Siddipet District : ధాన్యం బస్తాల దొంగతనాలు - ముగ్గురు యువకులు అరెస్ట్, ఇలా దొరికిపోయారు
Siddipet District News : సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ధాన్యం బస్తాలను దొంగిలిస్తున్న ముగ్గురు వ్యక్తులను సిద్ధిపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
Siddipet District Crime News : జల్సాలకు అలవాటు పడి, అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలని ముగ్గురు యువకులు కలిసి రైతులు కష్టపడి పండించిన వడ్ల బస్తాలు, ట్రాక్టర్ ట్రాలీలను దొంగలించి వాటిని అమ్ముకుంటున్నారు. అలా వచ్చిన డబ్బులను ముగ్గురు పంచుకునేవారు. ఈ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.1,40,000 నగదు, ట్రాక్టర్ ట్రాలీ, బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నారు.
సిద్ధిపేట జిల్లా కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో తొగుట సీఐ లతీఫ్ వివరాలను వెల్లడించారు. దౌల్తాబాద్ మండలం లింగరాజు పల్లి గ్రామానికి చెందిన పోతుల సుధాకర్ వ్యవసాయం పనిచేస్తూ జీవించేవాడు. కాగా వ్యవసాయానికి వచ్చే డబ్బులు సరిపోతలేవని, అదే గ్రామానికి చెందిన సున్నపు దేవేందర్, సాగాని నవీన్ ముగ్గురు కలిసి కల్లాలలో బహిరంగ ప్రదేశాలలో రైతుల వడ్ల బస్తాలు దొంగలించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేద్దామని నిర్ణయించుకొన్నారు. వారు అనుకున్న పథకం ప్రకారం రెండు నెలల క్రితం సిరసనగండ్ల గ్రామంలో రోడ్డు పక్కన ఉంచిన దాన్యం బస్తాలను దొంగలించి వాటిని పోతుల సుధాకర్ బొలెరో వాహనంలో వేసుకొని సిద్దిపేట మార్కెట్ లో అమ్ముకొని వచ్చిన డబ్బులను ముగ్గురు కలిసి పంచుకున్నారు. అదేవిధంగా భూంపల్లి గ్రామంలో 13 బస్తాల ధాన్యం,సామర్లపల్లి పెట్రోల్ పంపు దగ్గర 12 బస్తాల ధాన్యం,పెద్ద మాసంపల్లి గ్రామంలో 45 బస్తాల ధాన్యం,చిన్న ఆరేపల్లి గ్రామంలో 21 వరి ధాన్యం బస్తాలను,సిరసనగండ్ల గ్రామంలో 21 బస్తాల వరి ధాన్యం,కొండపాక శివారులో 47 బస్తాల వరి ధాన్యం,కొండపాక శివారులో రోడ్డు పక్కన ట్రాక్టర్ ట్రాలీ,కల్టివేటర్,కొత్తపల్లి గ్రామంలో పొద్దుతిరుగుడు,సిద్దిపేట కృష్ణ సాగర్ వెళ్లే దారిలో ఆరబోసిన వరి ధాన్యం,వెంకట్రావుపేట గ్రామంలో 10 బస్తాల ధాన్యం,చిన్న మాసం పల్లి గ్రామంలో వారి ధాన్యం దొంగలించి అమ్మగా వచ్చిన డబ్బుల్లో కొంతభాగం పంచుకొని,కొంతభాగం ఖర్చు చేయడంతో పాటు కొన్ని డబ్బులను దాచిపెట్టారు.
ముగ్గురు అరెస్ట్….
గురువారం ఉదయం ముగ్గురు కలిసి చిన్నమాసం పల్లి గ్రామంలో దొంగలించిన 18 బస్తాల ధాన్యంను బొలెరో వాహనంలో వేసుకొని చేర్యాల పట్టణంలో అమ్మడానికి బయల్దేరారు. ఈ క్రమంలో కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్,సిబ్బందితో కలిసి కొండపాక ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా వరి ధాన్యం బస్తాలు ఎక్కడ నుండి తెస్తున్నారని అడగగా సమాధానమివ్వకుండా తడబడడంతో అనుమానంతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వరి ధాన్యం బస్తాలు, కల్టివేటర్, ట్రాక్టర్ ట్రాలీ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారు. నిందితుల నుండి రూ. 1,40,000 నగదు, ట్రాక్టర్ ట్రాలీ, మరియు దొంగతనానికి ఉపయోగించిన బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు సీఐ లతీఫ్ తెలిపారు. 12 దొంగతనాల కేసులను ఛేదించినందుకు తొగుట సిఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుళ్లు , కానిస్టేబుళ్లు, ఐటీ కోర్ ఎస్ఐ నరేందర్ రెడ్డి లను సిద్ధిపేట పోలీస్ కమిషనర్ బి. అనురాధ అభినందించి నగదు రివార్డ్ అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…. అంకితభావంతో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి రివార్డులు అవార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలీసు ఉద్యోగి ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించి డిపార్ట్మెంట్ కు జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు.
రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం