Doctors protest : దీదీ వచ్చినా ఆగని నిరసనలు- ‘న్యాయం’ కావాలని వైద్యుల పోరాటం..
Kolkata Doctors protest : కోల్‌కతా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీ వచ్చినా, సందీప్ ఘోష్ అరెస్ట్ అయినా.. కోల్‌కతా వైద్యురాలి హత్య కేసులో పూర్తి స్థాయి న్యాయం జరిగేంతవరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య కేసులో కీలక పరిణామంగా ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, కోల్‌కతా పోలీసు అధికారిని సీబీఐ శనివారం అరెస్టు చేసింది. మరోవైపు, సీఎం మమతా బెనర్జీ శనివారం ఆకస్మిక పర్యటనతో ఆందోళన చేస్తున్న వైద్యులను కలుసుకుని 'దోషులపై చర్యలు తీసుకుంటామని' వారికి హామీ ఇచ్చారు. అయితే న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామని వైద్యులు తేల్చిచెప్పారు!
కోల్‌కతా వైద్యురాలి హత్య కేసు అప్డేట్స్..
కోల్‌కతా వైద్యురాలి హత్య కేసు ఆధారాలను దాచేందుకు ప్రయత్నించారంటూ సందీప్ ఘోష్‌ని, దర్యాప్తు సరిగ్గా చేపట్టలేదని తాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి అధికారి అభిజిత్ మొండల్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది. అవినీతి కేసులో ఘోష్ ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
సాక్ష్యాలను నాశనం చేయడం, ఇతర నేరాల ఆరోపణలపై ఘోష్, పోలీసు అధికారిని అరెస్టు చేశామని, ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు మొండల్‌పై కూడా ఆరోపణలు ఉన్నాయని సీబీఐ తెలిపింది.
ఘోష్‌ని రిమాండ్ కు తరలించాలని కోరుతూ ఏజెన్సీ కోర్టులో దరఖాస్తు చేసుకుంది. ఆయనను సీబీఐ కస్టడీకి అప్పగించాలని కోర్టు జైలు అధికారులను కోరిందని ఆ అధికారి తెలిపారు. అత్యాచారం, హత్య కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు.
మరోవైపు సీఎం మమతా బెనర్జీ శనివారం జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపుతున్న ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చర్చలకు రావాలని కోరారు.
ఎవరైనా దోషులుగా తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటానని మమత చెప్పారు. విధులకు హాజరుకావాలని, డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీతో చర్చిస్తానని సీఎం చెప్పారు.
'నేను మీపై ఎలాంటి చర్యలు తీసుకోను. ఇది యూపీ కాదు.. ఎస్మాను అమలు చేసి అన్ని రకాల సమ్మెలు, ర్యాలీలను నిలిపివేశారు. కానీ నేను అలాంటిదేమీ చేయను. వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా నేను వ్యతిరేకం. నా ప్రపోజల్ గురించి ఆలోచించండి. మీకు మద్దతుగా నిలవడానికి నేను ఈ నిరసన స్థలానికి రాగలిగితే, నేను కూడా న్యాయం చేయగలనే కదా! మీ డిమాండ్లను వినగలను," అని ఆమె అన్నారు.
అయితే, సీఎం నివాసం గేటు వద్ద మూడు గంటల పాటు వేచి చూసిన తర్వాత తమను అకారణంగా వెళ్లిపోవాలని కోరారని ఆందోళనకారులు ఆరోపించడంతో ప్రతిపాదిత సమావేశం విఫలమైంది. మరోవైపు సీఎం తన ఇంటి బయట ఎదురుచూస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మరాయి.
మీటింగ్‌ని లైవ్ టెలికాస్ట్ చేయాలన్న తమ డిమాండ్‌ని ప్రభుత్వం తిరస్కరించిన కారణంగా నిరసనకారులు మమతా బెనర్జీ నివాసంలోకి ప్రవేశించడానికి నిరాకరించారు. చర్చలలో పాల్గొనాలని మమత వైద్యులకు విజ్ఞప్తి చేశారు. "న్ను అవమానించవద్దు" అని కోరారు. కానీ సమావేశం ముందుకెళ్లలేదు.
కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలోని స్వాస్థ్య భవన్లో జూనియర్ డాక్టర్లు వరుసగా ఐదో రోజు నిరసన తెలిపారు. సీఎంను ఆమె నివాసంలో కలిసేందుకు వెళ్లిన ప్రతినిధి బృందంలో ఒకరైన డాక్టర్ అకీబ్ మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు. సందీప్ ఘోష్ అరెస్ట్‌తో తమ డిమాండ్ సరైనదేనని నిరూపితమైందని అన్నారు. “సందీప్ ఘోష్ చేసింది సంస్థాగత నేరం. ఇలాంటి కార్యక్రమాల్లో పలువురు ప్రధానోపాధ్యాయులు, అధికారులు పాలుపంచుకుని ఉండవచ్చు. ఇందులో ప్రమేయం ఉన్న వారందరూ రాజీనామా చేయాలి. న్యాయం జరిగే వరకు తమ నిరసనలు కొనసాగిస్తాము,” అని చెప్పారు. అభయ (కోల్‌కతా వైద్యురాలు) కోసం తాము ఇక్కడ ఉన్నామని, ఆమెకు న్యాయం చేయాలని కోరుతూనే ఉంటామని అన్నారు.
సంబంధిత కథనం