Jammu and Kashmir: సెప్టెంబర్ 18 నుంచి జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు; పూర్తి వివరాలు
Jammu and Kashmir: 2018 నుంచి ఎలెక్టెడ్ గవర్నమెంట్ లేని జమ్మూకశ్మీర్ కు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్మూకశ్మీర్ కు అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో, సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించి అక్టోబర్ 4న ఫలితాలను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 18న మొదటి దశ, సెప్టెంబర్ 25న రెండో దశ, అక్టోబర్ 1న చివరి దశ పోలింగ్ జరగనుంది.
ఆగస్ట్ 20 నుంచి నోటిఫికేషన్స్
జమ్మూకశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో తొలి దశలో సెప్టెంబర్ 18న 24 సీట్లకు, రెండో దశలో సెప్టెంబర్ 25న 26 స్థానాలకు, మూడో దశలో అక్టోబర్ 1వ తేదీన 40 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్లు ఆగస్ట్ 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. తొలి దశ ఎన్నికలు జరిగే సెప్టెంబర్ 18వ తేదీ గెజిట్ నోటిఫికేషన్ ఆగస్టు 20న విడుదల అవుతుంది. రెండో దశ ఎన్నికల కోసం ఆగస్టు 29న, మూడో దశ ఎన్నికల కోసం సెప్టెంబర్ 9న నోటిఫికేషన్లు విడుదల అవుతాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటించిన వారం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
87 లక్షల ఓటర్లు..
జమ్ముకశ్మీర్ లో మొత్తం 87.09 లక్షల మంది ఓటర్లు ఉండగా, పురుష ఓటర్ల సంఖ్య కన్నా మహిళా ఓటర్ల సంఖ్య స్వల్పంగా ఎక్కువ ఉంది. మొత్తం ఓటర్లలో 44.46 లక్షల మంది పురుషులు, 42.62 లక్షల మంది మహిళలు, 3.71 లక్షల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మొత్తం 11,800 పోలింగ్ కేంద్రాలు ఉంటాయని సీఈసీ తెలిపారు.ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున 735 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీఐ గణాంకాలు చెబుతున్నాయి.
జనరల్ స్థానాలు 74..
జమ్ముకశ్మీర్ లోని మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 74 జనరల్ కు, 9 షెడ్యూల్డ్ తెగలకు, 7 షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేశారు. అంతకుముందు జమ్మూకశ్మీర్ పర్యటన సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ ప్రజలకు ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. విచ్ఛిన్నకర శక్తులకు జమ్మూకశ్మీర్ ప్రజలు తగిన సమాధానం చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు ఎలాంటి అంతర్గత, బాహ్య జోక్యాన్ని అనుమతించబోమన్నారు.
2018 నుంచి..
2018 జూన్ లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తును తెంచుకున్నప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ (jammu and kashmir) లో ఎన్నుకోబడిన ప్రభుత్వం లేదు. పీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వానికి మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో సీఎం పదవికి ఆమె రాజీనామా చేయవలసి వచ్చింది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) మద్దతుతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కానీ 2018 నవంబర్ 28న అప్పటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ జమ్మూ కశ్మీర్ శాసనసభను రద్దు చేశారు. 2018 డిసెంబర్ 19న అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆర్టికల్ 356 ప్రకారం జమ్ముకశ్మీర్ రాష్ట్రపతి పాలన విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎనిమిది నెలల తర్వాత 2019 ఆగస్టు 5న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.