Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్
కోర్టుల్లో దర్జాగా దొంగతనాలు చేస్తున్న ఒక మహిళా న్యాయవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని పలు కోర్టుల్లో సహచర న్యాయవాదులు, క్లయింట్ల కు సంబంధించిన విలువైన వస్తువులను దొంగతనం చేసినట్లు ఆ కి‘లేడీ లాయర్’ ఒప్పుకుంది. పోలీసులు ఆమె దొంగతనం చేసిన వస్తువులను రికవరీ చేశారు.
వివిధ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులు, ముంబై సెషన్స్ కోర్టు, బాంబే హైకోర్టుల్లో ఇతర న్యాయవాదులు,వారి క్లయింట్ల నుంచి విలువైన వస్తువులను దొంగిలించిన కేసులో చెంబూర్ కు చెందిన 37 ఏళ్ల మహిళా న్యాయవాదిని కుర్లా పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని పలు కోర్టుల్లో దొంగతనాలు చేసినట్లు ఆ లాయర్ అంగీకరించిందని పోలీసులు తెలిపారు.
ఆదాయం లేకపోవడంతో..
కోర్టుల్లో దొంగతనాలు చేస్తున్న బబితా మాలిక్ అనే మహిళా న్యాయవాదిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగతనాలు చేసినట్లు ఆమె ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బబితా మాలిక్ మహిళా న్యాయవాది. కానీ ఆమెకు క్లయింట్లు దొరకకపోవడంతో, ఆదాయం లేక డిప్రెషన్ లోకి వెళ్లింది. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దాంతో, ఆమె దొంగతనాల బాట పట్టింది. ఇతర న్యాయవాదులు కోర్టు వ్యవహారాల్లో బిజీగా ఉన్న సమయంలో వారికి సంబంధించిన, వారి వద్దకు వచ్చే క్లయింట్లకు సంబంధించిన విలువైన వస్తువులను దొంగిలించడం ప్రారంభించింది.
సీసీ కెమెరాల్లో చూసి..
ట్రాంబేకు చెందిన ఫర్హిన్ హిమాయత్ అలీ చౌదరి (28) అనే వ్యక్తి బుధవారం కుర్లా కోర్టుకు వెళ్లాడు. కోర్టులో అతడు తన రూ. 42,000 లు, ఇతర విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్నాడు. ఆ బ్యాగులో పర్సు, హెడ్ ఫోన్, ఛార్జర్, పేపర్లు, ఐడీ కార్డులు, డెబిట్, క్రెడిట్ కార్డులు, పవర్ బ్యాంక్, వెండి నాణేలు ఉన్నాయని కుర్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా నిందితురాలు లాయర్ దుస్తులు ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఇతర లాయర్ల సహాయంతో ఆమెను గుర్తించి సియోన్ ప్రాంతం నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి దొంగిలించిన పలు విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లయింట్లు దొరక్కపోవడంతో తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, దాని వల్ల డిప్రెషన్ కు గురయ్యానని, అందుకే నేరాలకు పాల్పడటం ప్రారంభించానని చెప్పింది. ఆమె అవివాహితురాలని, ఆమెను మే 20 వరకు పోలీసు కస్టడీలో ఉంచామని పోలీసులు తెలిపారు.