MUDA Land Scam : ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు.. బుధవారం విచారణ-karnataka cm siddaramaiah summons by lokayukta in mysuru land scam case questioning on november 6th ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Muda Land Scam : ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు.. బుధవారం విచారణ

MUDA Land Scam : ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు.. బుధవారం విచారణ

Anand Sai HT Telugu
Nov 04, 2024 09:14 PM IST

MUDA Land Scam : మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. బుధవారం ఆయనను ప్రశ్నించనుంది.

ముడా భూ కుంభకోణం కేసులో సిద్ధరామయ్యకు నోటీసులు
ముడా భూ కుంభకోణం కేసులో సిద్ధరామయ్యకు నోటీసులు (ANI Twitter)

ముడా కుంభకోణం కేసు కర్ణాటకలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్య పేరు రావడంతో దేశవ్యాప్తంగా చర్చ మెుదలైంది. ఈ భూ కుంభకోణం కేసుకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లోకాయుక్త బుధవారం ప్రశ్నించనుంది. విచారణలో భాగంగా ఆయన భార్య పార్వతిని లోకాయుక్త పోలీసులు ఇప్పటికే విచారించారు.

లోకాయుక్త ఈ కేసులో నిందితులందరికీ విచారణను ముగించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణ మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఆయన కూడా విచారణకు హాజరుకావాలని ఇప్పుడు నోటీసు జారీ చేశారు. దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న సిద్ధరామయ్య నిందితుడిగా విచారణ ఎదుర్కోవడం ఇదే తొలిసారి. బుధవారం(నవంబర్ 6న) సిద్ధరామయ్య విచారణకు హాజరుకానున్నారు.

లోకాయుక్త ఇప్పటికే ఏ2 పార్వతి సిద్ధరామయ్య, ఏ3 మల్లికార్జున, ఏ4 దేవరాజ్‌లను విచారించింది. అంతే కాకుండా ముఖ్యమంత్రి కుటుంబానికి కేటాయించిన స్థలాలను లోకాయుక్త అధికారులు స్థల పరిశీలన చేశారు. ఈ నోటీసులపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. 'ముడాకు సంబంధించిన కేసులో మైసూర్ లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 6న విచారణకు వెళ్తాను.' అని సిద్ధరామయ్య తెలిపారు.

సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొని ఆమెకు బహుమతిగా ఇచ్చారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతికి ముడా రూ.56 కోట్ల విలువైన 14 స్థలాలను కేటాయించడంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఈ భూమి వివాదంలో ఉండటం కారణంగా లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించాలని మైసూరులోని లోకాయుక్త పోలీసులను ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ముడా స్థల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సిద్ధరామయ్యపై కేసు నమోదు చేశారు.

Whats_app_banner