీఎంగా చేసిన రాష్ట్ర నాయకత్వానికి, బీజేపీ జాతీయ నాయకత్వానికి నా కృతజ్ఞతలు. నా బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడానికి కృషిచేస్తాను," అని మోహన్ యాదవ్ అన్నారు.
మరోవైపు.. జగదీశ్ దియోరా, రాజేశ్ శుక్లాలను డిప్యూటీ సీఎంలుగా ప్రకటించింది బీజేపీ.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముఖచిత్రంగా ఇంతకాలం ఉన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. పార్టీని ఎన్నో ఏళ్లుగా ముందుండి నడిపించారు. అయితే.. ఆయనపై గత కొంతకాలంగా పార్టీ అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
Shivraj Singh Chouhan latest news : కాగా.. ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో.. బీజేపీ రెట్టింపు బలంతో దూసుకెళ్లింది. 230 సీట్లున్న అసెంబ్లీలో 150కిపైగా స్థానాల్లో గెలుపొందింది. ఇందులో శివరాజ్ సింగ్ చౌహాన్ పాత్ర కూడా ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆయన అమలు చేసిన పలు పథకాలు చూసే.. రాష్ట్రంలోని మహిళా ఓటర్లను బీజేపీకి ఓట్లు వేశారని చెబుతున్నారు.
వీటి మధ్య.. అసలు శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పక్కన పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఆయనకు రాష్ట్రంలో మార్గాలన్నీ మూసుకుపోయాయని, రాజకీయ జీవితం ముగింపు దశకు చేరుకుంటోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
2005 నవంబర్‌లో తొలిసారిగా బీజేపీ సీఎం పదవిని చేపట్టారు శివరాజ్ సింగ్ చౌహాన్. అప్పటి నుంచి ఎప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చినా.. ఆయనే సీఎంగా పనిచేశారు. మరి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పుడేం చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది.
సంబంధిత కథనం