Mumbai Coastal Road Project: మరికొన్ని రోజుల్లో నెరవేరనున్న ముంబై నగర వాసుల చిరకాల స్వప్నం-mumbai coastal road project dream come true in days ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mumbai Coastal Road Project: మరికొన్ని రోజుల్లో నెరవేరనున్న ముంబై నగర వాసుల చిరకాల స్వప్నం

Mumbai Coastal Road Project: మరికొన్ని రోజుల్లో నెరవేరనున్న ముంబై నగర వాసుల చిరకాల స్వప్నం

Praveen Kumar Lenkala HT Telugu
Sep 26, 2023 10:43 AM IST

Mumbai Coastal Road Project: వరదలు, ట్రాఫిక్‌తో ముప్పుతిప్పలు పడుతున్న ముంబై నగర వాసుల చిరకాల స్వప్నం ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కాబోతోంది.

వేగంగా పనులు పూర్తిచేసుకుంటున్న ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్టు
వేగంగా పనులు పూర్తిచేసుకుంటున్న ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్టు (HT Telugu)

ముంబై మహానగరంలో ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతానికి రోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తారు. రోజులో అక్కడ జనసంఖ్య కోటికి చేరుకుంటే రాత్రి పూట మాత్రం వేలల్లోకి మారుతుంది. రోజూ లక్షలాది మంది జీవితంలో గంటల కొద్దీ సమయం ట్రాఫిక్‌లోనూ, రైల్వే స్టేషన్లలోనూ గడిచిపోతుంది. ఇక్కడ వర్షపాతం కూడా చాలా ఎక్కువ. చినుకు పడితే ట్రాఫిక్ చిక్కులు సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో పదమూడేళ్ల కింద వచ్చిన ఆలోచన నేడు కార్యరూపం దాల్చుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. అదే ముంబై కోస్టల్ రోడ్ (సౌత్) ప్రాజెక్ట్. అనేక న్యాయపరమైన చిక్కులు, క్లియరెన్సులు దాటుకొని శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే గంట ప్రయాణం పావుగంటలో పూర్తవుతుంది.

ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్టు స్వరూపం ఇదీ

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ (సౌత్) దక్షిణ ముంబైలోని ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లైఓవర్ నుండి బాంద్రా వర్లీ సీ లింక్ యొక్క వర్లీ ఎండ్ వరకు మొత్తం నిడివి 10.58 కి.మీ. ఉంటుంది. నగరంలోని రహదారులు ట్రాఫిక్ అవసరాలు తీర్చలేకపోతున్నందున పూర్తిగా సముద్రపు ఒడ్డున ఈ రహదారి ఏర్పాటవుతోంది. ఇందులో కొంత భాగం సొరంగ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ సొరంగం సముద్రపు అడుగున, కొంత భాగం కొండల దిగువన కూడా ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్ ఖర్చు రూ. 13,983.83 కోట్లు (నిర్మాణ వ్యయం రూ. 9383.74 కోట్లు, ఇతర అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు కలిపి). 78.84 శాతం మేర పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. టన్నెల్ బోరింగ్ 100 శాతం, సముద్రపు గోడ 84 శాతం, ఇంటర్ ఛేంజ్ మార్గాలు 72.00 శాతం, వంతెనలు 72 శాతం పూర్తయ్యాయి.

కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ హైలైట్స్

ఈ రహదారి పొడవు 10.58 కి.మీ. దూరం ఉంటుంది. ఇందులో మొత్తం 8 లేన్లు ఉంటాయి. ఉత్తరం వైపు 4 లేన్లు, దక్షిణం వైపు 4 లేన్లు. టన్నెల్‌లో మాత్రం 6 లేన్లు ఉంటాయి. బస్సుల కోసం ప్రత్యేక బస్సు లేన్‌ కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టులో వంతెనల పొడవు 2.19 కి.మీ. మేర ఉంటుంది. ఇక టన్నెల్ పొడవు 2.072 కి.మీ. ఉంటుంది. 11 మీటర్ల అంతర్గత వ్యాసం ఉంటుంది. టన్నెల్ కొంత దూరం సముద్రం అడుగున, కొంత భాగం కొండల దిగువన ఉంటుంది.

టన్నెల్ తీరుతెన్నులు

దక్షిణానికి వెళ్లే టన్నెల్ బోరింగ్ జనవరి 2021లో ప్రారంభమైంది. జనవరి 2022లో పూర్తయింది. ఉత్తరం వైపు సొరంగం బోరింగ్ ఏప్రిల్ 2022లో ప్రారంభమైంది. మే 2023లో పూర్తయింది. సొరంగం 375 మి.మీ. మందపాటి కాంక్రీటుతో ప్లాస్టరింగ్ అయి ఉంటుంది. టన్నెల్‌కు ఫైర్ ప్రొటెక్షన్ బోర్డు కూడా అమర్చారు. భారతదేశంలో మొదటిసారిగా SACARDO వెంటిలేషన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. అత్యవసర ఎగ్జిట్ కోసం కొన్నిచోట్ల క్రాస్ పాసేజ్‌లు ఏర్పాటు చేశారు. అంటే దక్షిణ మార్గం నుంచి ఉత్తర మార్గంలోకి, అలాగే ఉత్తర మార్గం నుంచి దక్షిణ మార్గంలోకి వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది.

ముంబై కోస్టల్ ప్రాజెక్టు రోడ్‌లో టన్నెల్ మార్గం
ముంబై కోస్టల్ ప్రాజెక్టు రోడ్‌లో టన్నెల్ మార్గం (HT Telugu)

రవాణా సేవల కోసం సొరంగంలోనే యుటిలిటీ బాక్స్ ఉంటుంది. అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. భూగర్భంలో కార్ పార్కింగ్ 4 చోట్ల ఉంటుంది. హాజీ అలీ, మహాలక్ష్మి దేవాలయం, వర్లీ వద్ద కూడా కార్ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటైంది. దాదాపు 1800 కార్లు ఇక్కడ పార్క్ చేయవచ్చు. నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు ఈ రహదారి గుండా వెళ్లేందుకు 3 ఇంటర్‌ ఛేంజ్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 7.47 కి.మీ. మేర సీవాల్ నిర్మించారు.

ముంబై కోస్టల్ రోడ్ మార్గం నుంచి నగరంలోకి సముద్రంపైనుంచి ఇంటర్ ఛేంజ్ ఫ్లైఓవర్ నిర్మాణం
ముంబై కోస్టల్ రోడ్ మార్గం నుంచి నగరంలోకి సముద్రంపైనుంచి ఇంటర్ ఛేంజ్ ఫ్లైఓవర్ నిర్మాణం (Ht telugu)

ప్రాజెక్ట్ పూర్తయితే కలిగే ప్రయోజనాలు

కోస్టల్ రోడ్ ప్రాజెక్టు వల్ల ప్రయాణ సమయం 70%, ఇంధన వినియోగం 34% తగ్గుతుంది. ఇంధన వినియోగం తగ్గడం వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ వల్ల ధ్వని, వాయు కాలుష్యం తగ్గుతుంది. అదనంగా 70 హెక్టార్ల పచ్చని ప్రాంతం ఏర్పాటై కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ముంబై వాసుల జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రతిపాదిత గ్రీన్ జోన్‌లో సైకిల్ ట్రాక్‌లు, పబ్లిక్ గార్డెన్‌లు, జాగింగ్ ట్రాక్‌లు, ఓపెన్ థియేటర్ మొదలైనవి ఉన్నాయి. ముంబైవాసులకు అదనపు కొత్త పర్యాటక స్థలం లభిస్తుంది. తీర ప్రాంతం కోతను తగ్గించడానికి, తుఫాను అలల నుండి సముద్ర తీరాన్ని రక్షించడానికి సీ వాల్ నిర్మించారు.

ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ సైడ్ లైట్స్

  • టన్నెల్ బోరింగ్ మెషిన్ ద్వారా తవ్విన భారతదేశంలోనే అతిపెద్ద వ్యాసం కలిగిన సొరంగం. (డయా 12.19మీ)
  • భారతదేశంలో మొదటిసారిగా రోడ్డు టన్నెల్‌లో SACARDO వెంటిలేషన్ సిస్టమ్‌ను ఉపయోగించారు.
  • భారతదేశంలో మొట్టమొదటిసారిగా వంతెనల నిర్మాణానికి మోనోపైల్ ఫౌండేషన్‌ను ఉపయోగించారు.
  • ఈ ప్రాజెక్ట్‌లో రహదారి, వంతెనలు, ఎలివేటెడ్ రోడ్లు, టన్నెల్, సముద్రం దిగువన, కొండ దిగువన టన్నెల్, గ్రీన్ ఏరియా ఉండడం విశేషం.

ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది..

ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ నవంబర్ 2023 వరకు పూర్తి చేయాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ నావిగేషన్ స్పాన్‌లో 60 మీ నుండి 120 మీ వరకు మార్పు కారణంగా 2024 మేలో ప్రాజెక్టు పూర్తవుతుంది.

Whats_app_banner