Crime News : మామిడితోటలో చెట్టుకు వేలాడుతూ ఇద్దరు బాలికల మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా?
Crime News : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇద్దరు దళిత బాలికలు చెట్టుకు వేలాడుతూ కనిపించారు. అయితే వీరిది ఆత్మహత్యేనని పోలీసులు చెబుతుంటే.. కాదు హత్యలు అని బాలికల తరఫు బంధువులు చెబుతున్నారు. ఈ కేసులు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ లో మంగళవారం ఉదయం 15, 18 ఏళ్ల వయసున్న ఇద్దరు దళిత బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్ పోలీసు సూపరింటెండెంట్ అలోక్ ప్రియదర్శి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాయంగంజ్ సమీపంలోని ఓ గ్రామంలోని మామిడితోటలో ఇద్దరు బాలికల మృతదేహాలు కనిపించాయి.
స్థానికులు ఈ విషయం చెప్పడంతో ఘటన స్థలానికి అధికారులు వెళ్లారు. అప్పటికే బాలికలు మృతి చెందారు. మృతదేహాలు చెట్టుకు వెలాడుతూ కనిపించాయి. ఇద్దరు అమ్మాయిలు క్లోజ్ ఫ్రెండ్స్ అని, ఒకే సామాజికవర్గానికి చెందిన వారని ఎస్పీ చెప్పారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి దర్శనానికి వెళ్లిన ఇద్దరు బాలికలు తిరిగి ఇంటికి రాలేదని అన్నారు.
బాలికల కుటుంబాలు రాత్రంతా వారి కోసం విస్తృతంగా గాలించాయి.., కానీ వారు దొరకలేదని ఎస్పీ తెలిపారు. మంగళవారం ఉదయం వారి మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. అదే చెట్టు సమీపంలో ఒక మొబైల్ ఫోన్ లభ్యమైందని ఎస్పీ ప్రియదర్శని చెప్పారు. ఒక బాలికకు సంబంధించిన వస్తువుల నుంచి ఒక సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నామన్నారు.
మృతదేహాలను పోస్టుమార్టానికి పంపి దర్యాప్తు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఎస్పీ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ మరణాలు ఆత్మహత్యలేనని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఫరూఖాబాద్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) సంజయ్ కుమార్ తెలిపారు. బాలికలను హత్య చేశారని ఓ బాలిక తండ్రి ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. బాలికలే ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైనా చంపేసి వారిని చెట్టుకు వేలాడదీశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
టాపిక్