Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు సైనికులు, ఒక ప్రత్యేక పోలీసు అధికారి గాయపడ్డారు. దోడాలోని భదర్వా-పఠాన్ కోట్ రహదారిపై చటర్ గల్లా ప్రాంతంలో 4 రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసుల సంయుక్త చెక్ పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడిన భద్రతా సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలం నుంచి చివరి రిపోర్టు వచ్చే వరకు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఆపరేషన్ ను ముమ్మరం చేసేందుకు అదనపు భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపారు.
ఇటీవల జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు పలు ఉగ్రదాడులకు పాల్పడ్డారు. కథువాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు గాయపడ్డాడు. రియాసిలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు. మరో 42 మంది గాయపడ్డారు. కథువా జిల్లాలోని హీరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదా సుఖల్ గ్రామం కూటా మోర్హౌర్ లో దాక్కున్న ఉగ్రవాది ఆచూకీ కోసం పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
మంగళవారం సాయంత్రం అంతర్జాతీయ సరిహద్దు (IB) సమీపంలోని ఓ గ్రామంపై ఉగ్రవాదులు దాడి చేసి ఒక పౌరుడిని గాయపర్చడంతో భద్రతా దళాలు ఇద్దరు అనుమానిత పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చాయి. సీఆర్పీఎఫ్ సహకారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని, ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇటీవల అంతర్జాతీయ సరిహద్దు ద్వారా భారత్ లోకి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులు మంగళవారం సాయంత్రం గ్రామంలో ప్రత్యక్షం కావడంతో సైదా సుఖాల్ లో ఆపరేషన్ ప్రారంభమైంది. ఆ ఉగ్రవాదులు గ్రామస్తులను తాగడానికి నీరు అడిగారు. కొందరిపై దాడులకు పాల్పడ్డారు. దాంతో, గ్రామస్తులు కేకలు వేయడంతో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న హీరానగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO), సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టారు.