child pornography: ‘చైల్డ్ పోర్నోగ్రఫీ డౌన్ లోడ్ చేయడం, చూడడం కచ్చితంగా నేరమే; హైకోర్టు తప్పు చేసింది’: సుప్రీంకోర్టు
'చైల్డ్ పోర్నోగ్రఫీ'కి సంబంధించి మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'చైల్డ్ పోర్నోగ్రఫీ' డౌన్లోడ్ చేయడం, చూడడం నేరం కాదంటూ హైకోర్టు తీర్పునివ్వడం తప్పు అని వ్యాఖ్యానించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేయడం, చూడడం నేరాలేనని స్పష్టం చేసింది.
చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేయడం, తమ ఎలక్ట్రానిక్ డివైజెస్ లో స్టోర్ చేయడం, చూడటం నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలాంటి వీడియోలను స్టోర్ చేయడం లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (pocso act) కింద నేరమని తీర్పు చెప్పింది.
హైకోర్టు తప్పు చేసింది..
చైల్డ్ పోర్నోగ్రఫీ నేరమేనని స్పష్టం చేస్తూ, సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘హైకోర్టు తన ఉత్తర్వులలో తప్పు చేసింది. అందువల్ల మేము హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసాము. మేము కేసును తిరిగి సెషన్స్ కోర్టుకు పంపుతున్నాము" అని జస్టిస్ జేబీ పర్దివాలా అన్నారు. పోక్సో చట్టాన్ని సవరిస్తూ, అందులో చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదానికి బదులుగా ‘‘చైల్డ్ సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్ (Child Sexual Exploitative and Abusive Material)’’ అనే పదాన్ని వాడేలా పార్లమెంట్ (PARLIAMENT) చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు తన తీర్పులో సూచించింది. ఈ చట్టం ఆమోదం పొందే వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావచ్చని కోర్టు అభిప్రాయపడింది.
చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదం వాడొద్దు
చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడొద్దని సుప్రీంకోర్టు అన్ని కోర్టులను ఆదేశించింది. పోక్సోకు సవరణ తీసుకురావాలని తాము పార్లమెంటుకు సూచించామని వెల్లడించింది. ‘‘చైల్డ్ పోర్నోగ్రఫీ నిర్వచనాన్ని పిల్లల లైంగిక దుర్వినియోగం మరియు దోపిడీ (Child Sexual Exploitative and Abusive Material)’గా పేర్కొనాలని సూచించాం. ఈ విధంగా పోక్సో చట్టాన్ని మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకురావచ్చని ప్రభుత్వానికి సూచించాం. చైల్డ్ పోర్నోగ్రఫీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తావించవద్దని అన్ని కోర్టులను కోరాం’’ అని సుప్రీంకోర్టు తెలిపింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (pocso act), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. తన మొబైల్ ఫోన్ లో పిల్లల అశ్లీల కంటెంట్ ను డౌన్ లోడ్ చేసిన 28 ఏళ్ల వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది.