NDA vs 'INDIA': ‘ఇండియా’ను మోదీ ఎదుర్కోగలరా ?
NDA vs 'INDIA': ‘ఇండియా’ను మోదీ ఎదుర్కోగలరా ? పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ జి.మురళీకృష్ణ రాజకీయ విశ్లేషణ.
అదానీ వ్యవహారంపై కొద్దికాలం క్రితం రాజ్యసభలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ‘‘మీ అందరినీ ఎదుర్కోవడానికి నేనొక్కడినే చాలు.. నాకు మరొక్కరు అవసరం లేదు’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గంభీరంగా చెప్పారు. బెంగుళూరులో ప్రతిపక్షాలు రెండోసారి సమావేశం అవుతుండగా సోమవారం ఉదయం కూడా ‘‘కేవలం మోదీకి వ్యతిరేకంగా దేశంలో ప్రతిపక్షాలు అన్ని ఒక్కటవుతున్నాయి’’ అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు.
ప్రజాదరణతో గానీ, విశేషమైన వనరులను మోహరించడంలో గానీ, వ్యవస్థలను తలవంచేలా చేసుకోవడమో గాని దేశంలో మోదీకి తిరుగే లేదని, సమీప భవిష్యత్తులో ఆయనను ఎదిరించడం ఎవ్వరికీ సాధ్యం కాదనే అభిప్రాయం చాలా రాజకీయ పక్షాలలో కూడా ఉంటూ వచ్చింది. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఆ అభిప్రాయం తునాతునకలైంది. వెంటనే జూన్ 23న పాట్నాలో 15 ప్రతిపక్షాలు కలిసి బీజేపీని ఓడించడం కోసం ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించడంతో కొండంత ధైర్యం కూడదీసుకోవడం ప్రారంభమైంది.
ఈ పరిణామాలు సహజంగానే తనకు తిరుగే లేదనుకున్న ప్రధాని మోదీలో ఓ విధమైన బెదురుకు కారణమయ్యాయి. ఏనాడూ లేని విధంగా పార్టీ సహచరులతో గంటల తరబడి సమాలోచనలు ప్రారంభించారు. పార్టీలో, మంత్రివర్గంలో చెప్పుకోదగిన మార్పులకు సిద్ధమయ్యారు. జులై 18న ఒకే రోజున జరిగిన రెండు కూటముల సమావేశాలు ఈ విషయంలో మరింత స్పష్టమైన నిదర్శనంగా మారాయి. 2019 ఎన్నికల తర్వాత ఒక్కసారి కూడా కలవని ఎన్డీయే భేటీని ఇప్పుడు అర్ధాంతరంగా ఏర్పాటు చేశారు.
పాట్నా భేటీకి కొనసాగింపుగా బెంగుళూరులో 26 పార్టీల నేతలు సమావేశమై తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టి 2024 ఎన్నికలు బీజేపీ ప్రచారం చేస్తున్నట్లుగా ‘‘మోదీకి - ఇతర పార్టీలకు’’ మధ్య కాకుండా ‘‘ఇండియాకు- ఎన్డీయేకు’’ మధ్య అని ప్రకటించారు. 1971లో నాలుగు ప్రతిపక్షాలు కలిసి ‘‘ఇందిరా హటావో’’ అనే నినాదం ఇస్తే ఇందిరాగాంధీ ‘‘గరీబీ హటావో’’ అంటూ వారిని చిత్తు చేసింది.
ప్రధాని మోదీ సహితం ప్రతి సభలో కూడా తాను పేదలకు మేలు చేద్దాం అనుకుంటుంటే ప్రతిపక్షాలు తనను లక్ష్యంగా చేసుకొంటున్నాయని అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈ ఎన్నికలు బీజేపీ కోరుకుంటున్నట్లు ‘‘మోదీ - ఇతరులు’’ మధ్య అని కాకుండా, ‘‘ఇండియా- ఎన్డీయే’’ మధ్య అనే నినాదం బెంగుళూరు వేదికగా ఇవ్వడం ప్రాధాన్యత సంతరింపజేసుకుంది.
38 పార్టీలతో సమావేశం
బెంగుళూరు భేటీకి 26 పార్టీలు హాజరవుతున్నట్లు తెలియగానే బీజేపీ ఒకింత అసహనానికి లోనట్లయ్యింది. హడావుడిగా చిన్నా, చితక పార్టీలను కూడదీసుకొని 38 పార్టీలతో సమావేశమవుతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
ఈ రెండు కూటముల భేటీలను పరిశీలిస్తే మొదటి భేటీ రాజకీయ ఉద్దండులతో జరిగిన్నట్లు స్పష్టం అవుతుంది. దేశంలో గుర్తింపు పొందిన నేతలు, ఎవరికి వారుగా సొంత బలం, విధానాలు ఉన్న పార్టీలు ఉమ్మడి లక్ష్యంతో కలిసి వచ్చాయి. ఆ వేదికపై ‘మేము కలిసి ఐక్యంగా ఉంటాం’ అనే నినాదంతో పాటు నాయకుల అందరి ఫొటోలకు సమ ప్రాధాన్యత ఇచ్చారు.
కానీ ఈ భేటీ ముగిసిన కొద్ది గంటలకే ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భేటీలో ప్రధాని మోదీ ఫొటో మాత్రమే చాల పెద్దగా కనిపించింది. ఆయన రాగానే వివిధ పార్టీల నేతలు ఎదురేగి మరీ స్వాగతం పలికారు. ‘‘పేరుకే ఎన్‌డిఎ భేటీ. ఆద్యంతం మోదీ భజనే. మోదీకి గజమాల. ఆయనను సత్కరించడంలోనే నేతలు తలమునకలవ్వడం. ఆయన ఒక్కడే నాయకుడు. అక్కడ ఎన్‌డిఎ కన్వీనర్ ఎవరో ఎవరికీ తెలియదు. అందరూ గ్రూప్ ఫొటో దిగారు’’ అంటూ ఓ నేత వ్యాఖ్యానించారు.
‘ఇండియా’ భేటీ మొదట్లోనే కాంగ్రెస్ ప్రధాన మంత్రి పదవి కోసం ఈ హడావిడి చేయడం లేదని, సమయం వచ్చిన్నప్పుడు ఆ విషయం చర్చించుకుందామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే స్పష్టం చేశారు.
దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే తమ భేటీ లక్ష్యమని తేల్చి చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఇక్కడున్న పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయని అంగీకరిస్తూ, అవి సైద్ధాంతిక విభేదాలు కావని వివరణ ఇచ్చారు.
అంటే, ఈ పార్టీల నేతలు తమ బలం, బలహీనతల పట్ల స్పష్టమైన అవగాహనతో కలిసి ముందుకు వెళుతున్నారు. చివరలో మీడియా సమావేశంలో కాంగ్రెస్‌తో సరిపడని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే వంటి వారిని ముందుంచడం ద్వారా ‘అందరం ఒక జట్టు’ అనే సంకేతం ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు.
కానీ ఎన్డీయే భేటీలో దృశ్యం అందుకు భిన్నంగా ఉంది. పేరుకు 38 పార్టీలు వచ్చినా వాటిల్లో 25 పార్టీలకు ఒక ఎంపీ కూడా లేరు. 9 పార్టీలకు ఒక్కొక్క ఎంపీ మాత్రమే ఉన్నారు. ఎంపీలు ఉన్న నాలుగు పార్టీలలో శివసేన, ఎన్సీపీలు బీజేపీ సృష్టించిన చీలికల కారణంగా ఏర్పడినవే. వారంతా ఏదో ఉత్సవానికి అతిథులుగా వచ్చినట్లుంది గానీ ఉమ్మడిగా చర్చించిన దాఖలాలు లేవు.
అయితే, ప్రధాని మోదీ స్వరంలో మార్పు గమనిస్తే కేవలం తన బొమ్మతో వచ్చే ఎన్నికల్లో మరోసారి మెజారిటీ తెచ్చుకోవడం కుదరదని ఆందోళన ఏర్పడినట్లు వెల్లడి అవుతుంది. మొన్నటి వరకు ‘‘నా ప్రభుత్వం’’ అంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ‘‘ఎన్డీయే ప్రభుత్వం’’ అంటున్నారు. ‘‘నన్ను ఒక్కడిని ఓడించేందుకు ఒక్కటవుతున్నాయి’’ అంటూ వస్తున్న ఆయన ‘‘జేపీ నడ్డా నాయకత్వంలో..’’ అంటూ మాట్లాడుతున్నారు.
ఎన్డీయే కూటమిలో చిన్నా, పెద్ద పార్టీలంటూ తేడా లేదని ప్రధాని చెప్పారు. అయితే అక్కడ అంతా ఆయనను పొగడ్తలతో నింపే ప్రయత్నమే చేశారు. కానీ కూటమికి సంబంధించిన అంశాల గురించి గానీ, దేశంలోని పరిస్థితుల గురించి గానీ గంభీరమైన చర్చ జరిగిన దాఖలాలు లేవు.
అందుకు భిన్నంగా బెంగుళూరులో పలు పార్టీల నాయకులు ఒక విధంగా ‘సమాన హోదా’లో పాల్గొన్నారు. భవిష్యత్ వ్యూహాల గురించి లోతుగా సమాలోచనలు జరిపారు. తమ అహంకారాలను, ఆధిపత్య ధోరణులను పక్కన పెట్టి సర్దుబాటు ధోరణులు ప్రదర్శించారు. ఉమ్మడిగా బీజేపీని ఎదుర్కొనేందుకు స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశారు.
ఎన్డీయే భేటీ విందు సమావేశంగా జరిగింది. మరోసారి మోదీకి గల ప్రజాదరణను ఆసరాగా చేసుకొని తాము కూడా ఒకటో, రెండో ఎంపీ సీట్లు గెలవచ్చనే ఆశ అక్కడ పాల్గొన్న అత్యధిక పార్టీలలో నెలకొంది. అవసరమైతే అందుకు అవసరమైన వనరులు బీజేపీ సమకూరుస్తుందనే భరోసా కూడా ఏర్పడినట్లున్నది.
మరోవంక, బెంగుళూరు భేటీ నిర్దిష్టమైన కార్యాచరణ వైపుగా సాగిన్నట్లు కనిపిస్తున్నది. 11 మందితో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ముంబైలో జరిగే వచ్చే సమావేశంలో కమిటీని ఏర్పాటు చేయవచ్చు. అదే విధంగా వివాదాస్పదమైన ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలపై ఇప్పుడు చర్చించకుండా వాయిదా వేశారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చూసుకుందాం అంటూ ఖర్గే చెప్పారు.
కీలక రాజకీయ శక్తులు ఏకమై
ఉమ్మడిగా అంగీకరించే ఎన్నికల సంస్కరణలు, రాష్ట్రాల అధికారాలపై కొత్త, నిధుల పంపిణీలో వివక్ష వంటి అంశాలపై రాబోయే రోజుల్లో ఉమ్మడిగా పోరాటాలు జరిపేందుకు కూడా సమాయత్తం అవుతున్నారు. రాజకీయంగా విశేష అనుభవం గల శరద్ పవర్, సోనియా గాంధీ, ఖర్గే వంటి నాయకులు ఉండడంతో కొందరు ఆవేశంగా, అసందర్భంగా మాట్లాడినా అందరిని సామరస్యపూర్వకంగా కలిపి ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ ఎన్డీయేలో అటువంటి నేత ఎవ్వరు లేరు. అంతా మోదీ కనుసన్నలలో మెలగాల్సి వస్తుంది. బెంగుళూరులో భేటీకి ముందు భోజనం సమయంలో మమతా, వామపక్ష నేతలతో సోనియా స్వయంగా మాట్లాడి వారి మధ్య అపోహలను దూరం చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ వారధిగా వ్యవహరించారు.
కీలకమైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కీలకమైన రాజకీయ శక్తులు బెంగూళూరు భేటీలో పాల్గొన్నాయి. ఎన్డీయే భేటీలో బీజేపీ మినహాయిస్తే మిగిలిన వారంతా రెండు, మూడు లోక్‌సభ సీట్లకు పరిమితమయ్యే వారే. ఎన్డీయే పరిధి విస్తరిస్తున్నా ప్రాథమికంగా బీజేపీ కేంద్రీకృతంగా మాత్రమే మనుగడ సాగిస్తుంది.
అయితే, చిన్న చిన్న పార్టీలను చేర్చుకోవడం ద్వారా తమకు పలు విభిన్న కులాలు, ప్రాంతాల మద్దతు ఉందని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు ఆధారపడిన హిందుత్వ నినాదంను వెనుకకు నెట్టుతారా? చూడాల్సి ఉంది. కర్ణాటకలో ఎదురు దెబ్బ తగలడంతో ఈ విషయంలో బీజేపీ జాగురతతో వ్యవహరించాల్సి వస్తోంది.
కర్ణాటకలో ప్రధాని మోదీ ‘‘భోలో జై హనుమాన్’’ అంటూ, హిందువులు అందరినీ సామూహిక హనుమాన్ చాలీసా ప్రవచనాలను చేయమని పిలుపు ఇవ్వడంతో బీజేపీకి అదనంగా హిందూ ఓట్లు రాకపోయినా, ముస్లింల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. 1989 తర్వాత మొదటిసారిగా గంపగుత్తగా కాంగ్రెస్‌కు ముస్లింల ఓట్లు వచ్చాయి. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుందేమో అని బీజేపీ ఆందోళన చెందుతోంది.
ఈ విషయంలో చివరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహితం ఆందోళన చెందుతున్నారు. అందుకనే తనను ప్రతిపక్ష భేటీకి ఎందుకు ఆహ్వానించడం లేదని అంటూ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా ‘అంటరానితనం’ పాటించడం తగదని హితవు చెబుతున్నారు. 2024 ఫలితాలు ఏవిధంగా ఉన్నా బుధవారం జరిగిన రెండు భేటీలు ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు.
- జి.మురళికృష్ణ,
రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ,
Email: peoplespulse.hyd@gmail.com
(Disclaimer: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం లేదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి మాత్రమే. హెచ్‌టీ తెలుగుకు సంబంధం లేదు).