Sela tunnel: చైనా బార్డర్ లో వ్యూహాత్మకంగా కీలకమైన ‘సెలా టన్నెల్’ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
PM inaugurates Sela tunnel: చైనా సరిహద్దుల్లో భారత్ కు రక్షణ పరంగా అత్యంత వ్యూహాత్మకమైన సెలా సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సెలా టన్నెల్ ను అరుణాచల్ ప్రదేశ్ లో రూ.825 కోట్ల వ్యయంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది.
Sela tunnel: అరుణాచల్ ప్రదేశ్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆరు ఈశాన్య రాష్ట్రాలకు దాదాపు రూ.55,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండ్, గవర్నర్ కేటీ పర్నాయక్, లోక్ సభలో పశ్చిమ అరుణాచల్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సెలా టన్నెల్
అరుణాచల్ ప్రదేశ్ లో రూ.825 కోట్ల వ్యయంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సెలా టన్నెల్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 13,000 అడుగుల ఎత్తులో నిర్మించిన, ప్రపంచంలోనే అతి పొడవైన ట్విన్ లేన్ సొరంగం ఇది. సెలా టన్నెల్ గుండా వెళ్తున్న అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సును జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు.
ఇతర ప్రాజెక్టులు
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ల్లో ప్రధాని మోదీ పాల్గొన్న ఇతర కార్యక్రమాలలో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ఆనకట్ట నిర్మాణమైన 2880 మెగావాట్ల దిబాంగ్ బహుళార్థసాధక జలవిద్యుత్ ప్రాజెక్టుకు భూమిపూజ కూడా ఉంది. ఈశాన్య రాష్ట్రాల కోసం కొత్త పారిశ్రామిక అభివృద్ధి పథకం, ఉన్నతి (Uttar Poorva Transformative Industrialization Scheme)ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. రూ.10,000 కోట్ల విలువైన ఈ పథకం కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త తయారీ, సేవల యూనిట్ల స్థాపనకు తోడ్పడుతుందని, ఉపాధికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.
ఇతర ఈశాన్య రాష్ట్రాలకు..
ఈ కార్యక్రమంలో మణిపూర్ లో రూ.3,400 కోట్లు, నాగాలాండ్ లో రూ.1,700 కోట్లు, మేఘాలయలో రూ.290 కోట్లు, సిక్కింలో రూ.450 కోట్లు, త్రిపురలో రూ.8,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించి, శంకుస్థాపన చేశారు.
Sela tunnel details: సెలా టన్నెల్ విశేషాలు..
- చైనా సరిహద్దులోని తవాంగ్ సెక్టార్ లో వాస్తవాధీన రేఖ (LAC) సమీపంలోని ఫార్వర్డ్ ప్రాంతాలకు అన్ని వాతావరణ పరిస్థితుల్లో సైనికులు, పరికరాలు, భారీ వాహనాల రాకపోకలకు ఈ సొరంగం సహాయపడుతుంది.
- సెలా టన్నెల్ ప్రాజెక్టులో 1.003 కిలో మీటర్ల పొడవైన టన్నెల్ 1 తో పాటు 1,595 మీటర్ల ట్విన్ ట్యూబ్ టన్నెల్ అయిన టన్నెల్ 2 ఉన్నాయి.
- 13,000 అడుగుల ఎత్తులో ఉన్న సెలా టన్నెల్ ను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) రూ.825 కోట్ల వ్యయంతో నిర్మించింది.
- ఈ ప్రాజెక్టులో 8.6 కిలోమీటర్ల మేర రెండు రోడ్లు కూడా ఉన్నాయి. ఈ మార్గంలో రోజుకు 3,000 కార్లు, 2,000 ట్రక్కులు ప్రయాణిస్తాయని అంచనా.
- ఈ సొరంగ మార్గంలో గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు.
- ఈ సొరంగం చైనా సరిహద్దులో ఉన్న తవాంగ్ కు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కనెక్టివిటీని అందిస్తుంది. ఇది తవాంగ్కు ప్రయాణ సమయాన్ని కనీసం ఒక గంట తగ్గిస్తుంది.
- వాస్తవాధీన రేఖ (LAC) సమీపంలోని ఫార్వర్డ్ ప్రాంతాలకు ఆయుధాలు, సైనికులు, ఇతర యంత్ర సామగ్రిని వేగంగా మోహరించడానికి అనుమతిస్తుంది.
- భారీ వర్షాలు, హిమపాతం, కొండచరియలు విరిగిపడటం వంటి సమస్యల కారణంగా బలిపారా-చరిద్వార్-తవాంగ్ రహదారి ఏడాదిలో ఎక్కువ కాలం మూసివేసి ఉంటుంది. అందువల్ల సెలా పాస్ సమీపంలో ఉన్న ఈ సెలా సొరంగం భారత్ కు వ్యూహాత్మకంగా చాలా అవసరం.
- 'సెలా టన్నెల్' ప్రాజెక్టు దేశ రక్షణ సంసిద్ధతను పెంచడమే కాకుండా, ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తుంది.
- ఈ ప్రాజెక్టుకు 2019 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అయితే, కోవిడ్ -19 మహమ్మారితో సహా వివిధ కారణాల వల్ల పనులు ఆలస్యమయ్యాయి.