Kolkata doctor: ‘‘మీ అమ్మాయి చనిపోయింది. ఆత్మహత్య చేసుకుందేమో’’ - కోల్ కతా డాక్టర్ తండ్రితో ఫోన్ చేసిన వ్యక్తి-might have died by suicide what caller told kolkata doctors father on aug 9 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kolkata Doctor: ‘‘మీ అమ్మాయి చనిపోయింది. ఆత్మహత్య చేసుకుందేమో’’ - కోల్ కతా డాక్టర్ తండ్రితో ఫోన్ చేసిన వ్యక్తి

Kolkata doctor: ‘‘మీ అమ్మాయి చనిపోయింది. ఆత్మహత్య చేసుకుందేమో’’ - కోల్ కతా డాక్టర్ తండ్రితో ఫోన్ చేసిన వ్యక్తి

HT Telugu Desk HT Telugu
Aug 29, 2024 08:16 PM IST

Kolkata doctor: దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు, ఆందోళనలకు కారణమైన కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారంపై పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ దారుణ ఘటన జరిగిన రోజు రాత్రి బాధిత డాక్టర్ పేరెంట్స్ కు హాస్పిటల్ కు చెందిన వ్యక్తి చేసిన ఫోన్ కాల్ వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

కోల్ కతా డాక్టర్ తండ్రికి వచ్చిన ఫోన్ కాల్ వివరాలు
కోల్ కతా డాక్టర్ తండ్రికి వచ్చిన ఫోన్ కాల్ వివరాలు

Kolkata doctor: ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో అత్యాచారం, హత్యకు గురైన కోల్ కతా వైద్యురాలి తల్లిదండ్రులకు నేరం జరిగిన రోజు రాత్రి ఆసుపత్రి ఉద్యోగి నుంచి మూడు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ ట్రైనీ డాక్టర్ కు ఏం జరిగిందో చెప్పకుండా దాటివేసిన ఆ వ్యక్తి, మీ కూతురు చనిపోయిందని, హాస్పిటల్ కు తొందరగా రావాలని మాత్రం అభ్యర్థించాడు.

మూడు ఫోన్ కాల్స్..

ఘటన జరిగిన రోజు రాత్రి బాధిత మహిళా డాక్టర్ తల్లిదండ్రులకు హాస్పిటల్ నుంచి మూడు ఫోన్ కాల్స్ వచ్చాయి. వాటిలో మొదటిది ఆర్జీ కర్ ఆస్పత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ చేశారు. ఆయన బాధితురాలి తల్లిదండ్రులను తొందరగా ఆసుపత్రికి రమ్మని కోరారు. ‘‘మీ కూతురికి ఆరోగ్యం బాగోలేదు. దయచేసి మీరు వెంటనే ఆసుపత్రికి రాగలరా?' అని ఆయన ప్రశ్నించారు. బాధితురాలి తండ్రి మరిన్ని వివరాలు కోరగా ఆమెకు ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చేర్పిస్తున్నామని చెప్పాడు. సమాచారం కోసం తండ్రి ఆ వ్యక్తిపై ఒత్తిడి తీసుకురావడంతో ఏం జరిగిందో వైద్యులు చెబుతారని చెప్పాడు. ఆస్పత్రికి వెంటనే రావాలని పట్టుబట్టారు. రెండో కాల్ చేసిన వ్యక్తి, బాధిత డాక్టర్ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే హాస్పిటల్ కు రావాలని కోరాడు. కాసేపటి తరువాత మూడో కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి ‘‘మీ కూతురు చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు లేదా చనిపోయి ఉండవచ్చు. పోలీసులు వచ్చారు. మేము ఆసుపత్రిలో ఉన్నాము, అందరి ముందే, నేను ఈ కాల్ చేస్తున్నాను’’ అని చెప్పాడు.

సెమినార్ హాల్ లో..

ఆగస్ట్ 9 రాత్రి 36 గంటల షిఫ్ట్ లో ఉన్న వైద్యురాలు విశ్రాంతి తీసుకోవడానికి ఆసుపత్రిలోని సెమినార్ హాల్ కు వెళ్లగా సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశాడు. అదే హాస్పిటల్ లో సివిల్ వాలంటీర్ గా సంజయ్ రాయ్ పని చేస్తున్నాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 9న తెల్లవారుజామున 4.03 గంటలకు సంజయ్ రాయ్ సెమినార్ హాల్ లోకి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీ లో తేలింది. ఆమె శరీరంపై 25 అంతర్గత, బాహ్య గాయాలు ఉన్నాయని పోస్టుమార్టంలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ హత్య, అత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని సుప్రీంకోర్టు ఘాటుగా విమర్శించింది.