Suicide: ఒకే రోజు వేర్వేరు చోట్ల దంపతుల ఆత్మహత్య; భర్త ఐఏఎఫ్ లో, భార్య ఆర్మీలో ఉన్నతాధికారులు
సాయుధ దళాల్లో ఉన్నతాధికారులుగా సేవలను అందిస్తున్న ఒక జంట.. ఒకే రోజు వేర్వేరు ప్రదేశాల్లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. భారత వైమానిక దళంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ గా భర్త, ఆర్మీలో కెప్టెన్ గా భార్య విధుల్లో ఉన్నారు. తామిద్దరిని ఒకే చోట ఖననం చేయాలని ఆ భార్య తన సూసైడ్ నోట్ లో అభ్యర్థించింది.
Couple Suicide: భారత వైమానిక దళం (IAF) ఫ్లైట్ లెఫ్టినెంట్ గా ఉన్న భర్త, ఆర్మీ లో కెప్టెన్ గా విధుల్లో ఉన్న భార్య మంగళవారం వేర్వేరు ప్రదేశాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త ఆగ్రాలో, భార్య ఢిల్లీలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే రోజు దంపతులు మరణించడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనపై ఆ దంపతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఒకే రోజు.. వేర్వేరు చోట్ల బలవన్మరణం
ఆగ్రాలోని ఖేరియా ఎయిర్ ఫోర్స్ (indian airforce) స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న దీన్ దయాళ్ దీప్ (32), అదే నగరంలోని మిలటరీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న అతని భార్య కెప్టెన్ రేణు తన్వర్ భార్యాభర్తలు. వారిద్దరు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కెప్టెన్ రేణు తన్వర్ ఢిల్లీ కంటోన్మెంట్ లోని అధికారుల మెస్ లో శవమై కనిపించగా, దీన్ దయాళ్ దీప్ సహోద్యోగులు ఆగ్రాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోని నివాస క్వార్టర్స్ లో అతని మృతదేహాన్ని గుర్తించారు.
ఒకే చోట ఖననం చేయాలని అభ్యర్థన
కెప్టెన్ రేణు తన్వర్ మృతదేహం వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. తన భర్తతో పాటు, తనకు కూడా ఒకే ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించాలని ఆమె అందులో కోరారు. ఆగ్రాలోని ఆమె భర్త నివాస గృహంలో అలాంటి సూసైడ్ నోట్ ఏదీ లభించలేదు. దీప్ ఆత్మహత్య గురించి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు తమకు సమాచారం ఇచ్చారని ఆగ్రా సిటీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (DCP) సూరజ్ కుమార్ రాయ్ తెలిపారు. ఉదయం అయినా నిద్రలేవకపోవడంతో అధికారులు అతని గదిలోకి వెళ్లి చూడగా మృతి చెంది కనిపించాడు.
ముందురోజు రాత్రి కూడా సరదాగా..
బీహార్ లోని నలంద జిల్లాకు చెందిన దీప్ మంగళవారం చనిపోవడానికిి ముందు,డిన్నర్ సమయంలో తమతో సరదాగా మాట్లాడాడని, ఎప్పటిలాగానే జోక్స్ వేశాడని, అతడు సూసైడ్ చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని అతడి సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు. మరణానికి ఊపిరాడకపోవడమే కారణమని పోస్టుమార్టంలో తేలిందని ఆగ్రా ఏసీపీ మయాంక్ తివారీ తెలిపారు.
ముందు రోజే ఢిల్లీకి..
రాజస్థాన్ కు చెందిన ఆర్మీ (indian army) కెప్టెన్ రేణు తన్వర్ తన సోదరుడు సుమిత్, తల్లి కౌసల్యతో కలిసి వైద్య చికిత్స కోసం అక్టోబర్ 14న ఢిల్లీకి వచ్చారు. కంటోన్మెంట్ లోని గరుడ శరత్ ఆఫీసర్స్ మెస్ లో విధులు నిర్వహిస్తున్న హవల్దార్ దినేష్ కుమార్ ఆమె ఆత్మహత్య గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఎయిమ్స్ లో ఉన్నారు. ఆ తర్వాత ఆమె భర్త ఆత్మహత్య గురించి తెలిసింది. వారిద్దరిది ప్రేమ వివాహం' అని ఆ అధికారి తెలిపారు.