Trams in kolkata : ‘ఒక శకం ముగిసింది’- కోల్‌కతా ఐకానిక్ 'ట్రామ్' సేవలకు స్వస్తి!
kolkata trams : చూడాలని ఉంది సినిమాలో ట్రామ్లను చూశారా? ఖుషీ సినిమాలో ట్రామ్లను చూశారా? అయితే వాటిని ఇక సినిమాల్లోనే చూడాలి! కోల్‌కతాలో 150ఏళ్ల చరిత్ర కలిగిన, ఐకానిక్ ట్రామ్ సేవలను నిలిపివేయాలని పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా కోల్‌కతావాసులు భావోద్వేగానికి గురవుతున్నారు.
కోల్‌కతాలో ఐకానిక్ 'ట్రామ్' ఇక కనిపించదు! 150ఏళ్ల చరిత్ర కలిగిన ట్రామ్ సేవలను డిస్కంటిన్యూ చేయాలని పశ్చిమ్ బెంగాల ప్రభుత్వం నిర్ణయించింది. 1873 నుంచి ప్రజలకు సేవలందిస్తున్న ట్రామ్స్ ఇక పనిచేయవు అని తెలియడంతో కోల్‌కతావాసులు భావోద్వేగానికి గురవుతున్నారు.
కోల్‌కతా ట్రామ్ సేవలు నిలిపివేత..
నగర ప్రజలకు జీవనాడిగా భావించే 150 ఏళ్ల నాటి ట్రామ్ సర్వీసును బ్రిటీషర్లు ప్రవేశపెట్టారు. అనంతర కాలంలో ఈ ట్రామ్లను పట్నా, చెన్నై, నాసిక్, ముంబై వంటి ప్రధాన నగరాలకు విస్తరించారు. కానీ చివరికి అన్ని చోట్లా దశలవారీగా మూతపడ్డాయి.
కోల్‌కతాలో 150ఏళ్ల చరిత్ర..
కోల్‌కతా ట్రామ్ ప్రయాణం ఫిబ్రవరి 24, 1873 ప్రారంభమైంది. నాడు గుర్రాలు కార్లను పట్టాలపై నడిపించేవి. 1882లో స్టీమ్ ఇంజిన్ ప్రవేశపెట్టి ఆధునీకరణకు మార్గం సుగమం చేశారు. మొదటి విద్యుత్-ఆధారిత ట్రామ్ 1900లో అరంగేట్రం చేసింది. ఇది నగరంలో ప్రజా రవాణాను మార్చేసింది. ఒక శతాబ్దానికి పైగా విద్యుదీకరణ తరువాత, 2013లో ఏసీ ట్రామ్లను ప్రవేశపెట్టడం కోల్‌కతా ట్రామ్ సేవల పరిణామంలో మరొక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
మరి ఇప్పుడేం అయ్యింది?
ట్రామ్‌లు నెమ్మదిగా కదిలే రవాణ సాధనాలు. ప్రయాణికులకు వేగవంతమైన ఆప్షన్స్ అవసరమని, అందుకే కోల్‌కతా ట్రామ్ సేవలను నిలిపివేస్తున్నట్టు పశ్చిమ్ బెంగాల్ రవాణా మంత్రి స్నేహాసిస్ చక్రవర్తి పేర్కొన్నారు. ఎస్ప్లనేడ్ నుంచి మైదాన్ వరకు ఒక మార్గం మినహా, ట్రాఫిక్ సమస్యల కారణంగా నగరంలోని ట్రామ్ సేవలను నిలిపివేస్తున్నట్టు వివరించారు.
"1873 లో గుర్రపు బండ్లుగా ప్రవేశపెట్టిన తరువాత ట్రామ్‌లు నిస్సందేహంగా కోల్‌కతా వారసత్వంలో భాగం. మునుపటి శతాబ్దంలో రవాణాలో కీలక పాత్ర పోషించాయి. కానీ కోల్‌కతా ఉపరితల వైశాల్యంలో రోడ్లు కేవలం 6 శాతం మాత్రమే ఉన్నందున, వాహనాల రద్దీకి దారితీసే సమయంలో అదే మార్గాల్లో ట్రామ్లను రోడ్ల మీద నడపడం సరికాదని మేము గమనించాము," అని చక్రవర్తి అన్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా రద్దీ సమయాల్లో ప్రజలు కార్యాలయాలకు ఆలస్యంగా వెళ్లకుండా ఉండటానికి, ట్రామ్ల ఉపసంహరణతో సహా కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవలసి ఉందని ఆయన అన్నారు.
మైదాన్, ఎస్ప్లనేడ్ మధ్య హెరిటేజ్ ట్రామ్‌లు నడుస్తాయని, తద్వారా ప్రజలు ఆహ్లాదకరమైన, పర్యావరణ హితమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని మంత్రి తెలిపారు.
కోల్‌కతా ప్రజల భావోద్వేగం..
కోల్‌కతాలో ట్రామ్ సేవలు నిలిపివేతపై స్థానికులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఓ ప్రయాణికుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. 'దీనిని నిలిపివేయకూడదు. ఇది కోల్‌కతా ప్రజలకు, ముఖ్యంగా పేదలకు జీవనాధారం. ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగింది. ట్రామ్‌లో ప్రయాణించడం కంటే బస్సులో టిక్కెట్లు, టాక్సీలో ప్రయాణించడం చాలా ఖరీదైనది. ఇది చౌకైన ప్రయాణ మార్గం. ఇది విద్యుత్తుతో నడుస్తుంది కాబట్టి ఇది ఎకో ఫ్రెండ్లీగానూ ఉంటుంది," అని అన్నాడు.
18 ఏళ్ల విద్యార్థి ఏఎఫ్పీతో మాట్లాడుతూ.. 'నేను ఇప్పటికీ ట్రామ్ల కోసం వేచి చూస్తాను. ట్రామ్లోనే వెళతాను," అని అన్నాడు.
54 ఏళ్ల టీచర్ రామ్ సింగ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను ఏఎఫ్పీతో పంచుకున్నారు. “మేము ట్రామ్‌లో ఎక్కి, ఒకటి లేదా రెండు స్టాప్ల తర్వాత దిగుతాము. అప్పుడు మేము అవతలి వైపు నుంచి ట్రామ్ ఎక్కి దాని నుంచి మళ్లి వెనక్కి వచ్చే వాళ్లం. ఆ విధంగా, మేము మా ట్రామ్ రైడ్లను ఆశ్వాదించేవాళ్లము, ” అని పేర్కొన్నారు.
“నగరాలు అభివృద్ధి చెందాలి, కానీ దానితో పాటు, చరిత్రను కూడా పరిరక్షించాలి,” అని ఆయన అభిప్రాయపడ్డారు.
సంబంధిత కథనం