Kolkata Rape Case : వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ప్రదేశంలో ఏం జరుగుతుంది? సాక్ష్యాలు చెరిపేస్తున్నారా?!
Kolkata Doctor Rape Case : కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం హత్య జరిగిన ప్రదేశంలో కూల్చివేశారు. దీంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారం జరిగిన ప్రదేశంలో ఏం జరుగుతుందని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. సాక్ష్యాలు చెరిపివేసే కుట్రలు జరుగుతున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు.
కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ సంఘటనకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని అధికారులు ప్రయత్నిస్తున్నారని వామపక్ష సంఘాలు, బీజేపీ ఆరోపించాయి.
సీపీఐ(ఎం) అనుబంధ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్‌ఐ), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) కొద్ది రోజుల క్రితం డాక్టర్ మృతదేహాన్ని కనుగొన్న సెమినార్ గదికి సమీపంలో పునరుద్ధరణ పనులు ప్రారంభమయిన విషయాన్ని ఎత్తి చూపాయి. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసి అసలు దోషులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎమర్జెన్సీ బిల్డింగ్ గేటు వద్ద నిరసనకు దిగారు విద్యార్థి నేతలు.
బాధితురాలిపై పలువురు వ్యక్తులు అత్యాచారం చేసి ఉండవచ్చని పోస్ట్‌మార్టం నివేదిక సూచించిందని లెఫ్ట్-అఫిలియేట్ జాయింట్ ఫోరమ్ ఆఫ్ డాక్టర్స్‌కు చెందిన ఒక వైద్యుడు పేర్కొన్నారు. 'ఇది ఒక్క వ్యక్తి చేసిన పని కాదని స్పష్టంగా తెలుస్తుంది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది.' అని పోస్ట్‌మార్టం నివేదికను చూసినప్పుడు అర్థమైందని పేర్కొన్నారు
వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు సంబంధించి కోల్‌కతా పోలీసులు ఇప్పటివరకు సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. మరోవైపు బుధవారం ఉదయం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారణ చేపట్టింది. మమతా బెనర్జీ ఉదాసీనత, కోల్‌కతా పోలీసుల కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అధికారులు చెస్ట్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ లోపల గది గోడలను పగలగొట్టారని బీజేపీ ఐటి సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఆరోపించారు.
'రెసిడెంట్ డాక్టర్స్ ఏరియాగా గుర్తించబడిన ప్రాంతం, చెస్ట్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ లోపల టాయిలెట్ (మహిళ) కూడా పునరుద్ధరణ పేరుతో విచ్ఛిన్నం చేశారు. నేరంలో పాల్గొన్న వారిని రక్షిస్తున్నారు. బెంగాల్‌లో ఏ స్త్రీ కూడా సురక్షితంగా లేదు.' అని అమిత్ మాల్వియా ఎక్స్‌లో రాశారు.
సెమినార్ గదికి కొన్ని అడుగుల దూరంలో ఉన్న ఒక గదిని, సమీపంలోని మహిళల టాయిలెట్‌ను కూల్చివేసి విశ్రాంతి ప్రదేశాన్ని నిర్మించాలని ఆసుపత్రి అధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై మాత్రం రాజకీయంగా దుమారం రేగింది. విద్యార్థి నేతలు మెడికల్ కాలేజీ దగ్గర నిరసనలు తెలుపుతున్నారు.
ఇప్పటికే చాలా సాక్ష్యాలను తారుమారు చేశారని బీజేపీ ఎమ్మెల్యే సువేందు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రిగానూ, రాష్ట్ర హోంమంత్రిగానూ ఉన్న మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును చేపట్టేందుకు సీబీఐ బృందం కోల్‌కతాకు చేరుకుంది. దిల్లీ నుంచి ప్రత్యేక వైద్య, ఫోరెన్సిక్ బృందంతో సీబీఐ కూడా వచ్చింది. అన్ని పత్రాలను వెంటనే సీబీఐకి అందజేయాలని కోల్‌కతా పోలీసులను కోర్టు ఆదేశించింది.