Ratan Tata : 11 వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రం.. నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం
Ratan Tata : రతన్ టాటా 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణంతో దేశం మెుత్తం బాధలో మునిగింది. రత్నంలాంటి వ్యక్తి రతన్ టాటా అంటూ జనాలు గుర్తుచేసుకుంటున్నారు. అయితే ఓ వజ్రాల వ్యాపారి రతన్ టాటాకు వినూత్నంగా నివాళులర్పించారు.
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఈ లోకాన్ని వీడిచి వెళ్లారు. ఆయనకు దేశం మెుత్తం బాధతో వీడ్కోలు చెప్పింది. ఆయన తన పనితనంతో లెక్కలేనన్ని మందిని ప్రభావితం చేశారు. ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ప్రజలు ఇప్పటికీ వివిధ రకాలుగా నివాళులు అర్పిస్తున్నారంటే ఈ విషయం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల సూరత్‌కు చెందిన ఓ నగల వ్యాపారి సుమారు 11 వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రపటాన్ని తయారు చేసి నివాళులర్పించారు.
సూరత్‌కు చెందిన ఓ నగల వ్యాపారి రూపొందించిన ఈ చిత్రంలో 11 వేల వజ్రాలను నింపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్ట్ కూడా చాలా వేగంగా వైరల్ అయింది. ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఇన్ స్టంట్ బాలీవుడ్ షేర్ చేసిన ఈ అద్భుతమైన మాస్టర్ పీస్ వీడియోను ఇప్పటివరకు ఐదున్నర లక్షల మందికి పైగా లైక్ చేశారు.
ఈ పోస్టుపై స్పందించిన చాలామంది రతన్ టాటాను హృదయపూర్వకంగా స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు. రతన్ టాటా సార్ కంటే ఈ వజ్రాలు విలువైనవి కావని తాను భావిస్తున్నానని ఓ యూజర్ కామెంట్ చేశాడు. 'మనం ఒక విలువైన రత్నాన్ని కోల్పోయాం, ఈ వజ్రాలన్నీ కలిసినా ఆయన కంటే ఎక్కువ ప్రకాశించలేవు.' అని రాశారు. ఈ వజ్రం ముందు అన్ని వజ్రాలు పాలిపోయాయని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన విపుల్‌భాయ్ అనే వ్యాపారి రతన్ టాటాకు ఈ విధంగా నివాళులర్పించారు. సుమారు 11 వేల వజ్రాలతో రతన్ టాట చిత్రాన్ని రూపొందించారు. స్వతహాగా కళాకారుడైన విపుల్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్ డైమండ్స్ ఉపయోగించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.