Kolkata doctors protest : సమ్మెని పాక్షికంగా నిలిపివేసిన డాక్టర్లు..
Kolkata doctors protest news : 41 రోజులుగా జరుగుతున్న నిరసనలను పాక్షికంగా నిలిపివేసేందుకు కోల్‌కతా డాక్టర్లు నిర్ణయించుకున్నారు. పశ్చిమ్ బెంగాల్లో వరదల నేపథ్యంలో పలు అత్యవసర సేవలు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు.
కోల్‌కతా వైద్యురాలి రేప్, హత్య కేసు నేపథ్యంలో 41 రోజులుగా డాక్టర్లు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మెని పాక్షికంగా నిలిపివేస్తున్నట్టు కోల్‌కతా వైద్యులు తాజాగా ప్రకటించారు. శనివారం నుంచి అత్యవసర సేవలను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
గత 10 రోజులుగా తాము ధర్నా చేస్తున్న కోల్‌కతాలోని స్వాస్థ్య భవన్ నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కార్యాలయం ఉన్న సీజీవో కాంప్లెక్స్ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహిస్తామని, ఆ తర్వాత ప్రస్తుతానికి తమ ఆందోళనను విరమించుకుంటామని వైద్యులు వెల్లడించారు.
“శనివారం నుంచి నిత్యావసర సేవలను పునరుద్ధరిస్తాం. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వాస్థ్య భవన్ వెలుపల శుక్రవారం మెగా ర్యాలీ నిర్వహించడం ద్వారా ధర్నాను విరమిస్తాం,” అని నిరసనలు చేస్తున్న కోల్‌కతా డాక్టర్లలో ఒకరైన అనికేత్ మహతా విలేకరులకు తెలిపారు.
రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ భద్రత, సమర్థవంతంగా పనిచేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ గురువారం 10 ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ డాక్టర్ల ఐదు డిమాండ్లలో ఇవి కూడా ఉన్నాయి.
దక్షిణ బెంగాల్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో పాటు వేలాది మంది నిరాశ్రయులైన నేపథ్యంలో తాము తిరిగి విధుల్లో చేరుతున్నట్లు వైద్యులు తెలిపారు.
అయితే అత్యవసర సేవలు అంటే ఏమిటో నిర్ణయించడానికి ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్‌ని రూపొందిస్తామని, ఆసుపత్రి ఔట్‌పేషెంట్ విభాగాలు వంటి అన్ని వైద్య సేవలను తిరిగి ప్రారంభించబోమని వారు తేల్చిచెప్పారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో వివిధ విభాగాల్లో జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలను పునరుద్ధరించనున్నారు. "శుక్రవారం నాటి ర్యాలీ తర్వాత ఆయా మెడికల్ కాలేజీలకు వెళ్లి ఎస్ఓపీలు తీసుకుని అత్యవసర సేవలను పునఃప్రారంభిస్తాం. అయితే, ఓపీడీల్లో పని నిలిపివేత కొనసాగుతుంది," అని మరో జూనియర్ కోల్‌కతా డాక్టర్ దేబాశిష్ హల్దర్ తెలిపారు.
తమ అన్ని డిమాండ్లను అమలు చేసేందుకు ప్రభుత్వానికి వైద్యులు 7 రోజుల అల్టిమేటం ఇచ్చారు.
“కొన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని అమలు చేసేందుకు గడువు విధించలేదు. సుప్రీంకోర్టులో ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చే వరకు వేచి చూస్తాం. అప్పటికి ప్రభుత్వం ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే మళ్లీ పూర్తిస్థాయిలో సమ్మెకు దిగుతాం. ఆ సమయంలో ఉద్యమం మరింత ఉధృతంగా ఉంటుంది. ప్రతి మెడికల్ కాలేజీ, ఆసుపత్రిని నిరసనల్లోకి తీసుకెళ్తాము,” అని హల్దర్ తెలిపారు.
కోల్‌కతా డాక్టర్ల నిరసనలకు నెల రోజులుగా నాయకత్వం వహిస్తున్న పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ కూడా నైతిక బాధ్యతగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవడానికి అభయ క్లినిక్లను తెరవాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి ఈ క్లినిక్‌లు ప్రారంభం కానున్నాయి.
“ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్‌లో కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టులో, వీధుల్లో పోరాటం కొనసాగుతుందని, తద్వారా మరో ఆర్జీ కర్ లాంటి ఘటన జరగకుండా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాం. ఇందుకోసం నిర్దిష్టమైన కార్యక్రమాలు, రోడ్ మ్యాప్ ప్రకటిస్తాం,” అని మహతా తెలిపారు. తాము పాక్షిక విజయాలు సాధించామని వైద్యులు చెప్పారని, అయితే ప్రభుత్వం ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరగకుండా పోరాటం ఆగిపోతోందన్న ఆరోపణలను ఖండించారు.
“ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి అభిజిత్ మొండల్‌ని అరెస్టు చేశారు. ఘోష్ రిజిస్ట్రేషన్‌ని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. కోల్‌కతా డాక్టర్ల నిరసనకు సంబంధించి ఇవి పెద్ద విజయాలు. భద్రతకు సంబంధించి కూడా ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసింది,” అని మహతా తెలిపారు.
గత నెలలో ఆర్జీ కర్ ఆస్పత్రిలో అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆగస్టు 9 నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం