Telangana Assembly Sessions : కేవలం 6 గ్యారెంటీలే కాదు.. మీరిచ్చిన 412 హామీలను కూడా అమలు చేయాలి - బీజేపీ ఎమ్మెల్యేలు
Telangana Assembly Session 2023 Updates: శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. గవర్నర్ ప్రసంగంపై సభలో చర్చ జరిగింది. బీజేపీ తరపున మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కోరారు.
Telangana Assembly Session 2023 Updates: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం గవర్నర్ ప్రసంగం చేయగా.. శనివారం సభ ప్రారంభం కాగానే చర్చ మొదలైంది. తొలుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడగా… బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ప్రసంగించారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక బీజేపీ పార్టీ తరపున నుంచి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రసంగించారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేవలం ఆరు గ్యారెంటీల గురించి మాత్రమే మాట్లాడటం సరికాదన్నారు మహేశ్వర్ రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 412 హామీల గురించి మాట్లాడాలని సూచించారు. గవర్నర్ ప్రసంగంలో కేవలం సోనియాగాంధీ పేరును మాత్రమే ప్రస్తావించారని.. కానీ కీలకంగా వ్యవహరించిన సుష్మారాజ్ పేరును ప్రస్తావించకపోవటం బాధాకరమన్నారు.
ప్రజాదర్భార్ ను ప్రతిరోజు నిర్వహిస్తామని చెప్పి… ఇప్పుడేమో రెండు రోజులు మాత్రమే అనటం ఏ మాత్రం సరికాదన్నారు. రైతుబంధు నిధులు గురించి క్లారిటీ లేదని.. స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీ కూడా బోటాబోటీగానే ఉందని.. మేజిక్ ఫిగర్ కంటే నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంపై కూడా స్పష్టతనివ్వాలని కోరారు. కేవలం బీజేపీ మీదపైకి నెట్టి తప్పించుకోవాలని చూడటం శోచనీయమన్నారు. కేసీఆర్ సర్కార్ మాదిరిగానే నిరుద్యోగ భృతి అంశాన్ని విస్మరించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. కీలకమైన ఈ అంశాన్ని కూడా గవర్నర్ ప్రసంగంలో లేదని గుర్తు చేశారు. దీనిపై ప్రకటన చేయాలన్నారు.
డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ ప్రకటన చేస్తామని చెప్పారు. కానీ చెప్పిన సమయం దాటిపోయిందని ఇంకా రుణమాఫీపై ప్రకటన రాలేదన్నారు. ఈ విషయంలో బీజేపీ గట్టిగా పోరాడుతుందన్నారు. ప్రజల పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా.. పని చేయాలని, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని భావిస్తున్నట్లు మహేశ్వర్ రెడ్డి చెప్పారు.
సంబంధిత కథనం